Thursday

సౌర తుపాను...!

భూమిని తాకుతున్న రేడియేషన్! పవర్‌గ్రిడ్‌లు, వ్యోమగాములు, ఉపగ్రహాలపై ప్రభావం



సూర్యుడిలో సంభవించిన అతిపెద్ద సౌర తుపాను కారణంగా విడుదలయ్యే రేడియేషన్ భూమిని వేగంగా తాకనున్నదని కొలారాడోలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రం తెలియజేసింది. ఈ సౌర అగ్నికీలలు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆకస్మికంగా ఏర్పడ్డాయని, వీటివల్ల భూమిపై మూడు రకాల ప్రభావాలను మూడు వేర్వేరు సమయాల్లో కలుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సౌరతుపాను కారణంగా ఏర్పడిన అగ్నికీలలనుంచి వెలువడుతున్న తీవ్రస్థాయి రేడియేషన్ ప్రభావం ముఖ్యంగా ఉపగ్రహాలపై, అంతరిక్షంలో పనిచేస్తున్న వ్యోమగాములపై తీవ్రస్థాయిలో ఉంటుందని అంతరిక్ష వాతావరణ పరిశోధనా కేంద్రంలోని భౌతికశాస్తవ్రేత్త డౌగ్ బీసెకర్ వివరించారు. ఈ విధంగా రేడియేషన్ భూమిని తాకడం భారత కాలమానం ప్రకారం గురువారం వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. 2005 నుంచి ఇప్పటి వరకు ఇంతపెద్ద ఎత్తున రేడియేషన్ వెలువడలేదు. ఇది గంటకు 93 మిలియన్ మైళ్ళవేగంతో భూమివైపుకు ప్రయాణిస్తోంది. భూమి, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న మొత్తం ప్రదేశం ప్రోటాన్లతో నిండివున్నందువల్ల ఈ రేడియేషన్‌ను ఎంతమాత్రం తప్పించుకోవడం సాధ్యం కాదని శాస్తవ్రేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న ఆరుగురు వ్యోమగాములకు ఈ రేడియేషన్ నుంచి ఎటువంటి రక్షణ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రేడియేషన్ మూడు రకాలుగా ఉంటున్నది. మొదటిది విద్యుదయస్కాంత రేడియేషన్ కాగా రెండవది ప్రోటాన్‌లతో ఏర్పడినది. ఇక మూడవదైన సూర్యుడి కరోనా ద్రవ్యరాశి నుంచి వెలువడుతున్న రేడియేషన్ తీవ్రత అత్యధికమని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భూమిపై విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతినే అవకాశముంది. 1989లో వెలువడిన ఇదేమాదిరి సౌర రేడియేషన్ ఉత్తరార్థగోళంలోని కాంతిపుంజాలను, దక్షిణార్థగోళంవైపుకు లాగేసింది. ఈసారి సౌరతుపాను తీవ్రత భూమి ఉత్తర భాగం వైపునకు పయనించే అవకాశమున్నది. గత అక్టోబర్‌లో సంభవించిన సౌర తుపానుకారణంగా భూమి దక్షిణ భాగం వైపున అరోరా (కాంతిపుంజాలు) కనిపించాయి. బుధవారం సాయంత్రం కూడా ఇటువంటి కాంతిపుంజాలను చూడగలుగుతామని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

0 comments:

Post a Comment