Friday

బిఎస్ఎన్ఎల్ చేజారనున్న 'మినీరత్న'


బిఎస్ఎన్ఎల్, హెచ్ఎంటి, హిందుస్తాన్ పేపర్, హిందుస్తాన్ న్యూస్‌ప్రింట్‌తో సహా పలు ప్రభుత్వ రంగ సం స్థలు ప్రతిష్ఠాత్మకమైన మినీరత్న హోదా చేజార్చుకునే ప్రమాదంలో పడ్డాయి. ఆయా సంస్థల పనితీరు దారుణంగా దిగజారడమే ఇందుకు కారణమంటున్నారు. ఈ హోదా చేజారినట్టయితే ఆయా సంస్థలు 500 కోట్ల రూపాయల పెట్టుబడికి లోబడి ప్రభుత్వ అనుమతితో పని లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కోల్పోతాయి. మినీరత్న హోదా పొందిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు దారుణంగా దిగజారినట్టు ప్రభుత్వ రంగ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (డిపిఇ) గుర్తించిందంటున్నారు. దీంతో వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని పిఎస్‌యులు మినీరత్న హోదాకు సంబంధించిన అన్ని విభాగాల్లోను సంతృప్తికరమైన పనితీరు ప్రదర్శిస్తున్నది లేనిది సమీక్షించాలని ఆయా మంత్రిత్వ శాఖలను ఆదేశించిందని చెబుతున్నారు.

నిర్దేశిత ప్రమాణాల ప్రకారం మూడు సంవత్సరాల పాటు వరుసగా లాభాలు ఆర్జిస్తూ పాజిటివ్ నెట్‌వర్త్ ఉన్న కంపెనీలు మాత్రమే మినీరత్న హోదా పొందడానికి అర్హత కలిగి ఉంటాయి. ఆ రెండు షరతులకు లోబడి ఆర్థిక ఫలితాలు సాధించే కంపెనీలు మాత్రమే ఆ హోదాను కొనసాగించుకోగలుగుతాయి. అలాగే మినీరత్న హోదా పొందాలని ఆశపడే పిఎస్‌యులు కనీసం ముగ్గురు నాన్ అఫీషియల్ డైరెక్టర్లను కూడా నియమించుకోవాలి. ఆ సంఖ్యలో నాన్ అఫీషియల్ డైరెక్టర్లు లేని కంపెనీలకు కూడా ఆ హోదా చేజారే ప్రమాదం ఉంది. తమ శాఖల పరిధిలోని పిఎస్‌యులు ఈ ప్రమాణాలకు అనుగుణంగా పని చేస్తున్నది లేనిది పరిశీలించి సోమవారం నాటికి సమగ్ర నివేదికలు పంపాలని డిపిఇ ఆయా మంత్రిత్వ శాఖలకు జారీ చేసిన ఆదేశంలో కోరినట్టు తెలుస్తోంది.

0 comments:

Post a Comment