Tuesday

ఆప్ఘాన్ పవిత్ర క్షేత్రాల్లో రెండు భారీ పేలుళ్లు 58 మంది మృతి, 150 మందికి గాయాలు

Bystanders at the scene of the Kandahar blast
షియాల దీక్షాకాలమైన అషూరా చివరి రోజు (మొహర్రం) నాడు అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో గల మసీదు వద్ద, పవిత్రక్షేత్రమైన మజారే షరీఫ్‌లోను మంగళవారం జరిగిన భారీ పేలుళ్లలో 58 మంది మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారని కాబూల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గులాం సాఖీ కర్గార్ నూరుఘ్లీ ఇక్కడ చెప్పారు. వీటిలో కాబూల్‌లో నది ఒడ్డునగల మసీదు వద్ద జరిగినది ఆత్మాహుతి దాడి. ఈ పేలుళ్లతో ఈ రెండు ప్రదేశాల్లోనూ మరణించిన వారి దేహాలు తునాతునకలై రక్తం మడుగుల్లో పడి ఉండిన దృశ్యాలు ఒళ్లు జలదరింపజేస్తున్నాయి.

ఈ ఘాతుకాలకు కారకులెవరో తెలియకపోయినప్పటికీ అల్ కాయిదా, తాలిబన్లే కారణమని ఈ దారుణ సంఘటనల నుంచి బతికి బయటపడిన వారు విలపిస్తూ ఆరోపిస్తున్నారు. అయితే, వీటితో తమకు సంబంధం లేదని తాలిబన్ ప్రకటించింది. ఈ పేలుళ్లను హేయమైన చర్యగా ఖండిస్తూ, ఇస్లాం వ్యతిరేకుల పని ఇదని పేర్కొంది. 2014 చివరిలోగా అఫ్ఘాన్‌నుంచి అంతర్జాతీయ సేనలను ఉపసంహరించిన అనంతరం, మరో పదేళ్లు పాటు అంటే 2024 వరకు అఫ్ఘాన్‌కు అంతర్జాతీయ సహకారం అందించడానికి జర్మనీ రాజధాని బాన్‌లో సోమవారం జరిగిన అంతర్జాతీయ సమావేశంలో అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ పేలుళ్లకు ప్రాధాన్యం ఏర్పడింది.

0 comments:

Post a Comment