Friday

మార్పునకు సంకేతం భోగి...


మూడురోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు వేడుక భోగి. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పర్వాన్ని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, మకరసంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో వేరువేరు సంప్రదాయరీతుల్లో మకర సంక్రాంతి పర్వాన్ని జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఏ రీతిన, ఏ పేరుతో పండుగ జరుపుకున్నా, పంటలు ఇంటికి చేరే సందర్భం కాబట్టి ధాన్యలక్ష్మికి స్వాగతం పలకటం ఈ పర్వం ముఖ్య ఉద్దేశం.

మార్పునకు నాంది జీవితంలో మార్పును ఆహ్వానిస్తూ భోగి రోజున వేకువజామున భోగి మంటలు వేయటం సంప్రదాయం. సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ లోగిళ్లలో ముందు రోజు రాత్రే ముగ్గులు వేస్తారు. మరికొందరు వేకువజామున రంగవల్లులతో లోగిళ్లను అలంకరిస్తారు. కట్టెలతో ఇళ్లముందు లేదా వీధి కూడళ్లలో భోగిమంటలు వేస్తారు. భోగిమంటలు వేస్తే మన పాపాలు తొలగి పోతాయని నమ్మకం. తమసోమా జ్యోతిర్గమయ అంటుంది వేదం. భోగి మంటల వెలుగుల్లో మన జీవితాల్లో వున్న చీకట్లు తొలగిపోయి, కొత్త కాంతులు పరుచుకుంటాయని కూడా నమ్ముతారు. భారతీయ సంప్రదాయంలో అగ్నికి చాలా ప్రాధాన్యత వున్నది. ఏ శుభకార్యానికైనా ముందు అగ్నిని పూజిస్తారు. హోమక్రతువు నిర్వహిస్తారు. హోమం పరిత్యాగ స్ఫూర్తిని రగిలించి, ఆత్మశుద్ధికి తోడ్పడుతుంది. భోగిమంటలు కూడా ఓ విధంగా అగ్ని ఆరాధనే. ఆత్మశుద్ధి ప్రక్రియకు సోపానమే. సంక్రాంతి వేడుకలకు కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరటం సంప్రదాయం. బంధుమిత్రులంతా ఒకచోట చేరి, పాటలు పాడుతూ భోగిమంటల చుట్టూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు.

దిష్టి తీసే భోగిపళ్లు భోగి పండుగ రోజున జరుపుకునే మరో వేడుక చిన్నారులకు భోగిపళ్లు పోయటం. మూడు సంవత్సరాల లోపు చిన్నారులకు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోయేందుకు గాను భోగిపళ్లు పోస్తారు. రేగిపళ్లు, చెరుకుముక్కలు, బంతిపూలతో అక్షతలు చేస్తారు. భోగిరోజు సాయంత్రం ముత్తయిదువలందరినీ పేరంటానికి పిలుస్తారు. బంధువులు, గ్రామంలోని ముత్తయిదువలందరి సమక్షంలో చిన్నారులకు భోగిపళ్లు పోసే పండుగ నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రకరకాల పిండివంటలు, ముఖ్యంగా స్వీట్లు తయారు చేస్తారు. ఈ సందర్భంగా స్వీట్లను బహుమతిగా ఇస్తారు. ఈ పండుగ సందర్భంగా కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు భారీగా కానుకలు ఇవ్వటం సంప్రదాయం. అలాగే పంట ఇల్లు చేరుతుంది కాబట్టి పొలంలో పనిచేసే సిబ్బందికి, ఇంట్లో పనిచేసే వారికి బట్టలు, ధాన్యం, డబ్బు ఇచ్చి సంతోషపరిచే రోజు భోగిరోజు. అస్సాంలో ఇదే రోజును భోగాలి బిహుగా జరుపుకుంటారు. మన రాష్ట్రంలో మాదిరిగానే అక్కడ కూడా కోడి పందాలు, ఎడ్లపందాలు నిర్వహిస్తారు. అదనంగా అస్సాంలో నెమళ్లతో కూడా పందాలు నిర్వహిస్తారు. ఇలా పలు రాష్ట్రాల్లో సంక్రాంతికి ముందు రోజును వేడుకగా జరుపుకుంటారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

0 comments:

Post a Comment