Monday

ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లతో చక్కెర వ్యాధికి చుక్క...


 " మధుమేహానికీ, గుండెజబ్బులకూ దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఇప్పటికే వచ్చిన షుగర్‌ని నియంత్రించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు తీసుకునే ఆహారంలో ఫ్లేవనాయిడ్‌లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి'' ..యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియా పరిశోధకులు అధ్యయనం చేసి మరీ చెబుతున్న మాటలివి. అంతేకాదు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో కొవ్వు శాతం కూడా గణనీయంగా తగ్గుతుందట. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీరాడికల్స్‌ను సమర్థంగా నిరోధించే శక్తి యాంటీ ఆక్సిడెంట్లకు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 

యాపిల్స్, బ్రోకోలి, బెర్రీలు వంటివాటిలో ఈ ఫ్లేవనాయిడ్‌లు అధికంగా ఉంటాయి. ఈ అధ్యయనం కోసం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియా పరిశోధకులు 51ఏళ్ల 74 ఏళ్ల దాకా వయసున్న 93 మంది టైప్2 డయాబెటిస్ ఉన్న మహిళలను ఎంచుకున్నారు. వారిలో సగం మందికి రోజూ మామూలు ఆహారంతో పాటు ఫ్లేవనాయిడ్‌లు అధికంగా ఉండే రెండు చాక్లెట్‌బార్లు తినడానికి ఇచ్చేవారు. మిగతావారికి మామూలు ఆహారం మాత్రమే ఇచ్చేవారు. ఏడాది తర్వాత వారిని పరీక్షిస్తే.. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే చాక్లెట్ బార్లు తిన్నవారిలో గుండెపోటు ముప్పు 3.4 శాతం మేర తగ్గింది. 

అలాగే, ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ స్థాయులు కూడా గణనీయంగా తగ్గాయి. కాగా ఇవే పరిశోధనలు టైప్2 డయాబెటిస్‌తో బాధ పడుతున్న మగవారిపైనా చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు 'జర్నల్ డయాబెటిస్ కేర్'లో ప్రచురితమయ్యాయి. షుగర్ బాధితులకు ఏడాదిపాటు రోజూ రెండు చాక్లెట్లు ఇవ్వడం.. కానీ చివరికి వారిలో మధుమేహం నియంత్రణలోకి రావడం.. అంతా చిత్రంగా ఉంది కదూ. 

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం: అన్నిరకాల నిమ్మజాతి పండ్లు, యాపిల్, స్ట్రాబెర్రీలు, దానిమ్మ, టొమాటోలు, ఉల్లిపాయలు (ఎర్రవి), తృణధాన్యాలు, గ్రీన్ టీ, ముదురు రంగులో ఉండే చాక్లెట్ (కొకోవా 70% కన్నా అధికంగా ఉండాలి).

0 comments:

Post a Comment