Tuesday

తీగలు లేకుండానే విద్యుత్ సరఫరా...!


బల్బులు, టీవీ, కంప్యూటర్..ఇలా ఏ విద్యుత్ ఉపకరణమైనా పనిచేయాలంటే కరెంట్ కావాల్సిందే. ఆ కరెంట్ సరఫరా కావాలంటే తీగలు ఉండాల్సిందే. కానీ తీగలేవి అవసరం లేకుండానే గాలిలో విద్యుత్‌ను సరఫరా చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 'వై ట్రైసిటి' అనే కంపెనీ ఈ ఘనత సాధించింది. ఈ కొత్త టెక్నాలజీ సహాయంతో గాలిలో నుంచి విద్యుత్‌ను పంపించి డివిడి ప్లేయర్స్, టీవీ వంటి ఉపకరణాలు ఉపయోగించుకోవచ్చు.

గాలిలో నుంచి విద్యుత్ సరఫరా చేయడం కోసం కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఈ కంపెనీ తయారుచేసింది. మొదట ప్రత్యేకంగా తయారుచేసిన ఒక సర్క్యూట్ గుండా విద్యుత్‌ను పంపించి అధిక పౌనఃపున్యం గల విద్యుత్‌గా మార్చి 'వై ట్రైసిటి సోర్స్' అనే పరికరంలో నిల్వ చేస్తారు. ఈ విద్యుత్ వై ట్రైసిటి సోర్స్ లోపల ఉన్న మాగ్నటిక్ ఫీల్డ్‌ని ప్రేరేపించి తిరిగేలా చేస్తుంది. తరువాత రెసొనెంట్ మాగ్నెటిక్ కప్‌లింగ్ అనే పద్ధతి ద్వారా సోర్స్ నుంచి వై ట్రైసిటి ఉపకరణానికి విద్యుత్ సరఫరా అయి బల్బు వెలుగుతుంది.

వై ట్రైసిటీ సోర్స్‌ను ఇంటి సీలింగ్‌లోనూ అమర్చుకోవచ్చు. అయితే గాలిలోనుంచి విద్యుత్‌ను తీసుకోవాలంటే ప్రతీ విద్యుత్ ఉపకరణానికి వై ట్రైసిటి డివైస్ ఉండాలి. ఈ టెక్నాలజీ పట్ల ఇంటెల్, టయోటా సంస్థలు అమితాసక్తిని కనబరుస్తున్నాయట. ఇది అందరికీ అందుబాటులోకి వస్తే తీగల బాధ తప్పుతుంది కదూ.

0 comments:

Post a Comment