Tuesday

ప్రమాదం అంచున భారత్

(CC) christopherhu/Flickr

Kids taking care of little kids. A scene in front of the Madras High Court. Photo: R. Shivaji Rao.

డాలర్ మారకంలో రూపాయి విలువ అదే పనిగా క్షీణిస్తుండటం ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నది. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఎదుర్కోనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు దేశీయ ఆర్ధిక రంగంలోని మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్‌ను బాగా భయపెడుతున్నది. రూపాయి పతనాన్ని చూస్తూ ఊరుకోమని ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. నిజానికి చేయగలిగింది కూడా లేదు. ఆర్‌బిఐ దగ్గర మొత్తం 30,000 కోట్ల డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం పోర్టుఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా సమకూరినవే. ఇటీవల ఎఫ్ఐఐలు కొత్త పెట్టుబడులు తేవడం అటుంచి పాత పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. అంటే స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన ఎఫ్ఐఐల పెట్టుబడులన్నమాట. ఇప్పటి వరకు ఆర్‌బిఐ ఆచితూచి మాత్రమే మార్కెట్‌లో జోక్యం చేసుకుంటూ వస్తున్నది.

పైగా ఆర్‌బిఐ నుంచి మార్కెట్‌కు అందుతున్న సిగ్నల్స్ కూడా రూపాయికి అనుకూలంగా లేవు. ఆర్‌బిఐ ధోరణిపై ఎఫ్ఐఐలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆర్‌బిఐ ఇదే ధోరణి కొనసాగిస్తే పోర్టుఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఆర్‌బిఐ దూకుడుగా రంగంలోకి దిగి డాలర్లను మార్కెట్‌లోకి వెదజల్లితే.. అది కూడా తీవ్రమైన విమర్శలకు దారితీస్తుంది. యూరో సంక్షోభం కారణంగా పతనమౌతున్న రూపాయిని కృత్రిమపద్ధతుల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఉన్న ఫారెక్స్ రిజర్వ్‌లు కాస్తా హరించుకుపోయే ప్రమాదం ఉందని మరికొందరు నిపుణుల హెచ్చరిక. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్‌బిఐకి కాళ్లూ చేతులు ఆడటం లేదు.

మరో వైపు ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు చాలా హెచ్చు స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయకపోతే ఈ అంతరం ప్రమాదకర స్థాయికి చేరుతుంది. అయితే రాజకీయ పరిస్థితి ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. రిటైల్ రంగంలోకి ఎఫ్‌డిఐని అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండటంతో, డాలర్లను ఆకట్టుకునే ఒక ప్రధాన మార్గం మూసుకుపోయినట్టయింది. మరోవైపు యూరో సంక్షోభం తీవ్రతరం అవుతుండటంతో ఎఫ్ఐఐలు తన ఇన్వెస్ట్‌మెంట్లను తరలించుకుపోతున్నారు. యూరో సంక్షోభం పతాక స్థాయికి చేరితే, భారత్ విదేశీ వాణిజ్య చెల్లింపులు సంక్షోభంలో పడే అవకాశం ఉంది. 1991లో ఇదే పరిస్థితి ఎదురుకావడంతో భారత్ రూపాయి విలువను భారీగా తగ్గించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తితే భారత్ తట్టుకోవడం కష్టం. యూరో సంక్షోభం దెబ్బ రూపాయిపై తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

అకస్మాత్తుగా భారత్‌లో పరిస్థితులన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. వృద్ధిలో మందగమనం, రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్ల విశ్వాసం పూర్తిగా దెబ్బతినడం...అన్ని అపశకునాలే అని వారు చెబుతున్నారు. భారత్ కరెంట్ అకౌంట్ లోటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,410 కోట్ల డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ ఏడాది మొత్తంపై కరెంట్ అకౌంట్ లోటు 5,400 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఇక ఏప్రిల్-అక్టోబర్ మధ్య విత్తలోటు 5870 కోట్ల డాలర్లను తాకింది.

జిడిపిలో ఈ ఏడాది విత్తలోటు 4.6 శాతాన్ని మించకుండా చూస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. భారత్‌కు ఫారెక్స్ నిల్వలకు ప్రధాన ఆధారమైన విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు 5 కోట్లడాలర్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. గత ఏడాది ఇదే కాలంలో వారు 2,900 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. విదేశీ సంస్థలు ఇప్పటి వరకు 66.1 కోట్లడాలర్లను వెనక్కి తీసుకుపోయినట్టుగా చెబుతున్నారు. మరోవైపు ఫారిన్ కరెన్సీ కన్వర్టెబుల్ బాండ్స్ ద్వారా నిధులు సమీకరించిన కంపెనీలు కూడా రూపాయి పోకడతో ఆందోళనతో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం భగ్గుమనే అవకాశం ఉన్నప్పటికీ, క్యాష్ రిజర్వ్ రేషియోను ఆర్‌బిఐ తగ్గించాలని కొందరు నిపుణుల సలహా.

0 comments:

Post a Comment