మానవులుగా ఈ భూమ్మీద జన్మించాక తాము చూస్తున్నదంతా నిజమని భావిస్తారు. ఆ తరువాత ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారికి ఆ దరిమిలా ఇదంతా ఓ మాయ, భ్రాంతి, మి«థ్య అని తెలుసుకుంటారు.మనం చూస్తున్న ఈ ప్రపంచం నిజం కాదని, భగవంతుడిని ప్రేమించి ఆయనలో ఐక్యమవ్వాలనుకోవడమే మానవ జన్మలక్ష్యం కావాలని మెహెర్‌బాబా తన సందేశాలలో పలుమార్లు పేర్కొన్నారు. మెహెర్‌బాబా స్వీయరచన, భగవద్వచనం గ్రంథంలో మెహెర్‌బాబా ఒక చక్కని కథాంశాన్నిచ్చారు. ఆ వివరాలు మీరూ పరిశీలించండి.
*** ఒక గ్రామంలోని గొర్రెల కాపరి దగ్గర వందలాది గొర్రెలు, మేకలు ఉండేవి. రాత్రింబవళ్లు వాటిని జాగ్రత్తగా చూసుకొంటూ ఉండేవాడతను. ఒకరోజు అర్ధరాత్రి దాటిని తరువాత మంద మధ్యలో కలవరం వినిపించింది. ఒక పులి మేకను నోట కరుచుకుని పారిపోయింది. గొర్రెల కాపరి దివిటీ వెలిగించి గొర్రెల మంద మధ్యకు వెళ్లి చూసాడు. అక్కడ గొర్రెల మధ్యలో చిన్న పులి పిల్ల అతని కంటపడింది. తను జాగ్రత్తగా ఆ పులిపిల్లను చంకనేసుకుని ముద్దుగా పెంచుకున్నాడు. రోజూ గొర్రెల మందతోపాటు పులి పిల్ల కూడా అడవికి పోతూ ఆకూ అలం తిని సెలయేటి నీళ్ళు తాగి మేకపిల్లలాగే చెంగు చెంగున గంతులేసేది. అలా కొన్ని నెలలు గడిచాయి. పులి పిల్ల బాగా పెరిగింది. అందమైన శరీరం వచ్చింది. కాని పులిపిల్లకు పులిరాజు మాదిరి క్రూరత్వం, ధైర్యం అలవడలేదు. మేక పిల్లలాగే అమాయకంగా ఉండింది. ఏదైనా అలజడి జరిగితే మేక పిల్లలతో పాటు పిరికిదానిలా పారిపోయేది. తను పులినన్న తలంపే దానికి కలగలేదు.
ఒకరోజు యధాతధంగా మందతో పాటు పులిపిల్ల అడవిలో మేతకెళ్లింది. ఆ రోజు అడవిలోనుంచి వచ్చిన పెద్దపులిని చూసిన గొర్రెలన్నీ పారిపోయాయి. పులి పిల్లకు ఏమీ పాలుపోక అక్కడే నిలబడిపోయింది. పెద్దపులి ఈ పులిపిల్లని దగ్గరగా పిలిచి 'నీవు ఈ గొర్రెల మందతో పాటు తిరుగుతున్నావేమిటి?' నేనే నీకు తండ్రిని. ఈ అరణ్యానికి మహారాజుని. ఇక్కడున్న పులి పిల్లలన్నీ నా సంతానమే. నీవు ఇలా మమ్మల్ని విడిచి గొర్రెలు, మేకల వెంట తిరగడం బాగాలేదు. ఆకు అలం తిని బతకటమేమిటి? మనం ఆకులు తినకూడదు. నీవూ నాలాంటి పులివే. నీకు నాకు భేదం లేదు. మనిద్దరం ఒక్కటే. నీవు నాతో వచ్చేయ్' అని మృగరాజు పులి పిల్లను కోరింది. మరెన్నో మంచి మాటలు చెప్పింది. అనేక విధాలుగా నచ్చ చెప్పి చూసింది. ఎన్ని చెప్పినా పులిపిల్ల నమ్మితే కదా! ఏమన్నా గొర్రెల కాపరి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనుకుంది.
చివరకు మృగరాజు పులిపిల్లను ఓ నేల బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ బావిలో నీళ్లను చూపించి, స్వచ్ఛమైన ఆ నీటిలో పులిరాజు, పులి పిల్లను తమ నీడను స్పష్టంగా చూడమంది. 'చూసావా! నీవు నేను ఒకేలా వున్నాం. మనిద్దరం ఒకే జాతికి చెందిన వాళ్లం. నీకు తెలియక భ్రమలో పడి గొర్రెల వెంట తిరుగుతున్నావు. ఎంత తెలివిమాలిన దానవు' అంటూ భుజం మీద చెయ్యివేసి ప్రేమతో నిమిరింది. ఆ ఆత్మీయతతో పులిరాజు చెప్పిన మాటల మీద పులిపిల్లకు నమ్మకం కలిగింది. నేను నా స్వానుభవంతో చెబుతున్నాను. నేను నీకు తండ్రిని. నన్ను నమ్మి నా వెంట వస్తే నీకే అన్నీ అర్థమవుతాయని చెప్పి మృగరాజు ఆ పులిపిల్లను తన వెంట అరణ్యంలో తాముండే గుహకు తీసుకుపోయింది.
ఇదీకథ. ఈ కథ వినడానికి గమ్మత్తుగా ఉంది కదూ. కానీ దీని అంతరార్థాన్ని గమనిస్తే దారి తప్పిన పులిబిడ్డను మృగరాజు తన గుహకు తీసుకెళ్లిన మాదిరి, అవతారుడు మానవ రూపధారిగా అవతరించి, తన వాళ్ళైన మానవాళినందరినీ తన దరి చేర్చుకుంటాడని మెహెర్‌బాబా అన్నారు. అవతారుని దరిచేరి, ఆయన నామస్మరణలో అవతారునిలో ఐక్యమవ్వాలన్నది మన జీవన లక్ష్యం కావాలని బాబా తన సందేశంలో పేర్కొన్నారు. ఆలోచించండి...స్పందించండి.
0 comments:
Post a Comment