Tuesday

నివాసానికి అనువుగా మరో భూమి!

ప్రపంచంలో జనాభా పెరిగిపోతోంది.. భూమి మాత్రం ఒక్కటే ఉండటంతో జనానికి చోటు సరిపోదని గగ్గోలు పెడుతున్నారా.. అయితే మీ కోసమే అచ్చం భూమిలాంటి మరో గ్రహం ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మన భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో, భూమి కన్నా 2.4 రెట్ల పరిమాణంలో ఉన్న కెప్లర్ 22-బి అనే ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత కూడా సుమారు 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అందువల్ల దీన్ని 'ఎర్త్ 2.0' అనొచ్చని నాసా బృందం చెబుతోంది.

నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా దీని ఆనుపానులు కనుగొన్నారు. మట్టితో పాటు నీరు కూడా ఉండే ఈ గ్రహం మీద జీవానికి కావల్సిన స్థాయిలోనే ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయట. నక్షత్రానికి గ్రహం ఎంత దూరంలో ఉందన్న దాని మీదనే ఆ గ్రహం మీద జీవం మనుగడ సాగించగలదా లేదా అన్నది ఆధారపడుతుంది. కెప్లర్ 22-బి మీద సంవత్సరానికి 290 రోజులు ఉంటాయి. కెప్లర్ 22బి నివాసానికి చాలా అనుకూలంగా ఉందని, దాని ఉష్ణోగ్రతలు కూడా బాగున్నాయని నాసా ఏమ్స్ పరిశోధన కేంద్రంలోని కెప్లర్ టెలిస్కోప్ ప్రధాన పరిశోధకుడు బిల్ బోరుకి తెలిపారు.

భావి తరాలు నివసించేందుకు అనుకూలంగా మూడు గ్రహాలున్నట్లు ప్రస్తుతం భావిస్తున్నారు. భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలోనే 'గ్లీజర్' అనే గ్రహాన్ని ఫ్రెంచి ఖగోళ పరిశోధకులు గతంలో కనుగొన్నారు. దానికి ఆరు ఉపగ్రహాలున్నాయి. అలాగే 36 కాంతి సంవత్సరాల దూరంలో హెచ్‌డి85512బి అనే మరో గ్రహాన్ని స్విట్జర్లాండ్ బృందం ఆగస్టులో కనుగొంది.

0 comments:

Post a Comment