Monday

గునో ఆకలి...

గునో(సహకారి) తను తయారుచేసిన కత్తులను పక్కఊరిలో అమ్మేందుకు వేకువనే బయలుదేరాడు.అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు చాలా సమయమవుతుంది కాబట్టి దారిలో తినేందుకు ఆరు దిబ్బరొట్టెలు తయారుచెయ్యమని భార్యకు చెప్పాడు.ఆమె ముందురోజు రాత్రి తయారుచేసి గునోకు ఇచ్చింది.మంచినీళ్ళు,దిబ్బరొట్టెలు తీసుకుని పొరుగూరికి ప్రయాణమయ్యాడు గునో.సూర్యుడు ఇంకా ఉదయించకముందే అతనికి ఆకలి మొదలయ్యింది.పూర్తిగా తెల్లారలేదని తెలిసినా,ఆకలి దెబ్బకు తట్టుకోలేక మూటవిప్పి ఒకరొట్టె తిన్నాడు.కానీ ఆకలి తీరలేదు.మరో రొట్టె తిందాం,మిగిలిన నాలుగు మధ్యాహ్నానానికి దాచుకోవచ్చు అనుకుని రెండో రొట్టెకూడా తినేసాడు.అప్పటికీ కడుపు నిండలేదు.దానితో తనలో తనే తర్కించుకున్నాడు ఏం చెయ్యాలా అని.సరే,మాపటికి ఒకటి దాచుకుని మిగిలినవి తినిచూద్దాం,అప్పుడయినా ఆకలి తీరుతుందేమోనన్న ఆలోచనతో మరోమూడు రొట్టెలు గబగబా తినేసాడు.అయిదురొట్టెలు తిన్నా కడుపులో మంట చల్లారకపోవడంతో ఆఖరుది,అరోది కూడా శుభ్రంగా తిని చేతులు కడుక్కున్నాడు.దానితో అప్పటివరకూ గునో కడుపులో పరిగెడుతున్న ఎలుకలు పారిపోయిన భావం కలిగి,తృప్తిగా అనిపించింది.‘చూసావా,నాకడుపు నన్ను ఎంతమోసం చేసిందో,అయిదురొట్టెలు తిన్నా తీరని ఆకలి ఆరో రొట్టెకు తగ్గిపోయింది.ఆపనేదో ముందు చేసి ఆరో రొట్టెనే మొదట తిన్నట్టయితే చక్కగా అయిదురొట్టెలు మిగిలేవి కదా,ఇకపై ఇలాంటి తెలివితక్కువ పని ఎప్పుడూ చెయ్యకూడదని నిర్ణయించుకుని ప్రయాణమై వెళ్ళిపోయాడు సహకారి గునో.

0 comments:

Post a Comment