- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు రాష్ట్రంలో ఎక్కువ
- పరిష్కారమైంది 13 శాతమే
- సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు
- కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ వెల్లడి
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో దళితులు,ఆదివాసులపై అత్యాచార కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ముకుల్ వాస్నిక్ తెలిపారు. నమోదవుతున్న వాటిలో 13 శాతం కేసులు మాత్రమే పరిష్కారమవుతున్నాయని, మిగతా కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయని చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ప్రతి నెల జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో మానవ హక్కుల పరిరక్షణ, అత్యాచార నియంత్రణ చట్టం అమలు తీరుపై ముఖ్యమంత్రి, మంత్రులు, డిజిపి, అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం వాస్నిక్ విలేకరులతో మాట్లాడారు. అత్యాచార కేసుల నియంత్రణ కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి ఏడాదికోసారి సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా న్యాయమూర్తి సమక్షంలో కేసులను సమీక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లక్షింపేటలో జరిగిన వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
2010లో జాతీయ స్థాయిలో 38,448 అత్యాచార కేసులు నమోదు కాగా 31 శాతం కేసులలో మాత్రమే శిక్షపడిందని తెలిపారు. మిగతా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. రాజస్థాన్‌లో 6,298, ఉత్తరప్రదేశ్‌లో 6,272, ఆంధ్రప్రదేశ్‌లో 5,074 అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలిపారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 70 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు రాష్ట్రాలను తప్పిస్తే దేశంలోనే అత్యధిక సంఖ్య ఆంధ్ర ప్రదేశ్‌దని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో అవసరమైన మార్పులు చేయడం కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొన్ని ప్రతిపాదనలు పంపించామన్నారు. వారి నుండి సమాధానాలు వచ్చిన తరువాత లోతైన చర్చ జరిపి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మార్పులు చేస్తామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇతర కులాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు, సమున్నత ప్రమాణాలు కల్గిన సాంఘిక హోదా కల్పించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. విద్య, ఇరిగేషన్ వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా సమాజంలో వారి హోదా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లను వ్యక్తులతో శుభ్రం చేయిస్తే వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేస్తామన్నారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఐఐటి లాంటి జాతీయ విద్యా సంస్థలలో ప్రవేశం పొందడం అభినందనీయమన్నారు. దీని ద్వారా ఎస్సీలకు, ఇతర కులస్తులకు మధ్య ఉన్న వత్యాసం తొలగిపోతుందని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నెపోలియన్, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, డిజిపి దినేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment