ఎవరు అదృష్టవంతులు? మంచి గురువు దొరికిన శిష్యుడా? మంచి శిష్యుడు దొరికిన గురువా? మంచి శిష్యులు చాలా మంది ఉంటారు. కాని మంచి గురువులు మాత్రం అతి కొద్దిమందే ఉంటారు. వారు దొరికినవాళ్లు మాత్రం కచ్చితంగా అదృష్టవంతులే. ప్రతి విద్యార్థీ ఒక అద్భుతమనీ ప్రతి పిల్లవాడిలోనూ ఏదో ఒక శక్తి ఉంటుందనీ గ్రహించే గురువు ప్రతి శిష్యుణ్ణీ మెరిపిస్తాడు. అలా మెరిపించిన తన గురువుల గురించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఆయన గురువుల గురించి ఆయన మాటల్లో.... నేను రామనాథపురం హైస్కూల్లో చేరగానే నాలోని జిజ్ఞాసి మేల్కొన్నాడు. అప్పుడు నాకు మార్గదర్శకంగా నిలబడిన నా ఉపాధ్యాయుడు ఇయదురై సొలొమోన్. ఆయన చాలా విశాల దృక్పథంతో తన తరగతి గదిలోని విద్యార్థుల్నందరినీ ఉత్సాహపరిచేవారు. 'జీవితంలో విజయం పొందడానికి మూడు అంశాల మీద పట్టు సాధించాలి- అవి కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడమూను' అని ఆయన అంటుండేవారు. ఆయన నుంచి నేను నేర్చుకున్న గొప్ప పాఠం అదే. నేనేదైనా సాధించాలంటే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలనీ, అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలనీ ఆయన నుంచి తెలుసుకున్నాను. ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు చిన్నప్పటినుంచీ ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణాలన్నా అమితాసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలూ ఎగురుతుండటం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి. సాధారణ గ్రామీణ బాలుడినయినప్పటికీ నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుణ్ణి నేనే కావడం విశేషం. ఇదంతా ఇయదురై సొలోమోన్ పుణ్యం. ఆయన ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడంటే ఆయన వల్లనే నేను ఏమాత్రం చదువుకోని తల్లిదండ్రుల బిడ్డనయినా కూడా ఏది కావాలనుకుంటే అది కాగలవని నమ్మాను. 'విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు' అనేవాడాయన. దయగల గురువు మేం ఫోర్త్‌ఫాంలో ఉన్నప్పుడు ఒకరోజు పరాకున మరొక తరగతిలో ప్రవేశించాను. ఆ క్లాస్‌లో పాఠం చెప్తున్న గణితశాస్త్ర ఉపాధ్యాయుడు రామకృష్ణ అయ్యర్ ఆగ్రహించి నా మెడ పట్టుకుని అందరి ముందూ బెత్తంతో బాదాడు. చాలా నెలల తర్వాత నేను లెక్కల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నప్పుడు ఆయన పాఠశాల ప్రార్థన సమావేశంలో అందరి ముందూ ఆ సంగతి మరొకసారి గుర్తుచేసి- 'చూడండి... నా బెత్తం దెబ్బలు తిన్నవారెవరైనా గొప్పవాళ్లు కావలసిందే. ఏదో ఒకనాటికి ఈ పిల్లవాడు తన పాఠశాలకీ ఉపాధ్యాయులకీ కీర్తి తేబోతున్నాడు' అన్నాడు. ఆ ప్రశంస నా పూర్వపు అవమానాన్ని పూర్తిగా మరిపించేసింది. ఆరోజుల్లో మాకు ప్రొఫెషనల్ చదువుల గురించిన ఊహ కూడా లేదు. ఉన్నత చదువులంటే అప్పటికి కాలేజీ చదువు మాత్రమే. అప్పటికి దగ్గరలో ఉన్న కాలేజీ తిరుచినాపల్లిలో ఉండేది. దానిని క్లుప్తంగా ట్రిచీ అనీ అనేవారు. 1950లో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి ట్రిచీ సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను. సెయింట్ జోసెఫ్ కాలేజీలో రెవరెండ్ ఫాదర్ టి.ఎన్.సెకీరా వంటి ఉపాధ్యాయుడు లభించడం నా అదృష్టం. ఆయన మా ఇంగ్లిషు లెక్చరర్ మాత్రమే కాకుండా మా హాస్టలు వార్డెన్ కూడా. ప్రతి రాత్రి రెవరెండ్ ఫాదర్ ప్రతి విద్యార్థినీ వచ్చి పలకరించేవాడు. చేతిలో బైబిలుండేది. ఆయన సహనం శక్తి అద్భుతమైనవి. విద్యార్థుల ప్రతి చిన్న సామాన్య అవసరాన్ని కూడా పట్టించుకునే శ్రద్ధ ఆయనది. ఎంత శ్రద్ధ అంటే దీపావళి నాడు మేం తలంటు పోసుకోవడానికి నువ్వుల నూనె పంచేంత. నేను సెయింట్ జోసెఫ్ కాలేజీలో నాలుగేళ్లు ఉన్నాను. నా హాస్టలు మూడో సంవత్సరంలో నేను విజిటేరియన్ మెస్ కార్యదర్శిగా ఎంపిక అయినప్పుడు ఒక ఆదివారం మా రెక్టర్ రివరెండ్ ఫాదర్ కలథిన్‌ని లంచ్‌కి పిలిచాం. మా మెనూ మా మా కుటుంబ నేపథ్యాల నుంచి ఎంపిక చేసిన మంచి వంటకాలన్నిటితో కూడి ఉంది. ఫలితం! మేం ఎదురుచూడనంత ప్రశంస. రెవరెండ్ ఫాదర్ తన ప్రశంసతో మమ్మల్ని ముంచెత్తాడు. మా మామూలు సంభాషణలో ఒక పిల్లవాడి కుతూహలంతో ఆయన పాల్గొన్నాడు. అది కలకాలం గుర్తుండే అనుభవం. నేను సెయింట్ జోసెఫ్‌లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లిష్ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లిష్‌లోని సర్వశ్రేష్ట రచనల్ని చదువుతుండేవాణ్ణి. టాల్‌స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. బిఎస్‌సి డిగ్రీ పూర్తిచేశాక ఫిజిక్సు నా సబ్జెక్టు కాదని గ్రహించాను. నా కలలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను. దక్షిణ భారతదేశమంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమానికం లాంటి మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను. కష్టపడటమే సులువు ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను గానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదువబెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్షా నా సామర్థ్యంపై ఆమెకున్న నమ్మకం నన్ను గాఢంగా చలింపజేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికున్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్‌షిప్ సంపాదించుకోవడమే. నన్ను ఎమ్‌ఐటిలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శనకోసం పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు. విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవక్కడుంచబడ్డాయి. వాటిపట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను. విద్యార్థులంతా హాస్టల్‌కు వెళ్లిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గరే కూర్చుండేవాణ్ణి. పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాణ్ణి. నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక స్పెషల్ సబ్జెక్ట్‌గా ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ని ఎంచుకున్నాను. లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది. నేను ఎలాగైనా విమానాల్ని నడపాలి. నాకు నన్ను నిలదొక్కుకునే శక్తి లేదని తెలిసి కూడా నాకా లక్ష్యం సాధ్యమనే నేను నమ్మాను. నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు. ఆ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను. ఆ దారిలో వైఫల్యాలున్నాయి. ఆశాభంగాలున్నాయి. తోవ తప్పడాలున్నాయి. కానీ దారి తప్పిన ప్రతివేళా నా తండ్రి మాటలు నన్ను మళ్లా సరిగా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలివే: 'ఇతరుల్ని అర్థం చేసకున్నవాడు విజ్ఞాని. కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజనశూన్యం.' ఆ ముగ్గురు ఎమ్.ఐ.టి.లో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారు ప్రొ. స్పాండర్, ప్రొ. కె.ఏ.వి. పండలై. ప్రొ. నరసింగరావు గార్లు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. కానీ అందరి ఆశయమూ ఒకటే - తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణని తమ చైతన్యంతోనూ అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తిపరచడమే. ప్రొ.స్పాండర్ నాకు ఏరోడైనమిక్స్‌కి సంబంధించిన సాంకేతిక అంశాల్ని బోధించేవారు. ఎప్పుడూ శాంతంగా, శక్తిమంతంగా, స్వయంశిక్షితంగా ఉండేవాడు. సాంకేతిక రంగంలో వచ్చే మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన విద్యార్థుల్ని కూడా ముందుకు తీసుకుపోయేవాడు. భారతీయుల్లో ఆయన చూసిన లోపమేదైనా ఉందంటే వాళ్ళు తమకు కావలసింది సరిగ్గా ఎంచుకోలేకపోతున్నారనేది. ఉదాహరణకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎందుకు? మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు కాకూడదు? కొత్తగా ఇంజనీరింగ్‌లోకి ప్రవేశించే విద్యార్థులందరికీ నేనిచ్చే సలహా ఇదే. వాళ్ళు తమ బ్రాంచ్ ఎన్నుకోబోయే ముందు చూసుకోవలసింది ఏమంటే అది వాళ్ళ ఎంపిక, వాళ్ళ ఆంతరంగిక అనుభూతినీ, ఆకాంక్షనీ వ్యక్తం చెయ్యగలుగుతోందా లేదా అనే. ప్రొ. పండలై నాకు ఏరో స్ట్రక్చర్ డిజైన్‌నీ, విశ్లేషణనీ బోధించాడు. ఆయన చాలా కలుపుగోలు మనిషి. ఉల్లాసి. ప్రతి ఏడాదీ తన బోధనకి కొత్త మెరుగులు దిద్దుకునే ఉత్సాహవంతుడైన ప్రొఫెసర్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రహస్యాల్ని మాకు విప్పి చెప్పింది ఆయనే. ఎన్నో అంశాలపైన విద్యార్థులకి తరగతి గదిలో ఆయనతో విభేదించగలిగే స్వేచ్ఛ ఉండేది. ప్రొ. నరసింగరావు గణితశాస్త్రవేత్త. ఆయన మాకు ఏరో డైనమిక్స్ సిద్ధాంతాన్ని బోధించేవారు. ద్రవ పదార్థాల డైనమిక్స్‌ని బోధించేటప్పుడు ఆయన పాటించిన బోధనా పద్ధతి నాకిప్పటికీ గుర్తే. ఆయన తరగతులకు ఒకసారి హాజరయ్యాక మాథమెటికల్ ఫిజిక్స్ తప్ప మరే విషయం పైనా నా మనసు పోయేది కాదు. చలనానికీ, గమనానికీ, పక్కకి జారడానికి, ప్రవహించడానికీ మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలోనే విజ్ఞానశాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. తమ నిశిత బోధన వల్ల ఆ ముగ్గురూ ఏరోనాటిక్స్ పట్ల నాలో తృష్ణని జాగృతం చేశారు. నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ట వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు. నేను వారికి కృతజ్ఞుణ్ణి. (ఒక విజేత ఆత్మకథ గ్రంథం నుంచి)
1 comments:
kuşadası
milas
çeşme
bağcılar
zonguldak
AJEJ1D
Post a Comment