ప్రతి రంగంలోనూ సమస్యలు ఉంటాయి. సమస్యల్ని సరిగ్గా విశే్లషించుకుని ఒపిగ్గా వెతికితే -సమాధానాలూ అక్కడే దొరుకుతాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఐటి రంగం చెప్పేది ఇదే. ఈ విషయాన్ని మరోసారి చెప్పేందుకే -హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో ఈమధ్య ఒక సదస్సు నిర్వహించారు. దానిపేరు.. అడ్వాంటేజ్ ఏపి. ========= భవిష్యత్ అంతా ఐటీదే. అందుకే -రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలతో రండి. పెట్టుబడులు పెట్టి, యువతరానికి ఉపాధి మార్గాలు చూపండి -అన్న నినాదంతో రెండురోజులు నిర్వహించిన ‘అడ్వాంటేజ్ ఏపీ’తో వ్యాపారరీత్యా రాష్ట్రానికి అడ్వాంటేజ్ ఎంత? కొలువుల రీత్యా యువతరానికి లాభమేంటి? అన్నది ఒక్కముక్కలో చెప్పలేం. కాస్త లోతుల్లోకి చూడాల్సిందే. ** ప్రస్తుతం దేశంలో 11కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నాం. అందుబాటులోకి వచ్చిన 3జీ సేవలు దాటుకుంటూ, 4జీ సేవల కోసం పరుగులు తీస్తున్నాం. ఇకిప్పుడు -గ్రామాలను ఫైబర్ ఆప్టిక్స్‌తో అనుసంధానించాక, మొబైల్ విప్లవంలాగే ‘నెట్’ విప్లవం రానున్నదన్నది నిర్వివాదాంశం. అదే జరిగితే, నెట్ వినియోగంలో అనూహ్య మార్పులు తథ్యం. ఈ పరిస్థితుల్లోనే -రాష్ట్ర ‘ఐటి’ సత్తా చాటేందుకు ‘అడ్వాంటేజ్ ఏపి’ నిర్వహించారు. అంతర్జాతీయ ఐటీ సంస్థల గమ్యం ఒక్కటే -అది మన రాష్ట్రం కావాలన్నది చెప్పడమే సదస్సు ఉద్దేశం. ‘మన దేశం ఐటీ రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తుంది. కానీ కొన్ని అంతర్జాతీయ ‘రేటింగ్’ ఏజెన్సీలు భారత వృద్ధిపై ‘తక్కువ’ అంచనాలు ఇస్తున్నాయి’ అన్నది కేంద్ర ఐటీ సహాయ మంత్రి సచిన్ పైలెట్ మాట. ప్రస్తుతం మన దేశంలో ఐటీ, ఐటీ ఆధారత సేవల రంగం సుమారు 5 లక్షల 50 వేల కోట్ల విలువ (100 బిలియన్ డాలర్లు) చేస్తోందని, ఇది మరో ఎనిమిదేళ్లలో 16 లక్షల 50 వేల కోట్ల స్థాయికి (300 బిలియన్ డాలర్లు) చేరనున్నదనీ పైలెట్ చెప్పారు. ఇదే సమయంలో హార్డ్‌వేర్ రంగం కూడా సుమారు 22 లక్షల కోట్లు (400 బిలియన్ డాలర్లు) స్థాయికి చేరనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం హార్డ్‌వేర్ రంగం 2 లక్షల 75 వేల కోట్ల స్థాయిలో (50 బిలియన్ డాలర్లు) ఉందన్నది జగమెరిగిన విషయం. ఈ లెక్కలను బట్టి అంచనా వేసుకునేది ఒక్కటే -రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా ఐటీదే. మన దేశంలో వాడుకలోవున్న అన్ని అధికార భాషల్లోనూ ఐటి అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్లు రూపొందాలంటూ కేంద్రమంత్రి పైలెట్ వ్యక్తం చేసిన ఆకాంక్ష చిన్న విషయంగా కొట్టిపారేయలేం. మన దేశంనుంచి ఐటీ ఎగుమతులు ఎక్కువగా, అంటే 62 శాతం అమెరికాకే జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి, కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచంలోని అన్ని ప్రముఖ ఐటీ విఫణుల్లోనూ భారత్ తన సత్తా చాటాల్సి ఉందన్నది ఆయన అభిప్రాయం. సదస్సులో వెలుగుచూసిన మరో ముఖ్యాంశం -హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (ఐఐఐఆర్)ను ఆరంభించేందుకు 17 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇప్పటికే అనుమతినిచ్చాయి. రాబోయే రెండు మూడు నెలల్లో దీని గురించి మరిన్ని వివరాలు మనకు అందే అవకాశం ఉంది. *** ఐటీ ఆధారిత సేవా పథకాలైన ఈ-సేవ, మీ-సేవలు ప్రభుత్వానికి ప్రజల్ని దగ్గర చేశాయని ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటించుకున్నారు. ప్రజలకు కావాల్సిన అనేకానేక ధృవీకరణ పత్రాల జారీ, బిల్లుల చెల్లింపులో ‘ఐటి’ సేవలు సత్ఫలితాలు ఇచ్చాయన్నది ఆయన మాట. ఆప్టికల్ సైబర్ కనెక్టివిటీని పంచాయితీలకూ విస్తరించే దిశలో కేంద్రం సాయాన్ని వాడుకుంటామన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన నైపుణ్యం పొందేలా (ఇంజనీరింగ్ కోర్సుల్లో) చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదంతా ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగమేనన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అలాగే, టెక్నాలజీ సంస్థలు ఆందోళన పడాల్సింది లేదు. వారికి కేంద్రం, రాష్ట్రాలూ ఇతోధికంగా సహకరిస్తాయి’ అన్న హామీ కేంద్ర ఐటీ కార్యదర్శి జె సత్యనారాయణ నుంచి లభించింది. విధానాల రూపకల్పనలో పరిశ్రమతో ప్రభుత్వం సంప్రదిస్తూనే ఉంటుందన్నది ఆయన మాట. ట్రాన్స్‌పోర్టు, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్‌వంటి రంగాల్లో ‘ఐటి’ వినియోగం రాబోయే రోజుల్లో ఎక్కువవుతుందని, దీనికి తగినట్టు కొత్త టెక్నాలజీలతో ఐటీ సంస్థలు మందుకు రావాలన్నది ఆయన పిలుపు. ఇది నిజం, ఇదే యువతరానికి సరైన అవకాశం కూడా. కొత్త సాంకేతిక ఒరవడిని అందిపుచ్చుకోవటం ద్వారా ఉపాధి పునాధులను బలోపేతం చేసుకోవడమే కాదు, వేగవంతం చేసుకోవడానికీ అవకాశం ఉంటుంది. *** ప్రస్తుతం దేశంలో నాలుగు వేలకుపైగా ఐటీ సంస్థలుంటే, వాటిలో దాదాపు 28 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఇది మరింత విస్తృతం కావాలంటే -ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ సంస్థలు ఏర్పాటు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తే, ‘ఐటి’ పరిశ్రమ గ్రామాల వరకూ విస్తరించి గ్రామీణ ప్రతిభను వెలికితీయగలవు. పైగా సంస్థలకు నిర్వహణ వ్యయమూ తగ్గుతుంది. ఒక్క ఇన్ఫోసిస్ సంస్థనే తీసుకుంటే, ఆ సంస్థకు కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 22 వేలమంది నిపుణులు పని చేసే రెండు కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ వలసపోయే నిపుణుల శాతం కూడా తక్కువ. మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే, రాబోయే మూడేళ్లలో ప్రతి ఏడూ 25శాతం సిబ్బందిని పెంచేలా ఆ సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే ఐటి, ఐటి ఆధారిత రంగాల్లో దాదాపు మూడు లక్షలమంది పని చేస్తున్నారు. ఈ అంశాలకే అడ్వాంటేజ్ ఏపీ విస్తృత ప్రాచుర్యం ఇచ్చే ప్రయత్నం చేసింది. సదస్సులో గూగుల్, హిటాచీ, బిఎంసీ, ఈఎంసీ, హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి 25 సంస్థలు పాల్గొన్నాయి. అయితే, భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టకుండా -‘ఐటీ’ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్న పాయింట్ చుట్టూనే సదస్సు నడవటం అసలు ఉద్దేశం దెబ్బతిందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో గత రెండు మూడేళ్లుగా నెలకొన్న ఐటీ అనిశ్చితి నెమ్మదిగా తొలగుతున్న తరుణంలో -ప్రతినెలా 20నుంచి 30 కొత్త సంస్థలు వస్తున్నాయని, ఇప్పటికి దాదాపు వెయ్యి సంస్థలు పని చేస్తున్నాయని ప్రతినిధులు, నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎదురవుతున్న సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని -ఆ దిశలో ఔత్సాహికులు కృషి చేయాలనీ సూచించారు. రెండు రోజుల సదస్సులో దాదాపు 130 కంపెనీలు, కాలేజీలు, సంస్థలు తాము రూపొందించిన వివిధ అప్లికేషన్లు, సొల్యూషన్లు, ఐడియాలు -అన్నింటినీ ప్రర్శనలో ఉంచటం ఒకింత కొత్త సొబగు కనిపించింది. వినూత్న ఐటీ ఉత్పత్తులను రూపొందించిన కొత్త కంపెనీలు, విద్యార్థులకు సదస్సులో బహుమతులు అందచేత కొంచెం గుర్తింపునిచ్చే ఊరట. సరే, ఇక్కడ యవతరం తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే. ఐటి రంగంలో దూసుకుపోవాలంటే ప్రత్యేక నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకోవాలి. కమ్యూనికేషన్, కోడింగ్‌లో స్కిల్స్ పెంచుకోవాలి. సదస్సులో దాదాపు 5వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నా, -‘ఐటి’ రంగంలో ఉపాధి అవకాశాలు ఏమిటి? ఎలా వాటిని పొందొచ్చు? క్యాంపస్ ఇంటర్వ్యూలు? వాటిని ఎలా సాధించాలి? -వంటి అంశాలపై ప్రశ్నల పరంపరకు సంస్థల నుంచి సరైన సమాధానాలు లభించకపోవడం నిరాశకు గురి చేసింది. సదస్సు పెట్టుబడుల గురించే కానీ, ఉపాధి గురించి కాదని ముందే అర్థం చేసుకున్న వాళ్లు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సదస్సులో నిర్ణయించినట్టు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లోనూ ఐటి సదస్సులు నిర్వహిస్తే, విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. ఈ విషయంపై యువతరం కూడా శ్రద్ద తీసుకుని -ఫేస్‌బుక్‌లాంటి సైట్లలో చర్చిస్తే, తప్పక ఫలితం ఉంటుంది.
1 comments:
Great post thankks
Post a Comment