Thursday

రాణి పాలనకు అరవై ఏళ్లు


‘ఈ రోజు మీ ముందర నా మనసులోని మాటనే ప్రకటిస్తున్నా. ఇక నుండీ నా జీవితాన్ని మీ సేవకే అంకితం చేస్తున్నా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నా రాచ కుటుంబ సేవలోనే తరిస్తానని విన్నవించుకుంటున్నా...’ ఈ మాటలను ఓ 21 ఏళ్ల రాకుమారి 1947లో అన్నపుడు అందరూ వింతగా చూశారు. ఆశ్చర్యంగా విన్నారు. కొంతమంది అమ్మలక్కల మాటలు అని కొట్టిపారేశారు. ఇంకొందరు ఆ అమ్మాయి సంకల్పానికి అభినందనలు తెలిపారు.. ఆ రాకుమారి ఈ ప్రకటన చేసింది తన ప్యాలెస్‌లో కాదు.. పార్లమెంట్‌లో అంతకన్నా కాదు.. అడవులు, ఆదిమ జాతులు, అనాది జీవితం నిండి ఉన్న ఆఫ్రికాలో ఆమె ఈ మాటలు అంది. విదేశాలలో ఆమె చేస్తున్న తొలి పర్యటన అది. ఆ పర్యటనలో ఆమె అక్కడి ప్రజలను, వారి సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. వారితో సంభాషించింది.. అప్పటి వరకూ రాచరిక మర్యాదలు, వైభోగాలనే చూసిన ఆమె ఎంతోమంది పీడిత ప్రజలకు ఏదో చేయాలని సంకల్పించింది. ఆ సంకల్పమే ఆమెని చివరికి ఒకనాటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి మహారాణిని చేసింది. 60 ఏళ్లుగా బ్రిటిష్ సింహాసనానికి మహారాజ్ఞిగా అతి సుదీర్ఘ కాలం ఆ హోదాను నిర్వహించగలిగేలా చేసింది. ఆమే క్వీన్ ఎలిజబెత్! బ్రిటిష్ రాజరికానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, అధికారిక సంప్రదాయ వాదానికి, సమకాలీన ఆధునికతకీ సంధాన వారధిలా నిలిచిన రాణి - క్వీన్ ఎలిజబెత్! జననం - బాల్యం బ్రిటిష్ రాజ దంపతులు ప్రిన్స్ ఆల్బర్ట్ - ఎలిజబెత్‌లకు తొలి సంతానంగా జన్మించిన రాకుమారి ఎలిజబెత్. ఆమె పూర్తి పేరు - ‘ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ’! ఆమె 1926 సంవత్సరం ఏప్రిల్ 21న లండన్‌లోని మేఫేయర్ ప్రాంతంలోని మాతామహుల ఇంట్లో జన్మించింది. చిన్నారి ఎలిజబెత్ రాచకుటుంబంలో అందరూ అల్లారు ముద్దుగా చూసుకుంటూ ‘లిలిబెట్’ అని ముద్దు పేరుతో పిలుస్తూ ఉండేవారు. ఎలిజబెత్ జన్మించిన నాలుగేళ్లకి అంటే 1930లో రాజ దంపతులకు మరో కూతురు జన్మించింది. ఆమె పేరు ప్రినె్సస్ మార్గరెట్. కానీ అటు తండ్రి తరఫు వంశీకులకి, ఇటు తల్లి వైపు వంశీకులందరికీ ఎలిజబెత్ అంటే ఎంతో గారాబం ఉండేది. చిన్నపుడు ఎలిజబెత్ ఎప్పుడూ గుర్రాలతో ఆడుకుంటూ ఉండేదిట. కుక్కలంటే వల్లమాలిన అభిమానం చూపించేది. అంతేగాక, ఎంతో క్రమశిక్షణగా, ఎంతో బాధ్యతగా పనులను చక్కబెట్టేదట. యువరాణిగా.. అయితే బ్రిటిష్ సింహాసనానికి వారసులుగా రాజదంపతులకి కొడుకులెవరూ లేనందువల్ల పెద్ద కూతురైన ఎలిజబెత్‌ని యువరాణిగా పరిగణించేవారు. కానీ యువరాణిగా అధికారిక ప్రకటన మాత్రం ఆమెకు ఎంతో నాటకీయంగా జరిగింది. 1936లో అప్పటి బ్రిటిష్ చక్రవర్తి అయిన ఐదవ జార్జ్ అకాల మరణం చెందాడు. ఆయన ఎలిజబెత్‌కు స్వయానా తాత. దాంతో జార్జ్ కుమారుడైన ఎడ్వర్ట్‌ని చక్రవర్తిగా ప్రకటించారు. కానీ ఆయన ‘వాలిస్ సింప్సన్’ అనే విడాకులు పొందిన మహిళతో ప్రేమలో పడ్డాడు. అప్పటి రాజ్యాంగ నియమాలు, రాజ అంతఃపుర చట్టాల ప్రకారం ఈ తరహా ప్రేమ ఎంతో వ్యతిరేకం. దాంతో బ్రిటిష్ చక్రవర్తికి, బ్రిటిష్ సామ్రాజ్య సంప్రదాయానికీ, మధ్య రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. కానీ ఎడ్వర్డ్ మాత్రం తన ప్రేమను త్యాగం చేయదల్చుకోలేదు. తత్ఫలితంగా అనివార్యంగా ఎడ్వర్డ్ చక్రవర్తి తన సింహాసనాన్ని, పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అలా కింగ్ ఎడ్వర్డ్ ప్రేమ కోసం, ప్రేయసి కోసం రాజ్యాన్ని, రాజ సింహాసనాన్ని తృణప్రాయంగా త్యజించిన ఏకైక బ్రిటిష్ చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. దాంతో ఎలిజబెత్ తండ్రి అయిన ఆల్బర్ట్ బ్రిటిష్ చక్రవర్తి అయ్యారు. దాంతోపాటే పెద్దకూతురైన ఎలిజబెత్ ‘యువరాణి’గా వారసురాలిగా ప్రకటించబడింది. యుద్ధ మహిళా సైనికురాలిగా... బ్రిటన్ రాజకీయ చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం ఓ పెద్ద కుదుపు. ఆ మాటకొస్తే యావత్ ప్రపంచంలోనే ఈ ప్రపంచ యుద్ధం ఎంతో అలజడిని సృష్టించింది. 1939లో మొదలై 1945 వరకూ ఆరేళ్లపాటు జరిగిన ఈ యుద్ధం ఆ తర్వాత కొత్త ప్రపంచాన్ని, స్వాతంత్య్ర వాయువులను, ప్రజాస్వామ్య భావనకు పట్టం కట్టిన నవతరం ప్రపంచాన్ని ఆవిష్కరించింది. అయితే 1939లో యుద్ధం ఆరంభమైన తొలి నాళ్లనాటికి ఎలిజబెత్ వయసు 13 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో లండన్ నగరంపై శత్రు దేశాల దాడులు తీవ్రంగా ఉండేవి. అందుకని లండన్ నగరం నుండి బాలబాలికలందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించాలని ప్రయత్నించారు. కానీ యువరాణులు ఇద్దరూ లిండ్సర్ కోటలోనే ఉండటానికి ఇష్టపడ్డారు. ఆ సమయంలో ఎలిజబెత్ - మార్గరెట్ ఇద్దరూ అంతఃపురంలో మైమ్ కళను ప్రదర్శించేవారు. అప్పటి కులీన వర్గ ప్రజలు సందర్శించే ఈ ఉత్సవాల ద్వారా సమీకరించిన ధనాన్ని యుద్ధ సైనికులకు దుస్తులు అందించడానికి ఉపయోగించేవారు. అలా బాల ఎలిజబెత్‌కు చిన్ననాటి నుండి రాజరిక సంప్రదాయాలతోపాటు, అనుచరుల కోసం నాయకుడు చూపించాల్సిన ఔదార్యం, జీవన విలువలు అర్థమయ్యాయి. ఎలిజబెత్‌కు వాక్చాతుర్యం ఎక్కువ. చొరవ కూడా ఎక్కువే. సామాజిక కళా కార్యక్రమాలలో ఆమె ఎంతో ఉత్సాహంగా పాల్గొనేది. అలా ఆమె తన 14వ ఏట 1940లో తొలిసారిగా బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ రేడియోలో మొదటిసారిగా ప్రసంగించింది. ‘చిల్డ్రన్ అవర్’ పేరిట వచ్చిన ఈ కార్యక్రమంలో, లండన్ నగరం నుంచి తరలివెళ్తున్న బాలబాలికలకు ధైర్యాన్ని నూరిపోసింది. ఆ తర్వాత 1942లో ఎలిజబెత్ రాయల్ బ్రిటిష్ ఆర్మీలో ‘కల్నల్ ఇన్ చీఫ్’గా నియమితురాలయింది. అపుడు ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అదే ఊపులో ఆమె 1945 ఫిబ్రవరిలో మహిళా సైనిక దళంలో చేరింది. అక్కడ ఆమె యుద్ధ వాహనాల డ్రైవర్‌గా, మెకానిక్‌గా శిక్షణను పొంది రెండో ప్రపంచ యుద్ధం ముగిసేంతవరకూ సేవలు చేసింది. ఈ సమయంలోనే ఎలిజబెత్‌కు రాచరిక అంతఃపురానికి భిన్నమైన ప్రపంచంతో పరిచయం ఏర్పడింది. సామాన్య ప్రజల పట్ల సానుభూతిని పెంచింది. ఆ సహానుభూతి భావనే ఎలిజబెత్‌ను అజ్ఞాతంగా నగరంలో సంచరిస్తూ ప్రజాభిప్రాయాలను తెల్సుకొనేలా చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత జరిగిన విజయోత్సవ ర్యాలీలలో ఆమె అజ్ఞాతంగా పాల్గొంది. యుద్ధంపై, విధ్వంసంపై ప్రజల మనోగతాలను తెల్సుకుంది. వివాహం - పట్ట్భాషేకం గ్రీస్, డెన్మార్క్ ప్రాంతాలకు యువరాజు ప్రిన్స్ ఫిలిప్. ఆయన ఎలిజబెత్ వంశీకులకు దూరపు బంధువు. ఎలిజబెత్ మొదటిసారిగా ఫిలిప్‌ని తన 13వ ఏట ఓ ఉత్సవంలో కలిసింది. అప్పట్నించీ ఆమె ఫిలిప్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను నడుపుతూ తన ప్రేమని తెలిపింది. దాంతో ఇరు కుటుంబాలు ఫిలిప్ - ఎలిజబెత్‌ల ప్రేమను అంగీకరించి 1947 జూలై 9న నిశ్చితార్థం నిర్వహించారు. ఆ తర్వాత అదే సంవత్సరం నవంబర్ 20న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ చక్రవర్తి ఆరవ జార్జి 1951లో ఆకస్మికంగా మరణించాడు. ఆ స్థానంలో అప్పుడు ప్రినె్సస్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్‌గా రాజ్యాన్ని అధిష్ఠించింది. ఆమెకు ఈ పట్ట్భాషేక మహోత్సవం 1953 సంవత్సరం జూన్ 2వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. అప్పట్నించీ ఇప్పటివరకూ క్వీన్ ఎలిజబెత్ బ్రిటిష్ మహారాణిగా అత్యధిక కాలం నిర్వహించిన చక్రవర్తిణిగా రికార్డు సృష్టించింది. గతంలో క్వీన్ విక్టోరియా 60 ఏళ్లకుపైగా రాణిగా కొనసాగింది. ఎలిజబెత్ యుగం బ్రిటిష్ సంప్రదాయ చరిత్రలో రాజులు - రాణుల పాలనా కాలాలను అనుసరించి అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్య అంశాలను విశే్లషించడం పరిపాటి. ఆ దోవలో 1953 నుండీ ‘ఎలిజబెత్ యుగం’ ఆరంభమయింది. ఈ 60 ఏళ్ల కాలంలో బ్రిటన్‌లోనే కాక, యావత్ ప్రపంచంలో కూడా ఎనె్నన్నో అనూహ్య పరిణామాలు సంభవించాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ, కాలగమనంతోపాటు పయనిస్తూ క్వీన్ ఎలిజబెత్ పాలనలో తనదైన ముద్రని వేసింది. కాలంతో, తరాలతోపాటు వస్తున్న, వచ్చిన మార్పులను ఆహ్వానిస్తూనే, వాటికి అనుగుణంగా తనని తను మలచుకుంటూనే, ప్రాచీన రాజరిక నియమాలను, సంప్రదాయాలను, సంస్కృతిని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే 20వ శతాబ్దంలో వెల్లువెత్తిన ప్రజాస్వామ్య ఉద్యమాలు, పార్లమెంటరీ విధానాలు ఎన్ని వచ్చినా బ్రిటన్‌లో రాజరిక విధానాన్ని మాత్రం తొలగించలేక పోయాయి. ఆధునిక కాలంలో రాజరిక వ్యవస్థ కానీ, ఎలిజబెత్ తరహా రాయల్ పాలన కానీ అంతగా ప్రాధాన్యత లేకుండా కేవలం నామమాత్రపు స్థాయినే పొందింది. మధ్యయుగాలలో, 15వ శతాబ్ది ప్రాంతాలలో ఉన్నంతటి బలమైన, నిరపేక్షమైన రాజరికాలు ఇపుడు కాలం చెల్లినప్పటికీ, ఓ మహోన్నత సంస్కృతికి వారసురాలిగా, వారధిగా రాజరికాన్ని ఆధునీకరించడంలో, రాజరిక ఆధిపత్యాన్ని ప్రజాస్వామ్యానికి కట్టుబడేలా ‘ఉదారీకరించడం’లో క్వీన్ ఎలిజబెత్ ఎంతో కీలకపాత్ర వహించింది. ప్రజాభిప్రాయానికే పట్టం గట్టిన అధునాతన రాణిగా ప్రశంసలు సాధించింది. మరోవైపున, ప్రపంచ స్థాయిలో బ్రిటన్ ప్రాభవ వైభవాలు 1945 తర్వాత చాలావరకు తగ్గుముఖం పట్టాయి. బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న ఎనె్నన్నో ఆసియా - ఆఫ్రికా- లాటిన్ అమెరికా దేశాలు బ్రిటిష్ పాలన నుండి బైటపడి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. దాంతో అంతర్జాతీయ వేదికపై బ్రిటన్ పాత్రే పరిమితం అయిపోయింది. ఈ సమయంలో బ్రిటన్ వైభవాన్ని అంతర్జాతీయంగా తిరిగి స్థాపించడానికి విదేశీ పర్యటన లను విస్తృతంగా చేసి ఆయా దేశాల ప్రజలచే బ్రిటిష్ రాణి పట్ల విధేయతను పునః ప్రతిష్ఠించగలిగింది. అలా క్వీన్ ఎలిజబెత్ చాకచక్యం వల్లే ఇపుడు దాదాపు 10కిపైగా దేశాలకు కూడా ఆమే అధికారిక రాణిగా కొనసాగుతోంది. ఇక కామనె్వల్త్ దేశాలకు గౌరవ రాణిగా ప్రత్యేక ప్రతిపత్తిని సాధించింది. సవాళ్లు - సమస్యలు క్వీన్ ఎలిజబెత్ రాణిగా కొనసాగుతున్న ఈ ఆరు దశాబ్దాల కాలంలో అంతర్గతంగా, అంతర్జాతీయంగా, అంతఃపుర పరంగా వచ్చిన ఎనె్నన్నో సవాళ్లను, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంది. 1957లో సంభవించిన సూయెజ్ కెనాల్ సంక్షోభాన్ని దౌత్యపరమైన ప్రతిపాదనలతో సమసిపోయేలా చేసింది క్వీన్ ఎలిజబెత్. అలాగే ’60 ’70 దశకాలు బ్రిటిష్ వలస రాజ్యాల పరంగా గొప్ప దెబ్బను తీసాయని చెప్పాలి. ఈ కాలంలో ఆఫ్రికా, కరీబియా ప్రాంతంలోని చాలా దేశాలు బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. అలా దాదాపు 20 దేశాలు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి అయ్యాయి. ఆ మేరకు ఇది బ్రిటిష్ ఆర్థిక - రాజకీయ ఆధిపత్యానికి కోలుకోలేని శరాఘాతమే కానీ వెల్లువెల్లుతున్న ప్రజా ఉద్యమాలనూ, ప్రజా వాంఛలను గౌరవించి హుందాగా తప్పుకోవడానికి బ్రిటిష్ పార్లమెంట్‌కి తగిన సలహాలను ఇచ్చింది రాణియే! 1975లో ఆస్ట్రేలియాలో గవర్నర్ జనరల్ ప్రధాని గోఫ్ విట్‌లామ్‌ను డిస్మిస్ చేశారు. ఆ సందర్భంలో అక్కడ ఏర్పడిన రాజ్యాంగ ప్రతిష్ఠంభనని తన చొరవతో తొలగించి ఆస్ట్రేలియాలో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా క్వీన్ ఎలిజబెత్‌దే.. మరోవైపున 1980లో కెనడాలో బ్రిటిష్ రాణి ఆధిపత్యాన్ని మొత్తం తొలగిస్తూ ‘బిల్ సి-60’ చట్టాన్ని తెచ్చారు. కానీ అక్కడి ప్రజలు, మెజారిటీ పార్లమెంటేరియన్‌లు ఆ చట్టాన్ని వీగిపోయేలా చేసి, తమకు బ్రిటిష్ రాణి ఆధిపత్యం కావాలని తెగేసి చెప్పారు. ఇలా చట్ట సభలలో సైతం బ్రిటిష్ దేశానికి మరో దేశం నుండి గౌరవం ఏర్పడటానికి దోహదం చేసిన కారకాలలో క్వీన్ ఎలిజబెత్ హుందాతనం, దౌత్యనీతే కారణం. 1982లో బ్రిటిష్ ఫాక్‌లాండ్ దీవుల ఆక్రమణ - ప్రతిదాడుల సందర్భంలో క్వీన్ ఎలిజబెత్ తన కొడుకు ప్రిన్స్ ఆండ్రూను సైనిక దళంలోకి పంపి దేశ ఆస్తుల పరిరక్షణకు తను, తన కుటుంబం ఎప్పుడూ ముందుంటామని చెప్పకనే చెప్పింది. 1991లో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ‘గల్ఫ్‌వార్’ సమయంలో బ్రిటన్ దేశ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడటంలో ఐక్యరాజ్యసమితికి తగిన నివేదికలు సమర్పించడంలో క్వీన్ ఎలిజబెత్ క్రియాశీలక పాత్ర నిర్వహించింది. వ్యక్తిగత జీవితం - వివాదాలు మహారాణిగా ఎలిజబెత్‌కు ఎన్ని అర్హతలు, నైపుణ్యాలు ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె కుటుంబ జీవితం, ఆమె అంతఃపుర అంతరంగ జీవితం చాలాసార్లు వివాదగ్రస్తమై మీడియాలో పతాక శీర్షికల కెక్కింది. అయితే ఆమె అన్ని సవాళ్లను ఎంతో కూల్‌గా, కామ్‌గా ఎదుర్కొని విమర్శలకు వౌనంగానే సమాధానం చెప్పింది. క్వీన్ ఎలిజబెత్ జీవితంలో అత్యంత ‘దయనీయమైన సంవత్సరం’ 1992ను చెప్పాలి. ఈ సంవత్సరంలో ఆమె వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎనె్నన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. 1992, మార్చిలో ఆమె రెండో కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ - కోడలు సారా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇది బ్రిటిష్ రాజరిక చరిత్రలోనే ఓ సంచలనం అయింది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ఆమె కూతురు యానె తన భర్త మార్క్ ఫిలిప్స్ నుంచి విడాకులు తీసుకుంది. నవంబర్ మాసంలో క్వీన్ ఉంటున్న నివాస భవనం ‘మిడ్సర్ క్యాజిల్’ అగ్నిప్రమాదానికి గురైంది. మరోవైపున అప్పటి బ్రిటిష్ ప్రధాని తన ఆర్థిక సంస్కరణలలో భాగంగా బ్రిటిష్ రాణి కూడా ఆదాయ, ఆస్తిపన్ను కట్టాలని చట్టాలను సవరించారు. దాంతో బ్రిటిష్ రాజ చరిత్రలో మొదటిసారిగా క్వీన్ ఎలిజబెత్ ‘ఆదాయపన్ను’ను కట్టారు. 1992 డిసెంబర్‌లో క్వీన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ ఆయన భార్య ప్రినె్సస్ డయానా విడిపోవడానికి నిశ్చయించుకున్నారు. 1995 డిసెంబర్‌లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం ఆగస్టు 31న ప్రినె్సస్ డయానా కారు యాక్సిడెంట్‌లో మరణించడం, డయానా జీవితం చుట్టూ, అంతఃపుర అంతర్గత విషయాల చుట్టూ ప్రెస్, మీడియా ఆసక్తికర కథనాలతో రాజవంశ పరువును పబ్లిక్‌లో నిలబెట్టింది. వీటన్నింటికీ తోడు పెరుగుతున్న వయసు, 2003లో మోకాళ్లకు ఆమె చేసుకున్న సర్జరీ వంటివి ఆమె ఆరోగ్యానే్న కాక, ఆలోచనలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసాయి. అయితే ఏ సందర్భంలోనూ ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా నిలబడింది. డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఎనె్నన్నో ఒడిదుడుకులు, మరెన్నో వివాదాలు, ఇంకెన్నో మిస్టరీల మధ్య క్వీన్ ఎలిజబెత్ 60 ఏళ్ల పట్ట్భాషేక ఉత్సవాలను జరుపుకుంది. గతంలో 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను 1977లో, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను 2002లో వైభవోపేతంగా బ్రిటన్ అంతటా నిర్వహించారు. ఈ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను బ్రిటన్‌లోనేకాక, ఒకప్పటి బ్రిటన్ పాలిత ప్రాంతాలలో సైతం కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రభుత్వాలు ప్రజలు నిర్వహించారు. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలకు, సజీవ ప్రతీకలా ఉన్న క్వీన్ ఎలిజబెత్‌ను, బ్రిటిష్ రాజరికాన్ని పదికాలాలపాటు కొనసాగించాలనే సంకల్పాన్ని ప్రజలు ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నాయి. మారుతున్న కాలానికి, ప్రజావసరాలకు అనుగుణంగా పాలనని, వ్యవస్థనీ, దృక్పథాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తున్న ఎలిజబెత్ దూరదృష్టి, సంయమన వైఖరి, ప్రజాభిప్రాయం పట్ల ఆమెకున్న గౌరవం వల్లే రాజరికం ఇంకా కొనసాగుతోందని చెప్పాలి. అందుకే బ్రిటిష్ రాణి ఇపుడు ఓ ‘నడిచే సాంస్కృతిక అవశేషం’గా, ఓ ‘సజీవ సంస్కృతీ వారసత్వం’గా ఆమోదాన్ని పొంది ముందుకెళుతోంది. మొన్నటి డైమండ్ జూబ్లీ ఉత్సవాలలో క్వీన్ ఎలిజబెత్ చెప్పిన ప్రసంగ అంశాలే ఆమె హృదయానికి అద్దం పడతాయి. ‘మీ సేవకు నేను ఈ సందర్భంగా మళ్లీ పునరంకితం అవుతున్నా. ఈ క్షణాన మనమందరం సంఘటితంగా కలసికట్టుగా ఉండటంలోని శక్తిని గుర్తిస్తారని ఆశిస్తాను. నా పాలనా కాలమంతా నేను గొప్ప కుటుంబ విలువలని, స్నేహ బంధాలని, సుహృద్భావ పూరిత పొరుగు దేశాలని చూడగలిగాను. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లడమే మన ప్రధాన కర్తవ్యం కావాలని నేను విన్నవించుకుంటున్నాను.’ ఇంతటి వినయ సంపన్నతే క్వీన్ ఎలిజబెత్‌ని కోట్లాది ప్రజల గుండెల్లో మహారాణిగా నిలిపిందేమో! .............. క్వీన్ ఎలిజబెత్ - విశేషాలు * 1926 ఏప్రిల్ 21న జననం * క్వీన్‌కు మొత్తం నలుగురు సంతానం. వారిలో ఛార్లెస్, ఆండ్రూ, ఎడ్వర్డ్ అబ్బాయిలు. యానె కూతురు. * పట్ట్భాషేకం జరిగింది 1953 జూన్ 2 * క్వీన్ దాదాపు 600పైగా అంతర్జాతీయ, జాతీయ సంస్థలకు పాట్రన్ * ఖాళీ సమయాల్లో గుర్రపు స్వారీ ఆమె హాబీ * కుక్కల పెంపకంపై మక్కువ * ’50 దశకంలో ఆమెను జానపద యువరాణి ‘ఫెయిరీటేల్ క్వీన్’ అని పిలిచేవారు. * ఆమె కాలంలో బ్రిటిష్ దేశ ప్రగతిని ‘న్యూ ఎలిజబెత్ యుగం’గా చరిత్రకారులు అభివర్ణించారు. * 2010 నాటికి క్వీన్ ఆస్తుల విలువ 450 మిలియన్ అమెరికన్ డాలర్లు అని ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది * ఆభరణాలు, ఆయుధాలు, ప్రాచీన కళాఖండాలతో కూడిన అరుదైన వస్తువుల ‘రాయల్ కలెక్షన్’ ఆమె సొంతం * బకింగ్ హామ్ ప్యాలెస్, విండ్సర్ క్యాజిల్‌లు ఆమె అధీనంలోనివే. * 1952 ఫిబ్రవరి నుంచి క్వీన్ ‘కామనె్వల్త్ దేశాల అధినేత’గా గుర్తింపు పొందింది * బ్రిటిష్ సింహాసనాన్ని అతి దీర్ఘకాలంపాటు పాలించిన రెండో రాణి క్వీన్ ఎలిజబెత్. క్వీన్ విక్టోరియా 63 ఏళ్లపాటు పాలించింది. ..................... *

0 comments:

Post a Comment