Friday

ఆస్తి వంద కోట్లు... చిన్న కారు లేదు బాసూ! పంజాబ్ సీఎం పుత్రరత్నం అఫిడవిట్ బాదల్ కుటుంబాల ఆస్తులే రూ.250 కోట్లు...


పంజాబ్‌లో రాజకీయ నాయకులంతా దాదాపు కోటానుకోటీశ్వరులే. కానీ, వారిలో కొందరికి అత్యంత ఖరీదైన కార్లుంటే, మరికొందరికి ఓ చిన్నకారుకూడా లేదట పాపం! ఆస్తుల విలువ కోట్లలో ఉన్నా ఓ చిన్నకారు కూడా లేదని చాలా మంది రాజకీయనాయకులు పేర్కొనడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఆస్తుల వివరాలు విస్తుగొలుపుతున్నాయి. బాదల్ వంశీయులలో రెండు కుటుంబాల ఆస్తుల విలువ రూ.250 కోట్లు.

వీరిలో ప్రకాశ్‌సింగ్ బాదల్ రూ.7 కోట్ల ఆస్తులతో అత్యంత పేద సీఎంగా మిగిలారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో వారు పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, అధికార శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, ఆయన భార్య హర్‌సిమ్రత్ కౌర్ (భటిండా ఎంపీ) ఆస్తులు రూ.76 కోట్లు, 15.36 కోట్లు. ఇంత ఆస్తి ఉంటేనేం... ఈ దంపతులకు ఓ ట్రాక్టరే తప్ప చిన్నకారు కూడా లేదట పాపం.

ప్రతిపక్ష కాంగ్రెస్ విషయానికొస్తే... మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ ఆస్తులు రూ.45.74 కోట్లు. ఆయన బంధువు అరవింద్ ఖన్నా ఆస్తులు రూ.46 కోట్లు. ఈయనపై విదేశీ మారకద్రవ్య చట్ట ఉల్లంఘన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండటం విశేషం. మరో మాజీ సీఎం, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాజీందర్ కౌర్ భట్టాల్ ఆస్తులు రూ.3 కోట్లు. జలంధర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి అవతార్ హెన్రీ ఆస్తులు రూ.14 కోట్లు.కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలామంది అత్యంత ఖరీదైన కార్లకు యజమానులేనట.

బీఎండబ్ల్యూ, ఫార్చూనర్, టయోటా, మెర్సిడెజ్ బెంజ్ ఇలా ఒకటేమిటి అన్ని రకాల ఖరీదైన కార్లు వీరి సొంతం. ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్‌కు అందించిన అఫిడవిట్లో అభ్యర్థులు పేర్కొన్నారు.పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ చీఫ్ మన్‌ప్రీత్ బాదల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన హోండా సీఆర్‌వీ, టయోటా ఫార్చూనర్, నిస్సాన్, విల్లీస్ వంటి 11 రకాల ఖరీదైన కార్లకు యజమాని.

మన్‌ప్రీత్ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పర్మీందర్ సింగ్, రాణా గుర్జిత్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సరబ్‌జిత్‌సింగ్ నిలిచారు. ఇంకా మాజీ క్రి కెటర్, బీజేపీ ఎంపీ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌కు కూడా బీఎండబ్ల్యూ, టయోటా క్రూజర్, ఫార్చూనర్ తదితర ఆధునాతన కార్లు ఉన్నాయి. అయినా నామినేషన్ సందర్భంలో సిద్ధూ మద్దతు దారులు సైకిళ్లపై రావడం గమనార్హం.

0 comments:

Post a Comment