భారత పాలకులకు ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి అనూహ్య రీతిలో ప్రశంసలు లభించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవాలన్న అమెరికా ఒత్తిడిని భారత్ సమర్ధవంతంగా ప్రతిఘటించిందని తాలిబాన్ కొనియాడింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ను భారత్ ఒట్టి చేతులతో పంపి మంచిపని చేసిందని ప్రశంసించింది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ విలువ ఇచ్చిందనీ, అమెరికా ఒత్తిడికి లొంగి ఆఫ్ఘన్ ఆపదలోకి భారత్ ను నెట్టకుండా విచక్షణ చూపారని ఒక ప్రకటనలో తెలిపింది.
ఆఫ్ఘనిస్ధాన్ లో భారత్ ప్రయోజనాలపై పదే పదే దాడులు చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటూ, పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ కు దగ్గరి సంబంధాలున్నాయని భావిస్తున్న తాలిబాన్ నుండి భారత్ కు ఇలాంటి ప్రశంసలు రావడం అనూహ్య పరిణామం. ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ అధికారంలోకి రాకముందు తాలిబాన్ చేత పదవీచ్యుతం కాబడిన నార్త్రన్ అలయన్స్ కు భారత్ మద్దతు ఇచ్చింది. 1996 లో తాలిబాన్ అధికారం చేజిక్కించుకున్న అనంతరం భారత్ ను దాదాపు ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్లగొట్టారు. వెళ్లగొట్టడం అంటే భారత కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా నిరాకరించడమే.
తాలిబాన్ తో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న హక్కానీ నెట్ వర్క్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ లోని భారత ప్రయోజనాలపై అనేకసార్లు దాడులు నిర్వహించింది. ఈ హక్కానీ నెట్ వర్క్ కు ఐ.ఎస్.ఐ మద్దతు ఉందని పత్రికలు తరచూ రాస్తుంటాయి. ఆఫ్-పాక్ సరిహద్దులో పాకిస్ధాన్ లోని గిరిజన ప్రాంతాల నుండి హక్కానీ గ్రూపు ప్రధానంగా పని చేస్తుందన్న ప్రచారం కూడా ఉంది. ఈ గ్రూపు ఆఫ్ఘనిస్ధాన్ తో పాటు పాకిస్ధాన్ లో కూడా అనేక దాడులు నిర్వహించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాబూల్ డిప్లొమేటిక్ డిస్ట్రిక్ట్ లో సైతం ఈ గ్రూపు అనేక హై ప్రొఫైల్ దాడులు నిర్వహించింది. అమెరికా మిలట్రీ అధికారులు అనేక సార్లు హక్కానీ గ్రూపు ని అత్యంత ప్రమాదకరమైన సంస్ధగా అభివర్ణించడం కద్దు. ఆఫ్ఘన్ లోని భారత రాయబార కార్యాలయంపై కూడా ఈ గ్రూపు దాడి చేసింది.
ఈ నేపధ్యంలో భారత్ కు తాలిబాన్ నుండి ప్రశంసలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 నుండి అమెరికా సైనికులు మెజారిటీ ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకుంటామని ఒబామా ఇప్పటికే ప్రకటించినందున దక్షిణాసియా భవిష్యత్ ముఖ చిత్రంలో భారత్ ఇప్పటికంటే చురుకయిన పాత్ర నిర్వహించాలని అమెరికా కోరుకుంటున్నట్లు వివిధ వార్తలు తెలియజేస్తున్నాయి. సివిలియన్ కాంట్రాక్టుల వరకే ఇప్పటివరకూ భారత్ పాత్ర పరిమితమై ఉంది. ఆఫ్ఘన్ మిలట్రీ అధికారులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ అది పరిమితమే. అది కూడా భారత భూభాగంలోనే బోధనా రూపంలోనే పరిమితమయింది. సివిలియన్ కాంట్రాక్టుల రూపంలో ఆఫ్ఘనిస్ధాన్ లో భారత్ ఇప్పటివరకూ 2 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు పెట్టిందని ‘ది హిందూ’ తెలిపింది. హై వేల నిర్మాణంలోనూ, ఆఫ్ఘన్ పార్లమెంటు నిర్మాణంలోనూ భారత్ కాంట్రాక్టర్ల పాత్ర ఉందని, అయితే ఆఫ్ఘన్ భద్రతా బలగాల విషయాలనుండి భారత్ దూరంగా ఉంటూవచ్చిందని ఆ పత్రిక తెలిపింది.
భారత్ కార్యకలాపాలు ఇంకా విస్తరించాలని అమెరికా కోరుకుంటోంది. అమెరికా సైనికుల్లో కొంత భాగాన్ని ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకుని సిరియా, ఇరాన్ ల చుట్టూ కేంద్రీకరించడానికి అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆఫ్ఘనిస్ధన్ లో అమెరికా తరపున భారత్ తగిన పాత్ర నిర్వహించాలని అమెరికా కోరుకుంటోంది. ఈ విషయాన్ని చర్చించడానికే ఇటీవల అమెరికా రక్షణ మంత్రి లియోన్ పెనెట్టా భారత్ కి వచ్చినట్లు తాలిబాన్ ప్రకటన ద్వారా అర్ధం అవుతోంది. సార్వభౌమత్వం, సమానత్వం, పరస్పర గౌరవం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం… మొదలయిన విలువల ప్రాతిపదికన భారత్ తో సత్సంబంధాలను మాత్రమే తాము కోరుకుంటామని తాలిబాన్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
“ఈ ప్రాంతంలో ఇండియా ముఖ్యమైన దేశం అనడంలో సందేహం లేదు… ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలు, మత విశ్వాసాలు, స్వాతంత్ర్యంపై ఉన్న ప్రేమ వారికి బాగా తెలుసు. కేవలం అమెరికా ఒత్తిడితో ఆఫ్ఘన్ ఆపదలోకి వారి దేశాన్ని నెట్టడం పూర్తిగా తర్క విరుద్ధం” అని తాలిబాన్ ప్రకటన పేర్కొంది. 2014 లో అత్యధిక సంఖ్యలో విదేశీ బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ విడిచి వెళ్లనున్నందున ఇక్కడ మరింత చురుకైన పాత్ర నిర్వహించాలని ఇటీవలి సందర్శన సందర్భంగా లియోన్ పెనెట్టా భారత్ ను కోరాడనీ అయితే తన ప్రయత్నాలలో పెనెట్టా విజయంగానీ, ప్రగతి గాని సాధించలేకపోయాడనీ ఆ ప్రకటన తెలిపింది. పెనెట్టాను ఇండియా ఒట్టి చేతులతో కాబూల్ కి పంపిందనీ ప్రకటన తెలిపింది.
“పెనెట్టా ఇండియాలో మూడు రోజులు గడిపి భారీ బరువును ఇండియా భుజాలపైకి మార్చడానికి ప్రయత్నాలు చేశాడు. తద్వారా ఆఫ్ఘన్ నుండి పారిపోవడానికి దారి వెతుక్కోవాలని పెనెట్టా ప్రయత్నించాడు” అని అమెరికా దురాక్రమణ సైన్యాలతో పది సంవత్సరాలకు పైగా పోరాడుతున్న తాలిబాన్, తన ప్రకటనలో పేర్కొంది. “ఈ డిమాండ్లకు ఇండియా తలొగ్గలేదని విశ్వసనీయమైన మీడియా సోర్సెస్ ద్వారా తెలిసింది. అమెరికా డిమాండ్ల పట్ల రిజర్వేషన్స్ ప్రకటించారనీ తెలుస్తోంది. ఎందుకంటే అమెరికన్లు తమపై వేటు వేసే గొడ్డలిని వారే నూరుకుంటున్నారని ఇండియాకు తెలుసు, లేదా తెలుసుకోవాలి” అని ప్రకటన లో పేర్కొన్నట్లు ‘ది హిందూ’ తెలిపింది.
వివిధ దేశాల మధ్య సమానత్వం ప్రాతిపదికన సంబంధాలు ఉండాలనీ, స్వతంత్ర దేశాల సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవాలనీ తాలిబాన్ చేసిన డిమాండు సమర్ధనీయం. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాక స్వతంత్ర దేశాలను వివిధ సాకులతో దురాక్రమించుకోవడం తమ హక్కుగా అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఈ దుర్మార్గాలను భారత దేశం అంతర్జాతీయ వేదికలపై తగిన విధంగా ఖండించి తిరస్కరించ వలసిన బాధ్యత ఉంది. నెహ్రూ, ఇందిరా ల హయాంలో అలీన దేశాల కూటమి కి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన ఇండియా గత రెండు మూడు దశాబ్దాలుగా ఆ పాత్రను త్యజించడం సమర్ధనీయం కాదు.
0 comments:
Post a Comment