Friday

నెట్‌పై ఉక్కుపాదం...!


ఇంటర్నెట్‌లో సమాచార నియంత్రణ విషయంలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు భారత సర్కారుకు మధ్య ఏర్పడ్డ వివాదం మరింత తీవ్రమవుతోంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అభ్యంతరకర సమాచారం ఉంటోందన్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా తీసుకొంటోంది.

ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యూహూ, యూట్యూబ్ సహా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను నిర్వహిస్తున్న 21 సంస్థలపై నేర అభియోగాలను మోపి.. ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. "జాతీయ సమైక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఈ కంపెనీలపై చట్టపరంగా చర్య తీసుకొనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి.

అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని సెక్షన్ 153-ఎ, 153-బి, 295-ఎ కింద కోర్టులో సమర్పించడానికి తగిన ఆధారాలున్నాయని భావించారు'' అని ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు కేంద్రం తెలిపింది.

ఈసారి హాజరు కావాల్సిందే: జడ్జి
ఇంటర్నెట్‌లో అభ్యంతరకర, అశ్లీల సమాచారాన్ని నెట్‌వర్కింగ్ సైట్లు ఉంచుతున్నాయంటూ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ వినయ్ రాయ్ దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుపై కోర్టు ఈ కేసును విచారిస్తున్న విషయం విదితమే. ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సుధీశ్ కుమార్.. ఆయా కంపెనీలకు తాను గత నెల 23న జారీ సమన్లు జారీ చేసినప్పటికీ.. కంపెనీల ప్రతినిధులెవరూ ఎందుకు కోర్టు ఎదుట హాజరు కాలేదని ప్రశ్నించారు.

ఫేస్‌బుక్ భారత శాఖ తరఫు న్యాయవాది.. కోర్టుకు ప్రత్యుత్తరమిస్తూ.. "పిటిషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 కంపెనీల్లో 10 కంపెనీలు విదేశాల్లో ఉన్నాయి. ఫేస్‌బుక్ చైర్మన్ ఉండేది కాలిఫోర్నియాలో. ఆరోపణలపై విచారణను మీరు కొనసాగించాలంటే విదేశాల్లో ఉన్న కంపెనీలకు సమన్లు జారీ చేసే ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుంది'' అంటూ కోర్టును కోరారు.

ఆ వెంటనే జడ్జి స్పందిస్తూ.. విదేశాల్లో ఉన్న ఈ కంపెనీలన్నింటికీ కోర్టు ఆదేశాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలంటూ విదేశాంగ శాఖను ఆదేశించారు. కేసు తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీల ప్రతినిధులు మార్చి 13న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. "ఈ ఒక్క రోజుకు మాత్రమే ఆ కంపెనీల ప్రతినిధులకు మినహాయింపు ఇస్తున్నాం.

తదుపరి విచారణ రోజు (మార్చి 13) మాత్రం వారు కచ్చితంగా హాజరు కావాల్సిందే'' అని జడ్జి తేల్చి చెప్పారు. కాగా.. అభ్యంతరకరమైన సమాచారాన్ని సామాజిక సైట్లలో ఉంచుతున్నందుకు నేర అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తాఖీదుల్లో ఈ కంపెనీలను కోర్టు హెచ్చరించింది. కాగా.. సైట్లపై ఢిల్లీ హైకోర్టు కూడా గురువారం కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే.

అభ్యంతరకర, అశ్లీల సమాచారాన్ని నిరోధించే ప్రత్యేక ఏర్పాటు చేయని పక్షంలో చైనా మాదిరిగా బ్లాక్ చేసేందుకు వెనుకాడేది లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ హెచ్చరించిన విషయం విదితమే. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నెట్‌వర్కింగ్ సైట్లను నిర్వహించే కంపెనీలకు గత డిసెంబర్ 23న ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు జారీ చేసిన తాఖీదులను సవాలు చేస్తూ.. ఢిల్లీ హైకోర్టును ఈ కంపెనీలు ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా.. ఢిల్లీ హైకోర్టు గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.

0 comments:

Post a Comment