Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Tuesday

మేటివిలుకాడు...

బటన్ అనేరాజ్యాన్ని పరిపాలించే రాజుకు విలువిద్య అంటే ప్రాణం.అనేకమంది రాజులు,సంపన్నులు,గుర్రపుస్వారీ,ఆటపాటలు,వస్తాదుల కుస్తీ పోటీలతో కాలక్షేపం చేస్తుంటే ఈరాజుకు మాత్రం విలువిద్యను మించిన వ్యాపకం మరొకటిలేదు.రాజాస్థానంలోని మంత్రులు,ఉద్యోగులకు రాజకీయాలు,భక్తి,సాహిత్యాలను గురించి చర్చించుకోవటం ఇష్టమయినా రాజు కొరకు వాళ్ళందరూ తమ సంభాషణలను విలువిద్యమీదకే మళ్ళించేవారు.
ఆ రాజ్యంలో ఎందరో యువకులు రాజుగారి కుమార్తెను పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరుతుండేవారు.ఆ విషయమై ఎన్నో ప్రయత్నాలు కూడా చేసారు.కానీ,గొప్ప విలుకాడు అయిన వీరుడికే తనకుమార్తెను ఇచ్చి వివాహాం చేస్తానని రాజు స్పష్టం చేసాడు.ఆసంగతి ఆనోటా,ఈనోటా దేశమంతటా పాకింది.
బజన్ బుడిమాన్ అనేవ్యక్తి ఎలాగైనా రాకుమారిని భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.అతను నూకలు చల్లి,వలవేసి కొన్ని పక్షులను పట్టగలిగాడు,తర్వాత వాటన్నిటికి కుడికన్ను తొలగించాడు.ఒక తాడుకు వాటన్నిటినీ కట్టి,‘ఒంటికంటి పిట్టలు అమ్ముతాం,ఒంటికంటి పిట్టలు అమ్ముతాం’అని అరుస్తూ వీధుల్లో తిరుగటం మొదలుపెట్టాడు.కానీ,ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.అలాగే అరుస్తూ,తిరుగుతూ రాజుగారి కోట గుమ్మం ముందుకు వచ్చాడు.‘ఒంటికంటి పిట్టలు అమ్ముతాం’అంటూ కేకలు పెట్టాడు.ఒంటికంటి పిట్టలు అనే మాట వినడంతో కోటలో సైనికులు,పరిచారికలు పగలబడి నవ్వటం మొదలుపెట్టారు.తన పరివారం ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకున్న రాజు,ఆ అరిచే వాడిని తనముందు ప్రవేశపెట్టమన్నాడు.వేటగాడిని తెచ్చి రాజుముందు నిలబెట్టారు.
‘మహారాజా, ఇవి చాలా తాజా పక్షులు, ఇవ్వాళ ఉదయాన్నే పట్టాను’అని చెప్పుకొచ్చాడు బజన్. ‘అవునూ,ఒక్కకన్ను పక్షుల్నే ఎలా పట్టగలిగావు’అని ఆరా తీసాడు రాజు.దానికి,‘అవి మామూలుగా రెండు కళ్ళు ఉన్న పక్షులే ప్రభూ,కాకపోతే,నేను వాటిని నాబాణంతో కుడికంటిలో కొట్టి పట్టగలిగాను’అని వివరించాడు బజన్.
‘ఏమిటి మాతోటి వేళాకోళమా?’అని కోపగించుకున్నాడు రాజు ఆ మాటలకు.‘కాదు ,మహారాజా,తమరే పరీక్షించండి’అని కోరటంతో రాజు వాటిని శ్రద్ధగా పరిశీలించాడు. అన్ని పక్షులకూ కుడికంటిలో బాణం దెబ్బతగిలినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు.‘ఇంతకు ముందు నీగురించి నేనెప్పుడూ వినలేదే?మన రాజ్యం మొత్తం మీద నిన్ను మించిన విలుకాడు లేడ’ని కితాబిచ్చాడు రాజు.
‘నాదేముంది ప్రభూ,ఏదో పొట్టకూటి కోసం పిట్టలను పట్టుకుని బ్రతికేవాడిన’ని వినయంగా బదులిచ్చాడు బజన్.‘బజన్,విలువిద్యతో పాటు వినయం కూడా ఉన్న నీవే  రాకుమారికి తగిన భర్తవ’ని రాజు ప్రకటించాడు.దానికి మరింతవినయంగా‘మీరిచ్చే బహుమతిని అందుకోవటానికి నాలాంటి నిరుపేద,అజ్ఞాని తగడు మహారాజా’అని బదులిచ్చాడు. ‘లేదయ్యా,నీలాంటి భర్త దొరకటం మాఅమ్మాయి అదృష్టం అని మరింతగా ప్రశసించాడు రాజు ఆనందంతో.‘ప్రభూ,మీ అమ్మాయి నన్ను పెళ్ళాడినా,నాతో పూరి గుడిసెలో ఉంటూ పొట్టకూటి కోసం ఇదిగో ఈ ఒంటి కంటి పిట్టలను అమ్ముకోవాల్సిందే’అని నిరాశగా అన్నాడు బజన్.

‘ఇంకా నువ్వు ఆ పిట్టలూ,ఈపిట్టలూ ఎందుకమ్ముతావోయ్?!వీరాధివీరవిలుకాడిగా,ఇక్కడే
మాతోటి రాజభవనంలో నివసిస్తావు గానీ’అని వివరించాడు రాజు.బజన్ ను లోపలికి తీసుకుపోయి స్నానం చేయించి.చక్కగా అలంకరించి,కొత్తబట్టలు ధరింపజేయమని ఆజ్ఞాపించాడు.తర్వాత ఒకవారం రోజులతర్వాత బజన్ కు,రాజకుమారికి రంగరంగ వైభవంగా వివాహం జరిగింది.విందులు,వినోదాలతో కొన్నిరోజులు క్షణాల్లా గడిచిపోయాయి.
ఒకరోజు,‘బజన్,నీ విలువిద్యానైపుణ్యాన్ని చూడాలని మాకెంతో ఉబలాటంగా ఉంది,ఈరోజు ధనుర్విద్య ప్రదర్శనతో మమ్ముల్ని ముగ్ధులిని చెయ్యాల’ని కోరాడు రాజు.‘అయ్యో,నా విల్లంబులు లేవే?’అని తప్పించుకునేందుకు ప్రయత్నించాడు బజన్.‘ఇంకా ఆ విల్లెందుకు?మా ధనస్సు ఉపయోగించు’అని రాజు తన విల్లంబులు బజన్ కు అందజేసాడు.‘సాయంత్రం వరకూ ఆగి అప్పుడు చూద్దాం’ అని సమాధానమిచ్చాడు బజన్.‘అలా కాదు,నీ ప్రతిభాపాటవాలు చూడాలని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చారు,వారిని నిరాశపర్చటం సమంజసం కాదు,ఇప్పుడే,ఇక్కడే నీ కౌశల్యం ప్రదర్శించాలని రాజు గట్టిగా చెప్పాడు.
బజన్ కు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.అందరూ బజన్ ఎప్పుడు తనవిద్యను ప్రదర్శించటం మొదలుపెడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చివరికి చేసేదేమీ లేక విల్లు ఎక్కుబెట్టి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు.పైన కొంగలు బారులుబారులుగా ఎగురుకుంటూ పోతున్నాయి.అయిపోయిందిరా బజన్ పని అయిపోయింది,రాజకుమారితో నీపెళ్ళి ముచ్చట మూడురోజుల్లో ముగిసింది,బాణాన్ని వదిలావా నీ పని అయిపోయినట్టే,కాకపోతే ఎలా బాణం వదలాలో కూడా నాకు తెలిసి చావదే’అంటూ లోలోపల మధనపడిపొతున్నాడు బజన్.విగ్రహంలా అలా నిలబడిపోవటం తప్ప విల్లంబులకు పని చెప్పకపోవటంతో జనానికి విసుగెత్తింది.
‘వీడికసలు నిజంగా విలువిద్య వచ్చంటావా?’అంటూ ఒకడు పక్కవాడిని అడిగాడు.‘చూడబోతే వచ్చినట్టు లేదే ’అన్నాడు ఆపక్కవాడు.మరో పక్కవాడు ‘రానట్టుగా ఉంది ’అంటూ పెదవి విరిచాడు.ప్రజలు రకరకాలుగా అరుస్తున్నారు,కేకలు పెడుతున్నారు,ఎగతాళి చేస్తున్నారు కానీ బజన్ ఉలకడు,పలకడు.విసుగుతోపాటు కోపమొచ్చిన కుర్రాడొకడు,రాకుమారిని పెళ్ళాడాలని కోరుకున్న వారిలో ఒకడు వీడికేం రాదంటూ బజన్ వీపు మీద చరిచాడు.హఠాత్తుగా తగిలిన దెబ్బకు ఉలికిపడి బజన్ బాణాన్ని గాలిలోకి విడిచాడు.ఆబాణం వెళ్ళి అటుగా ఎగురుతున్న కొంగలగుంపులో ఒకకొంగ మెడలో గుచ్చుకుంది.బాణం పైకిపోయినంత వేగంగా కొంగకిందపడింది.జనమంతా ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.
రాజు ముందుకొచ్చి ‘గాలిలో ఎగిరేకొంగను మెడలో తగిలేలా కొట్టగలగటం అనేది ఎంతో అద్భుతం’
అంటూ ప్రశంసించాడు.అయితే బజన్ మాత్రం చాలా ఇబ్బందిగా ముఖం పెట్టి,‘ఈరోజు నా పరువంతా పోయింది,నేను ఎప్పుడూ పక్షుల్ని గురితప్పకుండా కుడికంటిలోనే కొట్టేవాడిని,ఇడుగో ఈ తలతిక్క వెధవ నన్ను వీపు మీద చరవకపోతే చక్కగా,ఆకొంగ కుడి కంటికి తగిలేలా నా బాణం వదిలేవాడిని.మిగిలిన కొంగలు బజన్ ప్రతాపం తగ్గిపోయిందని దేశదేశాల్లో ప్రచారం చేస్తాయే!?అద్దంలో నా ముఖం నేను ఎలా చూసుకోను ఇకపై,మిగతా వారికి ఎలా చూయించను?!ఇకముందు,జీవితంలో మళ్ళీ విల్లంబుల్ని నాచేతితో తాకను అని దేవుడిమీద ఒట్టుపెట్టుకుంటున్నాను’అంటూ ధనుర్బాణాలను ముక్కలుముక్కలుగా చేసాడు.బజన్ వీపుమీద కొట్టినవాడికి కొరడాదెబ్బల శిక్షపడింది.రాజు తర్వాత ఆ రాజ్యానికి బజన్ రాజయ్యాడు.
Read more >>

Monday

గునో ఆకలి...

గునో(సహకారి) తను తయారుచేసిన కత్తులను పక్కఊరిలో అమ్మేందుకు వేకువనే బయలుదేరాడు.అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు చాలా సమయమవుతుంది కాబట్టి దారిలో తినేందుకు ఆరు దిబ్బరొట్టెలు తయారుచెయ్యమని భార్యకు చెప్పాడు.ఆమె ముందురోజు రాత్రి తయారుచేసి గునోకు ఇచ్చింది.మంచినీళ్ళు,దిబ్బరొట్టెలు తీసుకుని పొరుగూరికి ప్రయాణమయ్యాడు గునో.సూర్యుడు ఇంకా ఉదయించకముందే అతనికి ఆకలి మొదలయ్యింది.పూర్తిగా తెల్లారలేదని తెలిసినా,ఆకలి దెబ్బకు తట్టుకోలేక మూటవిప్పి ఒకరొట్టె తిన్నాడు.కానీ ఆకలి తీరలేదు.మరో రొట్టె తిందాం,మిగిలిన నాలుగు మధ్యాహ్నానానికి దాచుకోవచ్చు అనుకుని రెండో రొట్టెకూడా తినేసాడు.అప్పటికీ కడుపు నిండలేదు.దానితో తనలో తనే తర్కించుకున్నాడు ఏం చెయ్యాలా అని.సరే,మాపటికి ఒకటి దాచుకుని మిగిలినవి తినిచూద్దాం,అప్పుడయినా ఆకలి తీరుతుందేమోనన్న ఆలోచనతో మరోమూడు రొట్టెలు గబగబా తినేసాడు.అయిదురొట్టెలు తిన్నా కడుపులో మంట చల్లారకపోవడంతో ఆఖరుది,అరోది కూడా శుభ్రంగా తిని చేతులు కడుక్కున్నాడు.దానితో అప్పటివరకూ గునో కడుపులో పరిగెడుతున్న ఎలుకలు పారిపోయిన భావం కలిగి,తృప్తిగా అనిపించింది.‘చూసావా,నాకడుపు నన్ను ఎంతమోసం చేసిందో,అయిదురొట్టెలు తిన్నా తీరని ఆకలి ఆరో రొట్టెకు తగ్గిపోయింది.ఆపనేదో ముందు చేసి ఆరో రొట్టెనే మొదట తిన్నట్టయితే చక్కగా అయిదురొట్టెలు మిగిలేవి కదా,ఇకపై ఇలాంటి తెలివితక్కువ పని ఎప్పుడూ చెయ్యకూడదని నిర్ణయించుకుని ప్రయాణమై వెళ్ళిపోయాడు సహకారి గునో.
Read more >>

Sunday

కోతి తెచ్చిన తగవు

పూర్వం అడవిలో జంతువులన్నీ స్నేహితుల్లా కలసిమెలసి ఉండేవి.కొంతకాలానికి ఒక చిన్న తగాదా వచ్చి
రెండు వర్గాలుగా విడిపోయాయి. అది ఎలా జరిగిందంటే…
ఒక రోజు మట్జన్ అనే పులి,గడ్జా అనే ఏనుగు అడవిలో షికారుగా,కబుర్లు చెప్పుకుంటూ
నడుస్తున్నాయి.అలా కొంత దూరంపోయాక మట్జన్ తలెత్తిచూసింది.అలా చూసేసరికి లోటంగ్ అనే కోతి
కొమ్మలమీదుగా వాటిని అనుసరించి వస్తున్నట్టు గ్రహించింది.లోటంగ్ ఏదేదో అంటూ తన కోతిచేష్టలతో
మట్జన్ కు కోపమొచ్చేలా చేసింది.‘లోటంగ్ అంటేనే నాకు చిరాకు,చూడు, మనమేదో్ మాట్లాడుకుంటూ ఉంటే
అది పొంచిమనమాటలు వింటోంది,పైగా,మనతో మాటలు కలపాలని చూస్తుంది.ఇక లాభం లేదు,నువ్వు
కనుక దాన్ని ఇక్కడినుంచి వెళ్ళగొట్టగలిగితే,నన్ను తినేయవచ్చు,అలా కాకుండా,నేను తరిమేస్తే నిన్ను
ఏదో సరదాకు అందికదా అని భావించి తొండమెత్తి,గట్టిగా లోటంగ్ వంక చూస్తూ ఘీంకరించింది.ఆ
ఘీంకారానికి ఆకులు అల్లాడిపోయాయి,అడవంతా ప్రతిధ్వనించింది.కానీ,లోటంగ్ అడుగు కూడా
కదపలేదు.తర్వాత మట్జన్,లోటంగ్ వంక క్రూరంగా చూస్తూ భీకరంగా గర్జించింది. మట్జన్ కు
కోపమొస్తే కొరికి తినేస్తుందనే భయంతో వణికిపోతూ లోటంగ్ చెట్టుకొమ్మల మీద నుంచి
కిందపడి,నడుము,కాళ్ళూచేతులు విరగగొట్టుకుని అక్కడి నుంచి పారిపోయింది.అప్పుడు మట్జన్,గజ్డా
దగ్గరికి వచ్చి,‘మన ఒప్పందం ప్రకారం ఇక నిన్ను తినెయ్యటమే ఆలస్యం’అంది.దానికి
గడ్జా ‘అలాగే,కాకపోతే నేను నీకు ఆహారమయ్యేలోపు నా కుటుంబసభ్యులతో కలపి కాలం గడిపేందుకు
ఒక్కరోజు గడువు కావాలి’అని కోరింది.మట్జన్ అంగీకరించింది.గజ్డా విచారంగా ఇంటికి చేరింది.అతను
దిగాలుగా ఉండటం చూసిన అతని భార్యాబిడ్డలు ఎందుకలా ఉన్నావని గజ్డాను అడిగారు.గజ్డా తమ
ఒప్పందం గురించి చెప్పాడు.దానితో అందరూ ఒక్క సారిగా ఘొల్లుమన్నారు.ఆ విధంగా గజ్డా గడువు
సమయం దగ్గర పడగానే గజ్డా బయలుదేరింది.ఈలోపు అటువచ్చిన కంచిల్ అనే జింక ‘ఏనుగులు
ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది.శోకాలు ఆపి అసలు సంగతి వివరించ’మంది.గజ్డా పూసగుచ్చినట్టు
మొత్తం చెప్పింది.‘ఓస్,ఇంతేనా!దీనికో ఉపాయం చెపుతాను,ముందు వెళ్ళి పోకకాయల రసం
తయారుచేసుకు రమ్మంది కంచిల్.గజ్డా భార్య ఆ రసం తయారు చేసుకువచ్చింది.కంచిల్ గజ్డా మీదకు
ఎక్కి వీపుమీద,తలమీద ఆ రసం ఒలకపోసింది.చూసేవాళ్లకు రక్తం లా కనిపిస్తుంది పోకకాయల
రసం.‘నేను ఈ రసం నాకుతున్నప్పుడు నువ్వు చచ్చిపోతున్నట్టు కేకలు పెట్టు’అంది కంచిల్.సరేనని
ఒప్పుకుంది గజ్డా.అవి రెండూ మట్జన్ దగ్గరకు బయలుదేరాయి.
అంత దూరంలో మట్జన్ ను చూడగానే పోకరసాన్ని నాకుతున్నట్టు కంచిల్ అభినయం
మొదలుపెట్టింది,దానితో గజ్డా ప్రాణం ఓ వైపునుంచి పోతున్నట్టుగా ఆర్తనాదాలు చేయటం
మొదలుపెట్టింది.ఆ దృశ్యం చూసిన మట్జన్ కు మతిపోయినంత పనయ్యింది.‘నేను
చచ్చిపోతున్నాను,నన్ను ఈ క్రూరమృగం,రాకాసి చంపుకుతినేస్తుంది నాయనోయ్’అంటూ గజ్డా కేకలు
పెడుతుంటే మట్జన్ తనకళ్ళను తానేనమ్మలేకపోయింది.ఏమీ దొరక్కఏనుగును తింటున్నాను
ఇష్టం,లొట్టలేసుకుంటూ తింటాను’అంటూ చిందులేయసాగింది కంచిల్.ఆకేకలు,అరుపులు చూసి
మట్జన్ కు పైప్రాణం పైనే పోయి బతికుంటే చాలనుకుంటూ,అడ్డొచ్చిన గుట్టలుపుట్టలూ
దూక్కుంటూ పారిపోసాగింది.పరుగెత్తి,పరుగెత్తి అలుపొచ్చి.రొప్పుతూ ఒకచోట నిలబడిపోయింది.ఈలోపు
ఉరాంగుటన్ అనే ఒకకోతి వచ్చి ‘ఏం,మట్జన్ అడవేమన్నా అంటుకుందా?లేక వేటగాడెవడన్నా నిన్ను
తరుముకొస్తున్నాడా?అని ప్రశ్నించింది.‘అంతకంటే భయంకరం బాబోయ్’ అంటూ గుండెలు బాదుకోసాగింది
మట్జన్.‘అవునా,అదేమిటో చూద్దాం రా అని’ఉరాంగుటన్ ముందు బయలుదేరింది.మొదట రానని మొడికేసిన
మట్జన్ మెల్లగా ఆకోతి వెనుక కంచిల్,గడ్జా ఉన్నచోటకు వెళ్ళాయి.
ఈజంటను చూడగానే‘ఏం ఉరాంగుటన్,రోజూ రెండు పులులను నాకు ఆహారంగా
తెచ్చేవాడివి,ఇవ్వాళేమిటి ఒక్క పులినే తెచ్చావు?అంటూ కోపంతో కేకలు పెట్టింది కంచిల్.ఆమాటలతో
మట్జన్ మళ్ళీ అక్కడ కనబడితే ఒట్టు.అప్పటినుంచి పులి ఏనుగులు,కోతులతో కలసి తిరగదు.కానీ
ఏనుగులు,జింకలు మాత్రం అన్నదమ్ముల్లా కలసిమెలసి తిరుగుతుంటాయి.అదర్రా సంగతి
Read more >>

Saturday

చిట్టి ఉడుత ఉర్రూతలు!

చిన్న చిన్న రెమ్మల వీడి
చిట్టి ఉడుత ఉర్రూతలు
నిటారు కొమ్మలకెదిగే
పళ్ళొచ్చేసే, వొళ్ళు బూరయ్యే
మొత్తంగా మరి చూపొచ్చేసే
ఇక చెట్టు దిగి పరుగులెట్టచ్చు
పప్పుగింజలేరుకోవచ్చు
దరికావల కొత్త ఉడుతల కిచకిచలు
సావాసాలు చిందులాటలు ఆరాటాలు
సరిలే దరి దాటచ్చులే
తేరిపార చూడవలె
భధ్రంగా నుండవలె
దారుల్లో బారులుగా జోరుగా
వెరపెరుగని చక్రాల బండ్లు
శరవేగంగా పరుగులెట్టేవే గాని
ఆగి పరామర్శించేవి కావు సుమా
చిట్టి ఉడుత దరి దాటడాలు
తికమకలో చిట్టి, గంతులాటల్లో చిట్టి
‘కీచ్.. మంటూ ఆగీ ఆగని బండి చక్రాలు
నలిగిపడె చిట్టి ఉడుత లేత పాదాలు
ఆగి పోయే చిట్టి ఉడుత ఊపిరులు
ఒదిగె చిట్టి ఉడుత పసి వొళ్ళు
చిట్టి ఉడుతా! తగనే తగవు
నీకీ తొందరలు, ఇంతలా ఉరకలు
(చిట్టి ఉడుతలు పుట్టినప్పుడు చూపు,
బూరు, పళ్ళు లేకపోవడం, ఆ పై తరుగుతూనే పెరుగుతూ పోయే ముందు పళ్ళు ఉండడం విశేషం)
Read more >>

Friday

ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ఉన్నాయి...

పొలంలో పనులన్నీ ముగించుకుని  ఒక రైతు సాయంత్రం యింటికి తిరిగివస్తున్నాడు.బాగా అలసిపోయి ఉండటంతో,ఎప్పుడెప్పుడు ఇల్లుచేరి స్నానం చేసి,భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామా అని అతని మనసు తహతహలాడుతుంది.అలా నడుస్తూ ఒకరాళ్లగుట్ట దగ్గరకు వచ్చాడు.ఆరాళ్ళ సందుల్లో ఒకపులితోక ఇరుక్కుని,చాలా పెద్దది,కిందకీ,పైకీ కదులుతోంది.
రైతు భయంతో వణికిపోయాడు.పులితోకను వదిలించుకుని రైతుమీదకు దూకాలని ప్రయత్నించింది.కానీ రైతు పులితోకను అతనివైపుకు లాగాడు.పులి భీభత్సంగా గర్జిస్తూ,బుసలుకొడుతుంది.రైతు చెమటతో ప్రాణభీతితో తడిసి ముద్దయి పోయాడు.కొంతసేపయ్యాక అ దారివెంట ఒకముని వెళుతూ కనిపించాడు.
ఓహొ!దేవుడే ఈ సాధువును పంపించాడని భావించి.‘స్వామీ,అదిగో నేలమీద నా కొడవలి ఉంది,ఈపాడు పులిని  చంపి నాప్రాణం కాపాడండి’అంటూ బతిమలాడాడు రైతు.ఆ ముని రైతు వైపు ప్రశాంతంగా చూసి ‘ప్రాణాలు తీయటమనేది నా సిద్ధాంతాలకు విరుద్ధం’ అన్నాడు. ‘అయ్యో అవేం మాటలు స్వామీ,నేను ఈ తోకను వదిలేస్తే పులి నామీద పడి హతమారుస్తుంది’అని వేడుకున్నాడు.‘నేనేం చెయ్యలేను నాయనా,మా మతవిశ్వాసాల ప్రకారం,ఏజీవరాశి ప్రాణం తీయకూడదు’శెలవిచ్చాడు ముని.‘మీరు నాకు సాయం చెయ్యకపోతే ఈ పులి నన్ను చంపుతుంది,అప్పుడు నాచావుకు కారణం మీరే అవుతారు గదా! అని తర్కించాడు రైతు.దానికి కూడా,‘అడవిలో బలమైన జంతువు బలహీనమైన ప్రాణిని చంపటమనే సామాన్య ఆటవిక న్యాయముంటుంది,దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను,శాస్త్రాలలో జీవహింస చేయకూడదూ అని ఆజ్ఞాపించారు’అంటూ చెప్పుకొచ్చాడు మునివర్యుడు.
రైతు చేతుల్లో ఓపిక మెల్లగా క్షీణిస్తుంది.ఏ క్షణాన్నైనా పులి తప్పించుకుపోయే ప్రమాదం ఉంది.దానితో ఒక ఉపాయం ఆలోచించాడు అతను.
‘స్వామీ,శాస్త్రాలకు వ్యతిరేకంగా మీరు ఎందుకు చెయ్యాలి కానీ,మీరు పులిని చంపొద్దు,కాకపోతే నాకొక చిన్న సాయం చెయ్యండి.మీరు పులి తోక పట్టుకోండి.నేను దాని సంగతి చూస్తాను’అని బతిమలాడుకున్నాడు.
‘పులితోక పట్టుకొవద్దని మా పురాణాల్లో చెప్పలేదులే,కాబట్టి,నువ్వడిగినట్టు చేస్తాను’ అన్నాడు ముని.రైతు చేతుల్లో నుంచి పులితోక పట్టుకున్నాడు.రైతు పక్కకు వచ్చి కండువాతో చెమట తుడుచుకుని తాపీగా,‘పట్టుకున్నావా?’ అని అడిగాడు.‘ఆ.. పట్టుకున్నాను’ చెప్పాడు ముని.‘గట్టిగా పట్టుకున్నావా?లేదా?అడిగాడు రైతు.‘ఆహా,గట్టిగానే పట్టుకున్నాను’అని బదులిచ్చాడు ముని.
కింద ఉన్న కొడవలి తీసుకుని,బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకుని,తన ఊరికేసి బయలు దేరాడు రైతు.పులి మళ్ళీ ముందుకు లాగటం మొదలుపెట్టింది.మునికి అప్పుడు ప్రాణభయం అంటే ఏమిటో తెలియటం మొదలయ్యింది.‘త్వరగా వచ్చి పులిని చంపు,చంపేయ్’అంటూ అరవసాగాడు.రైతు అవేమీ వినిపించుకోకుండా తన ఊరివైపు వెళుతూనే ఉన్నాడు.
‘ఓయ్,ఎక్కడికి వెళ్తున్నావ్?ఇదిగో నేను ఈతోక ఎక్కువ సేపు పట్టుకోలేను,వచ్చి పులిని నరికేయ్’అంటూ కేకలు పెడుతున్నాడు.ఆకేకలకు రైతు ఆగి,‘స్వామీ,జీవహింస చెయ్యకూడదు అనే మీ హితోపదేశం విన్నాక,నేను కూడా పూర్తిగా మారిపోయాను,భూతదయ అలవర్చుకున్నాను.నన్ను మార్చారు స్వామీ మీరు,పులితోకను అలాగే పట్టుకోండి ఓపికగా,మన సిద్ధాంతలు నమ్మనివారెవరన్నా ఇటువచ్చి మిమ్మల్ని విడిపిస్తారు,శెలవు స్వామీ అంటూ మునికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు రైతు.
Read more >>