Sunday

విశ్వకవిపై అర్జెంటీనా దర్శకుడి చిత్రం

విశ్వకవి, నోబెల్ సాహిత్య అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, అర్జెంటీనా ర చయిత్రి విక్టోరియా ఒకాంపోలపై చిత్రాన్ని నిర్మించనున్నట్లు అర్జెంటైనా సినీ దర్శకుడు పెబ్లొ సీసర్ తెలిపారు. ఠాగూర్ పాత్రకు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే ఈ విషయం ఆయనకింకా చెప్పలేదన్నారు.

ఠాగూర్, విక్టోరియాలపై చిత్రాన్ని రూపొందించేందుకు ఇప్పటికే తమ దేశంలోని భారతీయ రాయబారి ఆర్. విశ్వనాథన్‌తో చర్చించినట్లు సీసర్ వెల్లడించారు. ఈ ఏడాది రవీంద్రుని 150వ జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించి విడుదల చేయాలని ఆశించామని, కాని కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. చిత్రానికి సంబంధించి సంభాషణ అంతా ఇప్పటికి సిద్ధంగా ఉందన్నారు.

లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనాలో ఠాగూర్ కొంత కాలం గడిపారని తెలిపారు. విక్టోరియాతో ఆయనకు గల అనుబంధాన్ని వెండితెర కెక్కించే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు దర్శకుడు సీసర్ తెలిపారు. భారత్‌లోని కోల్‌కత్తా, శాంతి నికేతన్, సుందర్‌బాన్ ప్రాంతాలతోపాటు అర్జెంటీనాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామన్నారు. పనాజీలో జరుగుతున్న 42వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు.

0 comments:

Post a Comment