యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి అనేక జబ్బులు చుట్టుముట్టి మరణాల సంఖ్య బాగా పెరుగుతోందని తెలిపింది. దేశంలో పిల్లల పేరు చెప్పుకుని ఎన్.జి.ఒ సంస్ధలు అనేకం పని చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వారికి అందుతున్న నిధులు బాధితుల వరకూ చేరడంలేదని ‘ఆల్ జజీరా’ వార్తా సంస్ధ తెలిపింది.
యెమెన్ లో మెజారిటీ ప్రజలు పేదలే. ఆయిల్ సంపద అంతా ప్రవేటు కంపెనీలు, నియంతృత్వ పాలకులు పంచుకు తింటుండగా దేశ వనరులకు అసలు యజమానులయిన ప్రజలు మాత్రం దరిద్రంలో మగ్గుతున్నారు. అవిద్య వల్ల మతపరమైన మూఢనమ్మకాలు పెచ్చరిల్లి పసి పిల్లలకు అదనపు కష్టాలను తెస్తున్నాయి. వైద్య సౌకర్యాలు మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉండవు. యునిసెఫ్ లాంటి సంస్ధలు రాజధాని నగరంలో తూతూ మంత్రంగా శిబిరాలు నెలకొల్పినా అవేమీ పల్లె జనానికి అక్కరకు రావడం లేదు. ఈ దుర్భర పరిస్ధితుల నుండి పుట్టిన తిరుగుబాటును నియంతృత్వ పాలకులు క్రూరంగా అణచివేస్తుండగా వారికి పశ్చిమ దేశాలు అండగా నిలుస్తున్నాయి. సిరియాలో లేని తిరుగుబాటుకి ఆయుధాలు సరఫరా చేస్తూ, మిలియన్ల కొద్దీ తగలేస్తున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు యెమెన్ లో ప్రజలను దారుణంగా అణచివేస్తున్నప్పటికీ పట్టించుకోవు. వారి కంపెనీల వ్యాపారాలకు సహకరించే పాలకులు నియంతలైనా, మానవ హక్కులను హరించివేస్తున్నా, ప్రజా తిరుగుబాట్లను అణచివేస్తున్నా వారికి అనవసరం.
ఆల్ జజీరా, రాయిటర్స్, యునిసెఫ్ అందించిన ఫొటోలివి :-
0 comments:
Post a Comment