Monday

అమెరికన్ స్వదేశీ...


కొత్త సంవత్సరంలో ప్రపంచ ప్రళయమే వస్తుందన్న ఊహాగానాలు నిజమో అబద్ధమో కానీ, ఏవో విపరీతాలు జరిగే సూచన మాత్రం కనిపిస్తున్నది. లేకపోతే, అమెరికా అధ్యక్షుని నోట 'స్వదేశీ' మాట వినిపించడమేమిటి? 'అవుట్‌సోర్సింగ్'ను తగ్గిస్తామని, 'ఇన్‌సోర్సింగ్'ను ప్రోత్సహిస్తామన్న 'అప్రాచ్యపు' మాటలు బరాక్ ఒబామా నోటినుంచి రావడం ఆశ్చర్యమూ దిగ్భ్రాంతికరమూ మాత్రమే కాదు, డాలర్ తత్వానికే అపచారం. 

అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులూ, చైనీయులూ ఎగరవేసుకుపోతున్నారని, అమెరికా పనులు అమెరికన్లకే దక్కాలని, అమెరికన్ కంపెనీలు తమకు కావలసిన సామగ్రిసేకరణను దేశీయ కంపెనీల నుంచే సమకూర్చుకోవాలని ఒబామా నిజంగా ఆలోచిస్తూ ఉంటే కనుక, దానివల్ల భారత్ వంటి బాడీషాపింగ్ కేంద్రాలకు, అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు నష్టం జరగవచ్చు. మన దేశంలోని ఐటి ఉద్యోగార్థులు ఆందోళన చెందనూ వచ్చు. కాకపోతే, అటువంటి విపరిణామాలేవీ జరగబోవని, ఎంత ప్రయత్నించినా అమెరికా అవుట్‌సోర్సింగ్‌ను వదులుకోదని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి. 

ఒకవేళ, ఉద్యోగార్థులకు కావలసినన్ని వీసాలు దొరకవు అనుకున్నా, తాత్కాలికంగా విదేశీఆదాయాలకు గండిపడుతుందని భయపడినా కూడా అదేమంత అధిగమించలేని కష్టమేమీ కాదు. మార్కెట్‌వేటలో ఒక దేశం కాకపోతే మరో దేశానికి తరలివెడుతున్నట్టే, ఉద్యోగాల వేటలో ఉన్న దేశాలు కూడా తమ అవసరాలను బట్టి తమ వ్యూహాలను మార్చుకుంటాయి. ఒబామా ప్రకటనలో ఆందోళన చెందవలసిన విషయం ఒకటే- ఆసియా ఖండం నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన వారి మీద స్థానికుల్లో ఈర్ష్యా భావాన్ని పెంచే ప్రయత్నం చేయడం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, అమెరికా నోట స్వదేశీసిద్ధాంతం వెలువడడం మాత్రమే అసలు విశేషం. 

అవుట్‌సోర్సింగ్ అనే అందమైన మాటకు అసలు అర్థం- సేవలను దిగుమతి చేసుకోవడం. సేవలు ఎగుమతి చేయగలిగే దేశం సంపన్నదేశమై ఉంటే, ఆ సేవలు చాలా ఖరీదుగా ఉంటాయి, పేద దేశమైతే అవి కారుచవకగా ఉంటాయి. తమ దేశంలో అవే సేవలకు చాలా వ్యయం అవుతుంది కాబట్టే, వాటిని బడుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అమెరికా వంటి సంపన్నదేశాలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో లబ్ధి చెందుతున్నది అవుట్‌సోర్సింగ్ చేసుకుంటున్న దేశాలే. 

అయితే, ద్రవ్య మారకపు విలువలో ఉన్న అంతరాల వల్ల, శ్రమశక్తికి కట్టే విలువలో ఉన్న తారతమ్యాల వల్ల సేవలను ఎగుమతి చేస్తున్న దేశాల వారు కూడా లాభపడుతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటిరంగంలో జరుగుతున్న ఈ లావాదేవీల వెనుక మరో లక్ష్యం కూడా ఉన్నది. భారత్, చైనా వంటి దేశాల్లో అధికాదాయ ఉద్యోగవర్గాలను సృష్టించి, వారిని తమ సరుకులకు మార్కెట్‌గా మలచుకోవడం. భారతదేశంలో ఐటీ ఉద్యోగులు కేంద్రీకరించి ఉన్నచోట్ల బహుళజాతిసంస్థల వినియోగవస్తువులను, ఇతర సరుకులను విక్రయించే మాల్స్, వాణిజ్యకేంద్రాలు అధికంగా ఉండడం గమనించవచ్చు. 

కారుచవకగా శ్రమశక్తిని అమ్ముకోవడానికి భారత్, చైనా వంటి దేశాలు పరస్పరం పోటీపడుతున్నాయి. భారతీయ ఐటీ ఉద్యోగికి లభిస్తున్న వేతనాలకు అమెరికన్లు పనిచేయగలిగితే, అవుట్‌సోర్సింగ్ ఇంత ఉధృతంగా ఉండేది కాదు. భారత్ వంటి దేశాల్లో సమస్త ఉత్పాదకతా ఎగుమతి ఆధారితంగా మారిపోతున్నట్టే, విద్యారంగం కూడా సేవల ఎగుమతిని దృష్టిలో పెట్టుకునే శ్రమ, బౌద్ధిక శక్తులను ఉత్పత్తి చేస్తున్నది. అటువంటి విద్యావిధానం అమెరికాలో లేకపోవడం, గణితం వంటి రంగాలలో అమెరికన్లలో నైపుణ్యం లేకపోవడం కూడా ఆ దేశంలో ఐటిరంగానికి కావలసిన మానవవనరులు లేకపోవడానికి కారణం అయి ఉండవచ్చు. 

అమెరికా తన దేశంలో ఉద్యోగాలు సృష్టించడానికి అనుసరించే పద్ధతులు వేరు. మన దేశంలో అణు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అక్కడ లక్షలాది పనిదినాలు ఏర్పడుతున్నాయని అమెరికన్ ప్రభుత్వం బాహాటంగానే చెప్పింది. ఎంత చెడ్డా మన దేశాధినేతలు రాజకీయవాదులుగానో, సంక్షేమాన్ని కోరుకునేవారిగానో కనపడాలని చూస్తారు. విదేశీ పర్యటనల్లో సైతం మన పాలకులు, రాజనీతిజ్ఞతతనే ప్రదర్శించడానికి ఇష్టపడతారు. అమెరికా పాలకులు అట్లా కాదు, వాళ్లు ఏ దేశానికి వెళ్లినా సేల్స్‌మెన్‌లాగానే వెడతారు. 

వాళ్ల దేశంలో కార్పొరేట్లకు వాణిజ్య అవకాశాలు, కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు సంపాదించి పెట్టడమే వారి పని అన్నట్టుగా వ్యవహరిస్తారు. సాధ్యమైనచోట్ల నయాన తమకు కావలసినవి సాధించుకుంటారు. లేనిచోట్ల భయంతోనే సాధ్యం చేసుకుంటారు. ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌లలో చేసిన యుద్ధాల ద్వారా అనేక వాణిజ్య అవకాశాలను వారు పొందారు. లిబియాలో అధికారమార్పిడి చేసి, అందుకోసం సాధ్యమైనంతగా విధ్వంసాని కి పాల్పడి- ఇప్పుడు పునర్నిర్మాణం పేరుతో అనేక కాంట్రాక్టులు, ఉద్యోగాలు పొందారు. 

రెండో ప్రపంచయుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన దేశాలు తమ తమ జాతీయార్థిక వ్యవస్థలను నిర్మించుకునే క్రమంలో స్వీయరక్షణ ఆర్థిక విధానాలను అనుసరించాయి. ఆ కాలంలో కూడా సాధ్యమైనంతగా ఆర్థికదోపిడీ చేయడానికి అగ్రరాజ్యాలు ప్రయత్నించాయి. దేశీయ ప్రభుత్వాల గుప్పిట్లో ఉన్న వనరులను, వ్యాపారావకాశాలను గ్లోబలైజేషన్ పేరుతో తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి రెండు దశాబ్దాల నుంచి సంపన్నదేశాలు ప్రయత్నిస్తున్నాయి. 

స్వీయరక్షణ విధానాలు తప్పని, సబ్సిడీలు ఇవ్వడం అపరాధమని, సరిహద్దులు మిధ్య అనీ కొత్త సిద్ధాంతాలను రంగంలోకి తెచ్చి, పెట్టుబడులను, లాభాలను నిరాఘాటంగా అటూఇటూ ప్రవహింపజేయడం జరుగుతోంది. స్వదేశీ అన్న పదం కాలం చెల్లిన నాటు మాటగా మారిపోయిన తరువాత దేశీయ ఉత్పత్తులను ప్రాధాన్యం ఇచ్చి ఆదరించాలని అమెరికా అధ్యక్షుడు తమ దేశపౌరులకు విజ్ఞప్తి చేయడం హాస్యాస్పదం కాక మరేమిటి? అటువంటి మాటలు అన్నందుకే, వాటిని విధానాలలోకి అనువదించినందుకే కదా సద్దాం హుసేన్ ఉరికంబమెక్కింది? 

ప్రతి వ్యవస్థలోనూ దాని శత్రువు గర్భితమై ఉంటుందంటారు. ప్రపంచీకరణ యుగం లో కూడా దానికి విరుగుడు దాని కడుపులోనే ఉంటుంది. తాను పగ్గాలు వదిలిన మార్కెట్‌శక్తులే తనకు ఉరితాడులా బిగుసుకుంటాయని అమెరికాకు ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తున్నది. ఔట్‌సోర్సింగ్ వల్ల, చవుక శ్రమశక్తి, సరుకుల ఎగుమతుల వల్ల చైనా ఇంతింతై వటుడింతై ఎదిగిపోతున్నది. 

మితిమీరిన స్వలాభాపేక్ష కారణంగానే అమెరికన్ కార్పొరేట్ ప్రపంచం పీకలలోతు మాంద్యంలో కూరుకుపోయింది. వనరుల దురాక్రమణ కోసం ప్రారంభించిన యుద్ధాల ముగింపు ఎట్లానో తెలియక అల్లాడుతున్నది. ప్రపంచానికే ఆర్థిక రాజధానిగా ఉన్న అమెరికాలో చెప్పుకోదగ్గ దేశీయ తయారీపరిశ్రమ లేదు. మేధాపరంగా గర్వించదగ్గ మానవశక్తి నిల్వలు లేవు. యుద్ధాల ద్వారానో, పెట్టుబడుల ద్వారానో లాభాలు గడించి పరాన్నభుక్కుగా మిగలడం తప్ప, గట్టి పునాదులు కలిగిన ఆర్థిక వ్యవస్థా లేదు. ఇంత జరిగాక, ఇప్పుడు స్వదేశీ అంటే ఫలితం ఉంటుందా?

0 comments:

Post a Comment