Monday

బాబ్రీ కూల్చివేత ఒక ఘటన మాత్రమే! దాంట్లో గొప్ప మేముంది? మెరుపూ కాదు, మరకా కాదు... సుప్రీం కోర్టు వ్యాఖ్యలు...


"దాంట్లో గొప్ప ఏముంది? ఇది ఒక (జరిగిన) సంఘటన మాత్రమే. ఇందులో పార్టీలు (కక్షిదారులు) మన ఎదుట ఉన్నాయి. ఇదేమీ సుప్రసిద్ధ సంఘటన కాదు.. అపఖ్యాతి మూటగట్టుకోవాల్సిన ఉదంతమూ కాదు'' -బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలివి. బాబ్రీ కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ చేపట్టడానికి ముం దు జడ్జిలను ఉద్దేశించి అదనపు సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ.. "సుప్రసిద్ధ బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించిన అంశం ఇది'' అంటూ ఏదో చెప్పబోయారు. 

ఆ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ సి.కె.ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. కాగా.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, శివసేన అధినేత బాల్‌ఠాక్రేతో పాటు మరో 18 మంది నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ సీబీఐ మోపిన అభియోగాలపై విచారణను మార్చి 27కు వాయిదా వేసింది. ఈ అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు కోర్టుకు తమ వాదనను వినిపిస్తూ అఫిడవిట్ సమర్పించనందున కేసు విచారణను న్యాయమూర్తులు వాయిదా వేశారు. 

బాబ్రీ కూల్చివేత వ్యవహారంలో నేరపూరిత కుట్రకు సంబంధించిన అభియోగాల ను ఎందుకు పునరుద్ధరించకూడదో తెలపాలంటూ అద్వానీ, ఠాక్రే, బీజేపీ నేతలు కల్యాణ్ సింగ్, ఉమా భారతిసహా 21మందికి సుప్రీం కోర్టు నిరుడు మార్చి 4న నోటీసులు జారీచేయడం విదితమే. నిజానికి.. ఈ నేతలందరిపై అభియోగాలను ఎత్తివేస్తూ అలహాబాద్ హైకో ర్టు 2010 మే 21న ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సీబీఐ సవాలు చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ఆనాడు ఈ నోటీసులను జారీ చేసింది.

0 comments:

Post a Comment