Showing posts with label మతము. Show all posts
Showing posts with label మతము. Show all posts

Saturday

'మతమే' మారాలి! హైందవంలో లోపాలూ మార్పిడికి ప్రేరణ నిమ్న వర్గాలపై వివక్ష.. అవమానాలు దేవుణ్ని దర్శించుకోవడానికీ డబ్బులే!

తన చుట్టూ ఉన్న సమాజంలో అత్యధిక సంఖ్యాకులు, తన పూర్వీకులు, కుటుంబీకులు అనుసరించే మతాన్ని కాకుండా మరో మతంలోకి వెళ్లాలని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడంటే... అందుకు కొత్త మతంలోని ఆకర్షణ, కొత్తదనాన్ని వెతకాలన్న అన్వేషణతో పాటు, తానున్న మార్గంపై అసంతృప్తి కూడా ఎంతో కొంత కారణమవుతుంది. మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ తరుణంలో రెండో కోణాన్ని చర్చించకుండా ఉండడం అసంపూర్ణమే అవుతుంది. ఆ ప్రయత్నమే ఈ కథనం... 

హిందూ మతంలోని కుల వ్యవస్థ, అంటరానితనం, అంతరాలకు వ్యతిరేకంగా, సమానత్వాన్ని వెతుక్కుంటూ దళితులు ప్రారంభించిన ప్రయాణం మతాంతరీకరణలో తొలి ఘట్టం. ఇది దేశంలో సంచలన కారకమే అయినా మతం మారినవారిని ఎవరూ తప్పుబట్టలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆ వర్గాలే కాకుండా, అటువంటి ఇబ్బందులు లేని ఇతర కులాలవారు కూడా పెద్దఎత్తున మతం మారడానికి కారణాలు అన్వేషిస్తే ఆసక్తికర సమాధానాలు, దిద్దుకోవాల్సిన అంశాలు కనిపిస్తాయి. 

"హిందూమతం చాలా సరళం (ఫ్లెక్సిబుల్). ఎవరైనా అనుసరించవచ్చు. మతంలోనే ఉండి అనుసరించకపోయినా అడిగేవారు లేరు. ఎలాంటి కట్టుబాట్లు, క్రమశిక్షణ లేవు. అందువల్లే పక్క చూపులు చూడడానికి అవకాశం ఎక్కువ'' అని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్ విశ్లేషించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందినరామకృష్ణ.. "ప్రపంచంలోని ఏ ఇతర మత ప్రార్థన స్థలాల్లోనూ దర్శనాలకు, పూజలకు, సేవలకు టికెట్లు, రుసుములు లేవు. కానీ హిందూ మతంలో గుడికి వెళ్లాలంటే టికెట్, దర్శనం చేసుకోవాలంటే రుసుము. ఎక్కడ చూసినా వ్యాపారమే'' అని తప్పుబట్టారు. 

"మిగతా మతాల్లో దేవుడి ముందు అందరూ సమానమే. కానీ, హిందూ మతంలో డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్నవాడికి ఒక పూజ, లేనివాడికి మరో పూజ. గుళ్లలో వీఐపీలు వచ్చినప్పుడల్లా హారతులివ్వడం ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు'' అని మహేశ్వరం ప్రాంత రైతు కిష్టారెడ్డి అన్నారు. హిందూమత గురువులు, పూజారుల తీరును సామాజిక విశ్లేషకుడు రామకృష్ణ తప్పుబట్టారు. "మనం చర్చికో, మసీదుకో వెళ్లినపుడు అక్కడి గురువులు ఆప్యాయంగా పలకరిస్తారు. హిందూమత గురువులు అలా ఉండరు'' అని అభిప్రాయపడ్డారు. 

"మతం మారాలనుకున్నప్పుడు అసలు మన మతంలో ఏముందో, వేరే మతంలో ఏముందో తెలుసుకోవాలి కదా? మారేవాళ్లంతా ఏం అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు ఆ శక్తిసామర్థ్యాలు వారికున్నాయా? ఈ మౌలిక ప్రశ్నలకు జవాబు వెతకాల్సి ఉంది'' అని దేవాలయ ఆస్తుల పరిరక్షణ ఉద్యమ కమిటీ కన్వీనర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. "మత మార్పిడి ఎప్పటినుంచో ఉంది. అప్పుడు రాని వివాదం ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది? జైన, బౌద్ధ మతాలు హిందూ దేవుళ్లను కించపరచలేదు. కానీ మతం మారిన హిందువుల జాతీయతనే దూరం చేయడానికి, ఈ దేశ మూలాల మీదనే క్రైస్తవ సంస్థలు గురిపెట్టాయి'' అని వేద భారతి సంస్థ సమన్వయకర్త గౌరీభట్ల సుబ్రహ్మణ్యశర్మ పేర్కొన్నారు. 

ఆలయ ప్రవేశం తప్పనిసరి
"మతమార్పిడులు అడ్డగోలుగా జరక్కూడదంటే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలి'' మహబూబ్‌నగర్ జిల్లాలో మతం మారి తిరిగి వచ్చిన పలువురి మాట ఇది. "హిందువుల్లో మిగతా కులాలవారు దళితులను దూరం పెట్టొద్దు. మాకూ ఆలయ ప్రవేశం కల్పించాలి'' అని అడ్డాకులకు చెందిన ఎం.దానేలు ఆవేదన వ్యక్తం చేశారు. "దళిత వాడల్లో హైందవ సంస్థలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి. వీహెచ్‌పీ తరపున పాత పాలమూరు దళితవాడలో ఏటా సీతారామకల్యాణం, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి కొనసాగిస్తే మతమార్పిడులకు ఆస్కారం ఉండదు'' అని వీహెచ్‌పీ నాయకుడు లక్ష్మీనారాయణ సూచించారు. 

చట్టాలు అమలు చేయాలి
"హిందూమతంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాల వారెవరైనా క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే వారు రిజర్వేషన్లు కోల్పోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు కఠినంగా అమలుచేయాలి. హిందూమతంలో కులవివక్షను పోగొట్టడానికే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. క్రైస్తవం, ఇస్లాం మతాల్లో కులాలు లేనందున వాటిని స్వీకరించే ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లను వదులుకోవాలి. కొన్ని మతాల అభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడాన్ని తక్షణం ఆపాలి. 

మత ప్రచార నిషేధానికి జారీచేసిన 746, 747 జీవోలను అమలు చేయాలి. కానీ ఇవేవీ జరగట్లేదు. పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలే దీనికి కారణం'' అంటారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లపల్లె నరసింహారెడ్డి. "హిందూ మతంలోని అట్టడుగువర్గాల పేదరికాన్ని, నిరక్షరాస్యతనూ అవకాశంగా తీసుకుని ప్రలోభపెట్టి మతం మార్చ డం అనైతికం. ఇలాంటి మతమార్పిడులకు పాల్పడటం నేరం. దీని పై ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలుచేయాలి'' అని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. 

ప్రత్యేక చట్టాలతోనే మతమార్పిడులకు అడ్డుకట్ట పడుతుందని చిత్తూరుజిల్లా లోక్‌సత్తా అధ్యక్షుడు జయకుమార్ అభిప్రాయం. "వాళ్లకు ఈ దేశం అంటే గౌరవంకానీ, ఇష్టం కానీ ఉండదు. రాముణ్ని, కృష్ణుణ్ని తిడతారు. శంకరాచార్యులను గౌరవించరు. వివేకానందుడిని అసహ్యించుకుంటారు. హిందువుల మనోభావాలను, ఆచారాలను ఇం తగా వ్యతిరేకించేవాళ్లు మనకి శాంతినీ, సమానత్వాన్నీ, నాగరికత ను నేర్పిస్తామనడం ఏమిటి?'' విజయవాడ సిద్ధార్థ కాలేజీ విద్యార్థి చైతన్య ఆవేదన ఇది. "ఒక వ్యక్తి చనిపోతే చూడటానికి వెళ్లటం మానవత్వానికి సంబంధించిన విషయం. 

కానీ నా మరదలు చనిపోతే దహన సంస్కారాలకు వెళ్లొద్దన్నారు. క్రైస్తవంలోకి మారితే ఇలాంటివి ఉంటాయనే అవగాహన కల్పించే హిందూమత పెద్దలెవరూ లేరు. అలాంటివారుంటే బాగుంటుంది'' అని నల్గొండ జిల్లా వాసి రాజు వాపోయారు. "జనాభాలో 50 శాతం ఉన్న యువత కు ఆసక్తికలిగించేలా హిందూమతంలో మార్పులు రావాలి. మౌలిక సూత్రాలను మార్చమని ఎవరూ అడగరు. కానీ కాలంతోపాటు కొన్ని ఆచార వ్యవహారాలు చేరుతాయి. వాటిని తొలగిస్తే- అసలు నగిషీలు బయటకొస్తాయి. వాటిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఒక వ్యక్తికి తన మతం పూర్తిగా సంతృప్తి కలిగించిన రోజున మతమార్పిడి సమస్యలండవు'' అని సామాజిక శాస్త్రవేత్త వాసు అన్నారు. 

వద్దన్న చోటనే వేద విద్య
అది 1930. మహారాష్ట్ర, నాసిక్‌లోని సుప్రసిద్ధ కాలారామ్ మందిరం బయట.. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో వేలాది మంది దళితులు ఆలయప్రవేశం కోరుతూ సత్యాగ్రహానికి దిగారు. గుడి పూజారి రామ్‌దాస్ మహరాజ్ సహా, ధర్మకర్తలు, స్థానిక అగ్రవర్ణాలవారెవ్వరికీ దళితులు ఆలయంలోకి ప్రవేశించడం ఇష్టంలేక, వారిని అడ్డుకున్నారు. ఐదేళ్లపాటు సత్యాగ్రహం చేసినా దళితులు ఆ గుడిలోకి ప్రవేశించలేకపోయారు!! దాదాపు 75 సంవత్సరాల తర్వాత.. 2005లో.. ఆ గుడిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. 

అందులో.. దళితులకు ప్రవేశాన్ని అడ్డుకున్న ఆనాటి సంఘటనకు.. ఆలయ పూజారి సుధీర్ మహరాజ్ క్షమాపణ చెప్పారు. 1930లో పూజారిగా ఉన్న రామదాస్ మహరాజ్ మనవడే సుధీర్ మహరాజ్.. "బాబా సాహెబ్‌ను ఆలయంలోకి రానివ్వకుండా మా తాతగారు చేసిన తప్పునకు నేను క్షమాపణ చెబుతున్నాను'' అని ఆయన ఆ కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించారు. దళితులను గుడిలోకి రానివ్వడమే కాదు, ఇప్పుడక్కడ వారికి వేదం కూడా నేర్పించే పనిలో ఉన్నారాయన. 

మన లోపాలు దిద్దుకుంటేనే!
"ఒకప్పుడు హిందూ మతం చాలా పటిష్ఠమైనది. దానిలో ఉన్న కొన్ని బలహీనతలను ఎత్తిచూపి, వాటిని సంస్కరించే క్రమంలో బౌద్ధమతం అవతరించింది. బౌద్ధంలో ఒక మౌలికమైన క్రమశిక్షణ లేకపోవటం వల్ల తర్వాత ఆ మతం కూడా అంతరించిపోయింది. అనంతర కాలంలో హిందూ మతంలో కూడా అలాంటి పొరపాట్లే జరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు హిందూ మతంలో క్రమశిక్షణ ఉండేది. 

దాన్ని పాటించినంత కాలం మతానికి వచ్చిన సమస్యేమీ లేదు. ఎక్కడైతే క్రమశిక్షణ లోపిస్తుందో అక్కడ కొన్ని బలహీనతలు ఏర్పడతాయి. వాటిని ఉపయోగించుకొనేవారు కూడా అనేక మంది ఉంటారు. మత మార్పిడులు కూడా ఆ తరహాలోనివే. మౌలికంగా మనలో తప్పు పెట్టుకొని ఇతరులను నిందించి లాభం లేదు. ముందు మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే సమస్యలు తీరిపోతాయి''
-ప్రొఫెసర్ సౌందర్‌రాజన్,
బాలాజీ ఆలయ ట్రస్టీ, చిలుకూరు. 

ప్రతికూల ప్రచారం
"క్రైస్తవ మత సిద్ధాంతాలను, ఆచారవ్యవహారాలను ప్రచారం చేసుకోవటం వల్ల మనకు వచ్చిన సమస్యేమీ లేదు. అందరికీ తమ మతంలో ఉన్న గొప్పదనాన్ని తెలియజేసి.. వ్యక్తిత్వ సంస్కారం చేస్తే మనకు వచ్చిన ఇబ్బంది లేదు. మన దేశం నుంచి వెళ్లి హిందూ ధర్మ ప్రచార సంస్థలన్నీ చేస్తున్నది ఇదే. రామకృష్ణ మఠం బోధించే ధర్మాన్ని కొన్ని లక్షల మంది విదేశీయులు అనుసరిస్తారు. ఇస్కాన్‌కు కొన్ని లక్షల మంది విదేశీ ఫాలోయర్స్ ఉన్నారు. వీరు ఇతర మతాలవారిని హిందూ మతంలోకి చేరాలని ఎప్పుడూ అడగరు. 

క్రీౖస్తు సరైన దేవుడు కాడని.. వారి మత గ్రంథాలు తప్పని చెప్పరు. కేవలం హిందూ మతంలో ఉన్న గొప్పదనాన్ని వివరిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత ప్రచారం పేరిట జరుగుతున్న వ్యవహారాలు ఇందుకు పూర్తి విరుద్ధం. హిందు దేవుళ్లను విరోధులుగా చూపించటం, హిందు ధర్మాన్ని, ఆచారాల్ని అనాగరికమైనవిగా ప్రచారం చేయటం.. సంప్రదాయాలను పాటించవద్దని ప్రోత్సహించడం ఇవేవీ సరైనవి కావు''
-స్వామి పరిపూర్ణానంద 

అమెరికాలో హిందూయిజం
ఒకవైపు.. భారతదేశంలో క్రైస్తవంలోకి మారుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంటే, అంతర్జాతీయంగా హిందూయిజం వైపు ఆకర్షితులవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్ర త్యేకించి.. అమెరికన్లలో చాలామంది ఇప్పుడు 'పునర్జన్మ' సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. 2009లో లీసా మిల్లర్ అనే రచయిత్రి అమెరికన్ పత్రిక న్యూస్‌వీక్‌లో 'వుయ్ ఆర్ ఆల్ హిందూస్ నౌ' అనే వ్యాసాన్ని రాశారు. అందులో ఆమె... 2008 నాటికి అమెరికాలో 76శాతం మంది క్రైస్తవులు ఉన్నారని, అది ఆ దేశ చరిత్రలోనే అతి తక్కువ శాతమని పేర్కొన్నారు. 

"దేవుణ్ని చేరుకోవడానికి అనేక మార్గాలుంటాయని ఒక హిందువు విశ్వసిస్తాడు. అందులో జీసస్ ఒక మార్గం, ఖురాన్ మరొక మార్గం. యోగసాధన ఇంకొక మార్గం. ఏదీ ఒకదానికంటే ఎక్కువ కాదు. అన్నీ సమానమే. కానీ.. అత్యంత సంప్రదాయబద్ధమైన క్రైస్తవులు ఇంతవరకూ ఇలా ఆలోచించడం నేర్చుకోలేదు. వారు తమ మతమే సత్యమని, ఇతర మతాలన్నీ అసత్యాలనీ నేర్చుకుంటారు'' అని పేర్కొన్నారు. 2008 హ్యారిస్ పోల్ ప్రకారం 24 శాతం మంది అమెరికన్లు హిందూ పునర్జన్మ సిద్ధాంతం మీద తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. 

మారాల్సింది ఎవరు?
రాష్ట్రంలో మత మార్పిడుల పర్వంపై 'ఆంధ్రజ్యోతి' గత ఆరు రోజులుగా ప్రచురించిన కథనాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది స్పందించారు. ఇరు మతాలకు చెందినవారి నుంచి, సామాజిక విశ్లేషకుల నుంచి, కుల సంఘాల నేతల నుంచి వందలాది ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ మా కార్యాలయానికి వెల్లువెత్తాయి. ప్రశంసలు, పరిశీలనలు, అభ్యంతరాలు, ఆరోపణలను పక్కనబెడితే.. సమాజంలో చాపకింద నీరులా సాగిపోతున్న, అనర్థాలకు, అంతరార్థాలకు కారణమవుతున్న ఒక దృగ్విషయంలోని అన్ని కోణాలను ప్రజల ముందు పెట్టి చర్చనీయాంశం చేయడమే ఈ కథనాల లక్ష్యం. 

'రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ.. ప్రచారం' ముసుగులో, ప్రలోభాల ప్రయత్నాలతో జరుగుతున్న బలవంతపు మత మార్పిడులు వ్యక్తుల మనసులపై, కుటుంబ సంబంధాలపై, సామాజిక సమీకరణలపై, రాజకీయ పరిణామాలపై చూపుతున్న ప్రభావాన్ని ప్రజల దృష్టికి తేవడమే ఈ కథనాల ఉద్దేశం. 'మనిషి మతం మారినంత మాత్రాన ప్రయోజనం లేదు. అభిమతాలు మారనంత వరకు ఎన్ని మతాలు మారినా.. అవే కతలు, గాథలు తప్పవు. 

హిందూ మతంలో వివక్షకు వ్యతిరేకంగా మతం మారిన దళితులు పేర్లతో సహా మారి కొత్త మతంలో మమేకమైపోతుంటే, అగ్ర వర్ణాల వారు.. పేరు తోకను అలాగే తగిలించుకుని ఉండడం, తరాలు మారినా కులాల గోలలు, లీలలు ఇంగువ కట్టిన గుడ్డలా అక్కడా కనిపిస్తుండడం గమనించాల్సిన విచిత్రం. 'నువ్వు దేవుని సేవ కోసమే పుట్టావు. దేవుని పుత్రికవు' అని వస్తున్న సందేశాలకు స్పందించి, చెప్పాపెట్టకుండా మతం మారుతున్న పిల్లలు, తమ ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారన్న సంగతిని మరచిపోతుండడం మరో విషాదం. 

సమస్య ఉందనో, అవసరం తీరుతుందనో, ఆర్థికంగా ఆదుకుంటారనో, ఆరోగ్యం చేకూరుతుందనో.. చిన్నచిన్న కారణాలకు మతం మారే వారు.. అది ఏ మతంలోంచి ఏ మతంలోకైనా.. విలువల పట్ల, విశ్వాసాల పట్ల, జాతీయత పట్ల ఏం నిబద్ధత చూపించగలరన్నది.. మారే వారు, మార్చే వారు వేసుకోవాల్సిన ప్రశ్న! 'మార్పిడి' అవసరం లేకుండా, అవకాశమివ్వకుండా మతాలే మారాలి, మనుషులూ మారాలి, మనసులూ మారాలన్నదే ఆంధ్రజ్యోతి ఉద్దేశం, సందేశం!
Read more >>

ఆచారాల్లోకి చొరబడుతూ

తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. ప్రచారాలు, ప్రలోభాలు, విద్య, వైద్యం పేరిట మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న క్రైస్తవ మిషనరీలు.. హిందువులను తమ వైపు ఆకర్షించేందుకు హైందవ సంస్కృతినీ తమలో మిళితం చేసుకుంటున్న తీరిది. హైందవ దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఇవ్వడం సరికాదని చెప్పే క్రైస్తవ సంస్థలు.. హిందూ మతంలో అనాదిగా వస్తున్న ఆచారాలైన తలనీలాలు సమర్పించుకోవడం, కొబ్బరి కాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం వంటి వాటిని తమ మతంలోనూ ప్రవేశపెట్టాయి. 

ఏసు మహిమలను కీర్తిస్తూ.. సంకీర్తనలు రూపొందించడం, పద్యాలను కూర్చడం కూడా చేస్తున్నాయి. త్యాగరాజ కృతులను పోలిన ఏసు సంకీర్తనలను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రూపొందించారు. ఇలా భారతీయ సాహిత్య రూపాల్లోనూ క్రైస్తవ సాహిత్యాన్ని తయారు చేస్తున్నారు. తైలాభిషేకాలు, హారతులు వంటి పద్ధతులనూ క్రైస్తవ మిషనరీలు చర్చిలలో ప్రవేశ పెట్టాయి. 'క్రిస్టియన్ యోగా' అనే కొత్త పద్ధతికి కూడా క్రైస్తవ సంస్థలు రూపకల్పన చేశాయి. 

అంటే.. క్రైస్తవాన్ని 'భారతీకరణ' (ఇండియనైజేషన్) చేస్తున్నాయన్న మాట. తద్వారా మతం మారాలనుకొనే హిందువులకు.. క్రైస్తవంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేస్తున్నారు. హిందువులకు సాంస్కృతికంగానూ దగ్గరయ్యే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. 

గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే ఇందుకు తార్కాణం. 

మతం మారినా మారని కులం
అంతేకాదు.. కుల వ్యవస్థ అన్నది హిందూ మతానికే ప్రత్యేకం. కానీ.. మన దేశంలోని క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ ప్రవేశించింది. హిందూ మతాన్ని వీడి.. క్రైస్తవ మతాన్ని తీసుకున్న వివిధ కులాల వారు తమ కుల వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తారు. తమ కులం వారినే పెళ్లి చేసుకుంటారు. కులాచారాలనూ తు.చ. తప్పకుండా పాటిస్తారు. హైందవం నుంచి క్రైస్తవంలోకి చేరిన వారిలో చాలామంది కుల చిహ్నాన్ని సూచించే పదాలను యథాతథంగా కొనసాగిస్తారు. 

అగ్ర కులం వారికి.. తక్కువ కులం వారికీ మధ్య అంతరం అలానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల.. అగ్రకులాల వారికి వేరుగా, నిమ్న కులం వారికి వేరుగా చర్చిలు వెలవడమే ఇందుకు నిదర్శనం. అంటే... ఒక కులం చర్చికి మరొక కులం వారు వెళ్లరన్న మాట! కాగా.. మతమార్పిడి గురించి 'ఆంధ్రజ్యోతి' ప్రచురిస్తున్న కథనాలకు రాష్ట్ర నలుమూలల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. 

'ఆంధ్రజ్యోతి' కేంద్ర కార్యాలయానికి పాఠకులు పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ.. మత మార్పిడులపై తమకు తారసపడ్డ అనుభవాలను వివరిస్తున్నారు. కొందరైతే.. క్రైస్తవ మిషనరీల ప్రచారాన్ని నమ్మి.. అనారోగ్య కారాణాలు ఇతరత్రా కారణాల వల్ల తాము మతం మారామని అంగీకరిస్తున్నారు. వీరిలో కొందరు క్రైస్తవంలో తాము ఇమడలేక.. తిరిగి హిందూ మతంలోకి వచ్చేశామనీ చెబుతున్నారు. 

ధనం మూలం..
మత విస్తరణ కాంక్షతో మార్పిడిని ప్రోత్సహించే వారు కొందరు! కేవలం... ధనకాంక్ష తో టార్గెట్లు పెట్టుకుని మరీ మతం మార్పించే వారు ఇంకొందరు! ఈ వ్యవహారం డబ్బు చుట్టూ తిరుగుతోందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మిషనరీ, దాని అనుబంధ సంస్థలు ఎంతమందిని మతం మార్పించిందీ అంతర్జాతీయ సంస్థలకు ప్రతి నెలా నివేదిక లు పంపుతాయి. వాటి ఆధారంగానే నిధులు అందుతాయి. ఒక్కో మత మార్పిడికి ఇంత సొమ్మని చర్చి ఫాదర్లు, పాస్టర్లకు ఇస్తారని చెబుతారు. 

ప్రార్థనా మందిరాల నిర్మాణం పేరిట భారీగా నిధులు సేకరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైకిళ్లపై తిరుగుతూ మత ప్రచారం చేసిన కొందరు పాస్టర్లు ఇప్పుడు విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కుటుంబాన్ని మతం మార్పిస్తే రూ.10 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. పేదల సంక్షేమం నిధులు ఖర్చు చేస్తున్నామని అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలకు తప్పుడు సమాచారం పంపి, డబ్బులు వెనకేసుకునే వారూ ఉన్నారు. 

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 75 శాతం చర్చిలు విదేశీ నిధులతోనే నడుస్తున్నాయి. అన్యమతస్తులకు బాప్టిజం ఇప్పించినట్లుగా ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లు పంపిస్తూ నిధులు సేకరిస్తున్నారు. నిజాయితీగా మతం కోసం మాత్రమే పని చేస్తూ, స్థానిక విరాళాలు, చందాలతో జీవించే వారూ ఉన్నారు. 1989లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారమే... ప్రపంచ వ్యాప్తంగా చర్చిలు 14,500 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నాయి. 

లెక్కకు చిక్కరు..
'రాష్ట్రంలో ఎంతమంది మతం మార్చుకుంటున్నారో అధికారిక లెక్కలు లేవు. ఎందుకంటే.. అలాంటివి నమోదు చేయాలన్న నిబంధన లేదుగనుక. కేరళ, తమిళనాడు తదిత ర రాష్ట్రాల్లో బాప్టిజం పొందాలంటే రెవెన్యూ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దళితులు క్రైస్తవంలోకి మారితే సామాజిక హోదా ఎస్సీ నుంచి బీసీలుగా మారి, రిజర్వేషన్లపరంగా నష్టపోతారు. దీంతో మతం మారినా వారు ఎస్సీలుగానే కొనసాగుతున్నారు. దీనివల్ల అసలైన ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఈ వర్గాలు వాపోతున్నాయి. 

చావు.. పుట్టుక!
రాజమణికి 80 ఏళ్లు. హైదరాబాద్ సమీపంలోని రామవరం అనే కుగ్రామం. కార్తీక మాసంలో ఆమె శివాలయాల చుట్టూ తిరిగేవారు. రోజంతా పూజలతో గడిచిపోయేది. 9 నెలల క్రితం ఆమె మతం మార్చుకున్నారు. పూజలు మానేసి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు. 'మతం ఎందుకు మార్చుకున్నారు?' అని అడిగితే... 'చనిపోయాక కర్మ కాం డల అవసరం ఉండదని చర్చి అధికారులు చెప్పారు. కుటుంబానికి ఎలాంటి ఖర్చూ ఉం డదన్నారు. అందుకే మారాను' అని తెలిపారు. 

కుటుంబ సభ్యులకు ఇదంతా ఇష్టం లేదు. సుమారు రెండు వారాల క్రితం ఆమె మరణించారు. ఆమెకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ చర్చి అధికారులు వచ్చారు. దీనిపై కుటుం బసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు... క్రైస్తవం ప్రకారమే ఆ పని కానిచ్చేశా రు. మత మార్పిడితో కుటుంబ స్థాయిలో సంఘర్షణకు ఇదో ఉదాహరణ! 

మళ్లీ మరాం..
'ఆంధ్రజ్యోతి' కథనాలపై పాఠకులు పెద్దసంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐకపాముల గ్రామవాసులు ఐదుగురు శనివారం 'ఆంధ్రజ్యోతి'కి చెప్పిన విషయమిది... "ఏసయ్య ధనం ఇస్తాడు. పాపాలన్నీ రక్తంతో శుద్ధి చేస్తాడు. ఉబ్బసం వంటి మొండి వ్యాధులను కూడా తగ్గిస్తాడు. 

పరలోక ప్రయాణానికి ఆటంకాలు లేకుండా ఆశీర్వదిస్తాడు... అని చర్చిలో చెప్పేవారు. మమ్మల్ని గుడికి వెళ్లొద్దని చెప్పేవారు. బంధువులెవరైనా చనిపోతే ముట్టుకోకూడదనేవారు. మా భార్యలను గాజులు తీసెయ్యమన్నారు. బొట్టుపెట్టుకోద్దన్నారు. దీంతో మేం చర్చికి వెళ్లడం మానేసి, మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశాం! ఇలాంటి 20 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి.'' 

మంత్రం తంత్రం...
తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. లేదా... తీసుకొచ్చారు. క్రైస్తవంలో హైందవంలో ఉన్నన్ని పూజలు, పునస్కారాలు లేవు. కానీ, మతం మారిన, మారాలనుకున్న వారికి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు. 

ఇటీవలి కాలంలో 'క్రిస్టియన్ యోగా' ప్రచారంలోకి వస్తోంది. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే దీనికి కారణం.
Read more >>

మార్చే 'స్వేచ్ఛ' లేదు! సమస్యలు సాకుగా ప్రేరేపణ

పరిణితిలేని మనసులపై ప్రభావం
మతం మారాలంటూ నూరిపోస్తున్నారు
క్రైస్తవ స్నేహితుడిగా చెబుతున్నా
బలవంతపు మార్పిడులు నిషేధించండి
పోప్ బెనెడిక్ట్‌కు స్వామి అగ్నివేశ్ లేఖ
బలవంతపు మత మార్పిడులపై 'నిషేధం' విధించాలంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పోప్ బెనెడిక్ట్-16ను కోరారు. ఇటువంటి మత మార్పిడులతో భారత్ వంటి దేశాల్లో తీవ్ర స్పందనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా స్వామి అగ్నివేశ్‌కు పోప్ ఓ లేఖ రాశారు. 'మతం మారే స్వేచ్ఛ'కు ఆ లేఖలో పోప్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. దానికి స్పందనగానే అగ్నివేశ్ లేఖ రాశారు.

ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ.. దీపావళి సందర్భంగా హిందువులతో పరస్పర చర్చలకు పిలుపునిస్తూ పాంటిఫికల్ కౌన్సిల్ పంపిన సందేశం అందింది. దానికి స్పందనగానే ఈ లేఖ రాస్తున్నాను. మీకు, మరీ ముఖ్యంగా భారత్‌లోని క్రైస్తవులకు స్నేహితుడిగా ఈ లేఖ రాస్తున్నా! హిందువులు సహా ఇతర మతాల్లోని ఛాందసవాదులు దాడులు చేసినప్పుడు క్రైస్తవుల తరఫున పోరాడిన వారిలో నేనే ముందు వరుసలో ఉంటాను.

మీ సందేశం చదివిన తర్వాత దానిలోని కొన్ని అంశాలు నాలాంటి శ్రేయోభిలాషులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మత స్వేచ్ఛ ఉండాల్సిన ఆవశ్యకతను ఆ సందేశంలో మీరు బాగా వివరించారు. దానిని వివిధ కోణాల్లో పరిశీలిస్తే.. 'మత స్వేచ్ఛ అంటే ఒకరి మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ కూడా' అని మీరు పేర్కొన్నారు. దీనిపై కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

లేకపోతే.. ఎవరు ఏ మతాన్ని అయినా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చునన్న మీ సందేశానికి బదులుగా మత మార్పిడులను సమర్థిస్తున్నారనే భావన కలుగుతుంది. భారత్ వంటి దేశాల్లో ఈ భావన తీవ్ర స్పందనలను రేకెత్తిస్తుంది. ముల్లాలు, మిషనరీలు ప్రచారం చేస్తున్న విశ్వాసాలను నమ్మకపోతే, సొంత విశ్వాసాలను వదలకపోతే ప్రజలు తమను తాము రక్షించుకోలేరని ఇప్పటికే అనేక మంది వ్యక్తులు, సంస్థల వారు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి చేతిలో మేము ఇప్పటికే చాలా బాధలు పడి ఉన్నాం. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. పోప్ జాన్‌పాల్-2 1999లో భారత్‌కు వచ్చారు. బిషప్‌లను, కార్డినల్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.

"మొదటి మిలీనియంలో యూరప్ గడ్డపై శిలువను ప్రతిష్ఠించగలిగాం. రెండో మిలీనియంలో అమెరికా, ఆఫ్రికాల్లో ప్రవేశించాం. మూడో మిలీనియంలో సువిశాల, ప్రాణాధారమైన భారత ఉప ఖండంలో విశ్వాసమనే పంట పండుతుందని ఆశిస్తున్నాం'' అని పోప్ ప్రకటించారు. రక్షకుడైన ఏసుక్రీస్తుపట్ల అచంచల విశ్వాసం ఉందని ఆ సందేశం చెబుతోందని, మత మార్పిడులకు అది పిలుపునిస్తోందని మాకు చెప్పారు.

అంతేనా.. "ప్రభువు నుంచి మొత్తం ఆసియా శాంతి పొందే దాకా చర్చి హృదయం తల్లడిల్లుతూనే ఉంటుంది'' అని కూడా పేర్కొన్నారు. ఈ సందేశం ద్వారా - మత స్వేచ్ఛ అంటే మత మార్పిడులు చేయడానికి మిషనరీలకు ఉన్న స్వేచ్ఛ అని అర్థమవుతుంది. అయితే, మీరు, మేము చేయబోయే పర్యటన లక్ష్యాలకు ఇది విరుద్ధంగా ఉంది. ఆ యాత్రకు శాంతి, సత్యం ప్రధాన లక్ష్యాలని మీరు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా మా సుప్రీం కోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలను ప్రవచించింది. వీటి ప్రకారం- మత ప్రచార స్వేచ్ఛ అంటే మత మార్పిడులు చేయడానికి స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. ఈ మార్గదర్శకానికి వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.

పేద ప్రజలకు ఉన్న ఇబ్బందులను సాకుగా చూపించి చాలాసార్లు తమ తమ మతాలను వదిలిపెట్టేలా వారిని రెచ్చగొడుతున్నారు. చర్చి చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- తీవ్రమైన కరువు పరిస్థితులను కూడా ఉపయోగించుకొని తమ మతాన్ని ప్రచారం చేసుకొన్న ఉదం తాలు కనిపిస్తాయి. హిందూ దేవతలు, దేవుళ్లపై అమాయక పేదలకు అనేక రకాలైన దుష్ప్రచారాలనూ నూరిపోస్తున్నారు.

అద్భుతాలు చేస్తామని, మహిమలు చూపిస్తామని క్రైస్తవ మత ప్రచారకులు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మహిమల మాట పక్కన పెడితే- భారత దేశంలో వెనకబడిన కులాల ప్రజలకు సమానత్వాన్ని కూడా కల్పించలేకపోతున్నారు. ఈ విషయంపై మత మార్పిడి చేసుకున్నవారు పుంఖానుపుంఖాలుగా రాశారు.

చాలాసార్లు మత మార్పిడులు చాలా గర్హించదగ్గ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని మీ సందేశంలో కూడా ఖండించారు. ఈ తరహా మత మార్పిడులు వ్యక్తులను చాలా సందిగ్ధంలో పడేస్తాయి. అండగా ఉండే సమాజాల నుంచి వారిని వేరు చేస్తాయి. పెద్ద సంఖ్యలో మత మార్పిడులు జరిగినప్పుడు- ఆ ప్రజలు తాము నివసిస్తున్న సమాజానికి దూరంగా జరుగుతున్నారు. దీనివల్ల క్రైస్తవ మత ప్రచారకులకు, గ్రూపులకు వ్యతిరేకంగా హింస చెలరేగుతోంది. ఇలాంటి వాటి వల్ల సహ జీవనం, ప్రశాంతత దెబ్బతింటున్నాయి.

ప్రతి వ్యక్తికి ఇతర మతాల గురించి తెలుసుకొనే హక్కు ఉంటుందనే మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. అయితే, అది స్వేచ్ఛతో, ఆ వ్యక్తి స్వయంగా తీసుకున్న నిర్ణయమై ఉండాలి. అది ప్రలోభాలతో కూడినదై ఉండకూడదు. ఒత్తిళ్లతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అబద్ధాలతోను, తప్పుడు హామీలతోను దానిని ముందుకు నడిపించకూడదు. ఇలాంటి మత మార్పిడులు జరిగినప్పుడు తీవ్రమైన స్పందనలు వస్తాయి. దీనివల్ల సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడతాయి. హింసాపూరితమైన స్పందనలు వస్తాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మీ సందేశంలో చెప్పిన అంతఃస్సూత్రం కాకుండా.. మూకుమ్మడి, బలవంతపు మత మార్పిడులపై నిషేధం విధించాలని కోరుతున్నాను. ముఖ్యంగా-ఎవరికైతే పరిణతి ఉండదో.. ఎవరైతే సొంత నిర్ణయాలు తీసుకోలేరో వారిని మత మార్పిడులు చేయకుండా నిషేధించాలని కోరుతున్నాను. చదువుకోని ఆదివాసీ కానీ, ఒక చిన్న పిల్లవాడు కానీ తమ మతం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలరు?

ఇలాంటి నిషేధం వల్ల మిగిలిన మతాలకు చెందిన ప్రజలకు కొంత వ్యవధి చిక్కుతుంది. వారు తమ ఆలోచనలను పునరాలోచించుకోగలుగుతారు. వివిధ సంస్థలు తమ పనితీరును సమీక్షించడానికి వీలవుతుంది. ఈ సమయంలో నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు వ్యక్తులకు ఉంటుంది. వేరే మతాన్ని ఆదరించాలని వారి అంతరాత్మ చెబితే వారు దానినే పాటిస్తారు. మన సమావేశంలో ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా.
Read more >>

ప్రచారమా.. ప్రలోభమా? వివాదాస్పదమవుతున్న మత మార్పిడులు అగ్ర వర్ణాలలో పెరుగుతున్న ధోరణి వెంటబడ్డారు

తమది ప్రచారం మాత్రమే అంటారు వాళ్లు.
దాని వెనక ప్రలోభం దాగి ఉంది అంటారు వీళ్లు.
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తప్పేముంది అంటారు వాళ్లు.
ఆదుకునే పేరుతో అమాంతంగా మతం మార్చేస్తున్నారంటారు వీళ్లు!
ఏది నిజం? దేనిలో ఎంత వాస్తవం? రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులను లోతుగా పరిశీలిస్తే పై రెండు వాదనల్లోనూ వాస్తవం ఉందని తేలుతోంది. రాజ్యాంగం ప్రకారం మత ప్రచారం చేసే హక్కు, నచ్చిన మతంలోకి స్వచ్ఛందంగా మారే హక్కూ ఎవరికైనా ఉన్నప్పటికీ, జరుగుతున్న సంఘటనలు అంత సాఫీగా సాగిపోతున్నట్టు కనిపించడం లేదు. అనేక సందర్భాల్లో 'తీవ్రమైన ప్రచార ఒత్తిడి'కి లోనైన వారు క్రైస్తవంలోకి మారిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. 

'సమస్య లేని సమాజం, ఇబ్బంది లేని మనిషి ఎవరుంటారు? ఆ ఇబ్బందిని పరిష్కరించుకోవడానికి సాయపడడం మానవత్వం. ఆ ఇబ్బందిని పరిష్కరిస్తాం. మా మతంలోకి రండి అనడం షరతులతో కూడిన ప్రలోభం. క్రైస్తవం మతాంతరీకరణ అంశంలో మామూలు ప్రచారంతో పాటు రెండోదీ ఉధృతంగా సాగుతోంది'' అని ఒక సామాజిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒకప్పుడు హిందూమతంలో ఉన్న వివక్షను, సామాజిక అంతరాలను ఎదిరించడానికి, అగ్ర కులాల దుర్మార్గాల నుంచి తప్పించుకోవడానికి దళిత వర్గాలు మత మార్పిడిని ఎంచుకున్నాయి. స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకున్నాయి. 

ఇందులో ఎలాంటి తప్పూ లేదు. దీన్ని ఎవరూ తప్పుబట్టలేరు కూడా. అంతెందుకు; భారత సమాజంలో దళితులు ఎదుర్కొనే వివక్షకు 'మతం మారడమే మందు' అని దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ తేల్చి చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో 1956 అక్టోబర్ 14న ఐదు లక్షల మంది దళితులు హిందూ మతం నుంచి బౌద్ధంలోకి మారారు. వివక్షను ఎదుర్కొనే అణగారిన వర్గాల వారికి అంబేద్కర్ ఈ పరిష్కార మార్గాన్ని చూపించారు. అయితే సామాజికంగా ఎలాంటి వివక్షకు లోను కాని వారు, పై అంతస్తులో ఉన్నవారు కూడా మతం మారుతుండడం ఇటీవలి కాలంలో కనిపిస్తున్న పరిణామం. అగ్రవర్ణాల వారైనా, మరెవరైనా స్వచ్ఛందంగా మారితే సమస్యే లేదు. 

కానీ అసలు విషయమేమిటంటే... పలు సందర్భాలలో ఇతరత్రా కారణాలు వారిపై ప్రభావం చూపుతున్నాయి. వికసించీ వికసించని మనసులను అనేక ప్రలోభాలకు గురి చేసి, ప్రభావితం చేసి మతం మార్పించుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మత మార్పిడులపై ప్రచురించిన 'దేవుడు పిలిచాడు' కథనాన్ని చదివి, వరదరాజులు అనే బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి తనంతతానుగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఫోన్ చేశారు. తన కూతురిని ఇలాగే ప్రలోభ పెట్టి, నన్‌గా మార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. పాత్రికేయ రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన, అగ్ర కులానికి చెందిన ఒక ప్రముఖుడి కూతురితో కూడా మతం మార్పించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. 

కానీ సఫలం కాలేదు. ఇదే తరహాలో విశాఖపట్నానికి చెందిన కుటుంబం విషయంలో మత మార్పిడి జరిగిపోయింది. ఇది వివక్షకు అందని కోణం. 'ఎందుకిలా?' అని ప్రశ్నిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని, ఆర్థికంగా బాగుంటుందని... రకరకాల సమాధానాలు వినవస్తున్నాయి. వ్యక్తులు, చట్టాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... మత మార్పిళ్లపై ఘర్షణలు జరుగుతున్న సందర్భాలూ అనేకం! కుటుంబాల స్థాయిలో ఆవేదనను మిగిల్చిన ఉదంతాలూ ఉన్నాయి. నాణేనికి రెండు కోణాలు ఉన్నట్లే.... మత మార్పిడికీ రెండు కోణాలు ఉన్నాయి. ఎవరి అనుభవాలు వారివి. అవీ ఇవీ... అన్నీ... (వారివారి అభ్యర్థన మేరకు కొందరి పేర్లు మార్చాం) 

12 రోజుల క్రితం రాజమండ్రి కోటిపల్లి బస్‌స్టాండ్‌లో బస్సు దిగాం. కాసేపటికి ముగ్గురు ఆడవాళ్లు మాకు ఎదురుగా వచ్చారు. 'మతం మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీకు ఆర్థికంగా కూడా బాగుంటుంది' అని చెప్పారు. 'మాకు అలాంటి ఉద్దేశం లేదు' అని చెప్పి ముందుకు నడిచాం. కానీ, వాళ్లు మమ్మల్ని వదల్లేదు. 'ఒక్కసారి ఆలోచించండి. ఈ పుస్తకాలు చదివితే మతం గురించి అర్థమవుతుంది' అని కొన్ని పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. 'మాకు అవసరం లేదు. మమ్మల్ని వదిలేయండి' అని ముందుకు నడిచినా వారు వదిలిపెట్టలేదు. గట్టిగా కోప్పడటంతో వెళ్లిపోయారు. కోటిపల్లి బస్‌స్టాండ్‌లో మా చుట్టాల్లోనూ కొందరికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. - సరస్వతి, హైదరాబాద్ 

మా అమ్మాయిని ఇప్పించండి..
దాదాపు 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాం. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. చిన్నమ్మాయిని బాగా చదివించా. హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తూ ఉండేది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాం. ఈ ఏడాది జులైలో ఒక రోజు ఊరు వెళ్తున్నానని చెప్పింది. మర్నాడు మాకు చెన్నై నుంచి ఫోన్ వచ్చింది. 'నాన్నా.. నేను నన్‌గా మారిపోతున్నా. దానికున్న కారణాలన్నీ ఆరు పేజీలు ఉత్తరంలో రాసి ఉంచాను' అని చెప్పింది. 

మాకు షాక్ కొట్టినట్లయింది. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్లాం. మా అమ్మాయిని చూడటానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రానికి మా అమ్మాయి బయటకు వచ్చింది. తెల్లటి దుస్తులు వేసుకుంది. ఆమెను చూడగానే ఏడుపొచ్చింది. ఆమెతో ఏకాంతంగా మాట్లాడదామంటే.. చుట్టూ కాపలా! ఇక లాభం లేదని వాళ్లతో గొడవ పడ్డాను. అప్పుడు లోపలి నుంచి ఒకాయన వచ్చి నా చేతిలో ఓ కాగితం పెట్టాడు. 

తాను మేజర్‌నని.. ఇష్టపూర్వకంగా మతం మార్చుకున్నానని.. తల్లిదండ్రులు (మేము) బలవంతంగా తీసుకువెళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని కోరుతూ చెన్నై పోలీస్ కమిషనర్‌కు మా అమ్మాయి రాసిన ఉత్తరం అది. దాన్ని చూసి మరోసారి షాక్‌కి గురయ్యాను. నాకు, మా అమ్మాయికి ఎటువంటి విభేదాలు లేవు. అందరం అప్యాయంగా ఉండేవాళ్లం. అలాంటిది నామీద పోలీస్ కమిషనర్‌కు ఉత్తరం ఎలా రాస్తుంది. కొద్దిసేపు ఆమెను బతిమాలాం. కన్నీళ్లు పెట్టుకున్నాం. మా అమ్మాయి కూడా ఏడ్చింది. కానీ, నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. ఇక చేసేదేమీ లేక తిరిగి వచ్చాం.

ఆమె బట్టలు, సెల్‌ఫోన్లు అన్నీ తిరిగి ఇచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్‌లో చూస్తే- "నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాబట్టి దేవుడు నిన్ను ఎంపిక చేశాడు. దేవుడి సేవలో ఉన్న ప్రశాంతత మరెక్కడా లేదు. కొన్ని కోట్ల మందిలో నీకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. ప్రభువు సేవ చేసుకొని తరించుకుందుగాని రా!'' అనే అర్థంలో అనేక మెసేజ్‌లు ఉన్నాయి. దీనిపై కేసు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని.. చర్చి అధికారుల ద్వారానే ప్రయత్నించాలని ఒక న్యాయవాది చెప్పారు. 

మల్కాజ్‌గిరిలో ఒక చర్చి దగ్గరకు పంపాడు. నేను ఈ ప్రస్తావన తెచ్చిన వెంటనే వారు 'ఆ విషయాలు మాకు తెలియవు..' అంటూ లోపలికి వెళ్లిపోయారు. 'మీ అమ్మాయి నన్‌గా మారిందిట కదా..' అని బంధువులు అడిగితే మొదట్లో బాగా కోపం వచ్చేది. తర్వాత... కోపం తగ్గింది. బాధ మాత్రం తగ్గలేదు. మా అమ్మాయిని ఎందుకు ఆకర్షించాల్సి వచ్చింది? ఆమె చేత మతం మార్పించే హక్కు ఎవరిచ్చారు? దయనీయమైన పరిస్థితి ఏమిటంటే... నేను మా అమ్మాయిని తిరిగి తెచ్చుకోలేను.. అలాగని కేసు పెట్టలేను.
- వరదరాజులు, హైదరాబాద్ 

అమెరికాలో మార్పించారు..
నాకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె స్రవంతి 2002లో సత్యం కంప్యూటర్స్‌లో చేరింది. మూడే ళ్లు పనిచేశాక అమెరికా పంపించారు. అక్కడికి వెళ్లిన కొద్దికాలానికే పని ఒత్తిడితో బాధ పడుతున్న ఆమెను, సహోద్యోగులు, స్థానిక చర్చి ఫాదర్ కలిసి ఏసును నమ్మితే స్వాంతన చేకూరుతుందని నమ్మించారు. బాప్టిజం ఇప్పించారు. 

ఇండియాకి వచ్చాక ఉద్యోగం మానేసింది. అదేమని ప్రశ్నిస్తే... ప్రభువే అన్నీ చూసుకుంటాడని చెప్పింది. పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం పాపం అని చెప్పింది. భువనేశ్వర్‌లో మానసిక వైద్యుడి వద్ద ఏడాదిన్నర చికిత్స చేయించాం. బాగానే కోలుకుంది. దాంతో విశాఖపట్నం తీసుకొచ్చి నా దగ్గరే వుంచా. అన్నీ మరిచిపోయినా ప్రభువుని మాత్రం గుర్తుంచుకొంది. రెండేళ్ల తరువాత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వెతికి తీసుకొచ్చాం. 

మళ్లీ రెండుసార్లు అలా పారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌లో కైస్తవుల వద్దే ఉన్నట్లు తెలిసింది. చదువుకున్న వారిని కూడా ఇలా మాయచేసి, మతం మార్పించడం దారుణం. ఆ బాధ ఓ తండ్రిగా నాకు తెలుసు. ఇతర మతాల్ని ద్వేషించాలని ఏ మతమూ చెప్పదు. కానీ... ఒక లక్ష్యంతో మిషనరీ ఏర్పాటుచేసి మతం మార్చే పనిలో పడ్డారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. - సోమయాజుల త్యాగరాజ శాస్త్రి, హోమియో వైద్యుడు, విశాఖపట్నం 

మళ్లీ మారాను...
కొన్నేళ్ల క్రితం నాకు బాగా జబ్బు చేసింది. మతం మారితే స్వస్థత చేకూరుతుందని ఇరుగు పొరుగు, ఆ మత పెద్దలు వచ్చి చెప్పారు. ఆరోగ్యం బాగు పడుతుందన్న ఆశతో మతం మార్చుకున్నాను. రెండేళ్లు శ్రద్ధగా ప్రార్థనలు చేశాను. అయినా, ఫలితంలేదు. దీంతో... తిరిగి మునుపటి మతంలోకి మారిపోయాను. - సత్యవతి, రాజోలు మండలం (తూర్పు గోదావరి) 

మిషనరీలతో గ్రామాల్లో మార్పులు
ఒకప్పుడు డబ్బులిచ్చి మతాన్ని మార్పించే వారు. ఇప్పుడు మిషనరీల ద్వారా విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి జరుగుతుండటంతో మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇందులో ఎవరి బలవంతమూ లేదు. క్రిస్టియన్లు బైబిల్ చదివినా చర్చికి వెళ్లినా స్వస్థత చేకూరుతుందని నమ్మకం.
-జ్యోతుల క్రిస్టియన్ రాజు, ప్రధానోపాధ్యాయుడు, శ్రీకాకుళం జిల్లా 

"ఎన్నాళ్లు ఇలా పేదలుగా ఉంటారు? మా మతంలోకి మారితే ఇళ్లు ఇస్తాం. అన్ని విధాలుగా బాగా చూసుకుంటాం. రండి... అని ఓ పెద్దాయన చెప్పాడు. ''ఇదీ హైదరాబాద్‌కు చెందిన రాంబాయి చెప్పిన విషయం. మతం మార్చేందుకు చేసే ప్రయత్నాల్లో ఇదొకటి! ఇలా ఇంకెన్నో!
Read more >>

'దేవుడు' పలిచాడు రాష్ట్రంలో జోరుగా మత మార్పిళ్లు

మత వ్యాప్తికి మనదేశంలో 18 ప్రధాన సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మరో 45 సంస్థలున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, కడప జిల్లాలు కేంద్రంగా మత మార్పిళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే పది శాతం మందిని మతం మార్చినట్లు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి హిందూ సంస్థలు చెబుతున్నాయి. 

మత ప్రచార సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. మన రాష్ట్రాన్ని రెండుగా విభజించి మత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్-1 కేంద్రంగా 29, ఆంధ్రప్రదేశ్-2లో 77 సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ రెండింటికి అనుబంధంగా 205 సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద సంస్థలు. ఇక చిన్న చిన్న సంస్థలు చాలానే ఉన్నాయి.

ఆపరేషన్ 'ఏడీ 2000'
వంద కోట్లకు పైబడిన జనాభా... ఇందులో అత్యధికులు 'అన్య మతస్థులు'! దీంతో అంతర్జాతీయ మిషనరీలు భారత్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. భారత్‌లో మిషనరీల కార్యకలాపాలను అనుసంధానిస్తూ, వాటికి అవసరమైన నిధులు అందించేందుకు 'ఏడీ 2000' అనే ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. 1995లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 186 దేశాలకు చెందిన మత బోధకులు హాజరయ్యారు. ఇదే 'జాషువా ప్రాజెక్టు'గా పేరుపొందింది. 

ఇందులో భారత్‌కు సంబంధించి మూడు ప్రత్యేకమైన వ్యూహాలు రచించారు. అవి... ప్లగ్, ప్రిమ్, నైస్. 'ప్లగ్'లో భాగంగా... ప్రతి భౌగోళిక ప్రాంతానికి అనుసంధానమవుతారు. అక్కడ నివసిం చే ప్రజల ముఖ్యంగా పట్టణాల్లోని పేదల వివరాలు సేకరిస్తారు. 'ప్రిమ్'లో భాగంగా ప్రార్థనలు, పరిశోధనలు, మత ప్రచారం, ప్రజలను సమీకరించటం వంటి కార్యకలాపాలు చేపడతారు. 'నైస్'లో మత మార్పిడుల కోసం ప్రచారకులను ఉపయోగిస్తారు. జాషువా ప్రాజెక్టులో భాగంగా అమెరికాకు చెందిన అనేక మంది వ్యూహకర్తలు భారత్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ ప్రాజెక్టు కోసం వీరు సేకరించిన సమాచార విస్తృతిని చూసి నిఘా సంస్థలే ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. జాషువా మొదటి దశ పూర్తయిందని... ఇప్పుడు 'జాషువా-2' నడుస్తోందని తెలుస్తోంది. ఈ వివరాలతో 'తెహల్కా' పత్రిక తాజాగా 'టాప్ సీక్రెట్' పేరిట ఒక ప్రత్యేక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఒకప్పుడు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. తర్వాత డెల్టాకూ విస్తరించాయి. మిషనరీలు సేవా మార్గంలో ప్రస్థానిస్తూ అదే స్థాయిలో మతాన్నీ విస్తరిస్తున్నాయి. 

రాష్ట్రాల స్థాయిలో...
మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిసా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలు మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. వాస్తవానికి, బ్రిటిష్ ఇండియాలో దీనిపై ఎటువంటి చట్టాలు లేవు. రాయగఢ్, ఉదయ్‌పూర్‌వంటి కొన్ని రాజ సంస్థానాలు మాత్రం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. స్వతంత్ర భారతంలో... 1954లో ఇండియన్ కన్వర్షన్ (రెగ్యులేషన్ అండ్ రిజిస్ట్రేషన్) బిల్లును, 1960లో బ్యాక్ వర్డ్ కమ్యూనిటీస్ (రిలిజియస్ ప్రొటెక్షన్) బిల్లు ప్రవేశపెట్టారు. 

వీటికి పార్లమెంటులో తగిన మద్దతు లభించకపోవడంతో వాటిని ఉపసంహరించుకున్నారు. 1979లో ప్రతిపాదించిన మత స్వేచ్ఛ బిల్లును కూడా తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే... ఒడిసా, మధ్యప్రదేశ్‌లు మత స్వేచ్ఛపై 1968, 1969లలో రెండు చట్టాలను చేశాయి. 1978లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ తరహా చట్టాన్ని చేశారు. 2002లో తమిళనాడు అసెంబ్లీ కూడా బలవంతపు మత మార్పిడిని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. 

ం ప్రపంచవ్యాప్తంగా చర్చిలు 22,000 పత్రికలు, 1890 రేడియో, టీవీ స్టేషన్లను నడుపుతున్నాయి. ం మలేసియాలో ఉన్న హిందువులలో 75 శాతం మంది వచ్చే ఐదేళ్లలో మతం మార్చుకుంటారని ఒక అంచనా. 

నేరము..శిక్ష
బలవంతంగా మత మార్పిడి చేయడం భారతీయ శిక్షా స్మృతి కింద నేరం. బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారిపై ఐపీసీ 295ఏ, 298 కింద చర్యలు తీసుకోవచ్చు. ఈ కేసుల్లో నేరం రుజువైతే దోషులకు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించవచ్చు. ఒడిసా, మధ్యప్రదేశ్ చేసిన చట్టాల ప్రకారం... చిన్నపిల్లలను, మహిళలను, ఎస్సీ, ఎస్టీలను బలవంతంగా మత మార్పిడి చేసినట్లు తేలితే వారికి శిక్షను రెట్టింపు చేయవచ్చు. ఒక మతానికి చెందిన పుణ్యక్షేత్రంలో ఇతర మతస్థులు ప్రచారం చేయడం నేరం. ఐపీసీ 153(ఎ) ప్రకారం... రెండు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేలా ప్రసంగించినా, రెచ్చగొట్టినా చర్యలు తీసుకోవచ్చు. 

ఆమె పేరు రామలక్ష్మి. సొంతవూరు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి. భర్త రాజారావు తాగుడుకు బానిసై 12 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు రామలక్ష్మి నాలుగు ఇళ్లలో పాచి పని చేయడం మొదలుపెట్టింది. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక... వారిని చదివించలేక సతమతమవుతున్న ఆమెను క్రైస్తవ మత ప్రచారకులు ఆకర్షించారు. 'నీ బిడ్డలను చదివిస్తాం' అన్నారు. రామలక్ష్మి... ఇప్పుడు మేరీగా మారింది. ఇద్దరు కుమారులు మిషినరీ స్కూల్‌లో చదువుతున్నారు. మేరీ అలియాస్ రామలక్ష్మి జీవితం గతంలోకంటే మెరుగుపడింది! మరి... రామలక్ష్మి మతం మారడాన్ని ఎలా తప్పు పట్టగలం? ఎక్కడుంది మూలం?
Read more >>