Friday

4,800 కొత్త వార్తాపత్రికల రిజిస్ట్రేషన్


 గత ఆర్థిక సంవత్సరం (2010-11)లో దేశంలో కొత్తగా 4,853 వార్తా పత్రికల రిజిస్ట్రేషన్ జరిగిందని రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది. ఈ లెక్కన, రిజిస్టరైన ప్రచురణల్లో 6.25 శాతం పెరుగుదల చోటుచేసుకొందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో వార్తా పత్రికల ప్రచురణలో తెలుగు (603 పత్రికలతో) ఐదో స్థానంలో ఉంది. కొత్త వాటితో కలిపి ఇంతవరకు 82,237 వార్తా పత్రికలు రిజిస్టరయ్యాయని తెలిపింది.

'ప్రెస్ ఇన్ ఇండియా (భారత దేశంలో పత్రికలు)-2010-11' పేరుతో ఆర్ఎన్ఐ విడుదల చేసిన ఈ 55వ వార్షిక నివేదికను ఆర్ఎన్ఐ ప్రెస్ రిజిస్ట్రార్ టి. జయరాజ్, కేంద్ర సమాచార ప్రసార శాఖల కార్యదర్శి ఉదయ్ కుమార్ వర్మకు అంద జేశారని సంబంధిత అధికారులు గురువారం ఇక్కడ తెలిపారు. దేశంలో అన్ని భాషలతో పోలిస్తే హిందీలోనే అత్యధికంగా.. 32,793 (దిన, వార, పక్ష) వార్తా పత్రికలు రిజిస్టరై ఉన్నాయి. 11,478 పత్రికలతో ఇంగ్లీషు ద్వితీయ స్థానంలో ఉంది. సర్క్యులేషన్ విషయానికి వస్తే.. 15,54,94,770 ప్రతులతో హిందీ, 5,53,70,184 కాపీలతో ఇంగ్లీషు, 2,16,39,230 ప్రతులతో ఉర్దూ పత్రికలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించాయి.

దేశంలోని అన్ని వార్తా పత్రికలకూ కలిపి 32,92,04,841 కాపీల సర్క్యులేషన్ ఉందని, ఇది 2009-10లో 30,88,16,563గా ఉందని నివేదిక పేర్కొంది. ఆయా పత్రికల నుంచి అందుకొన్న వార్షిక నివేదికల ప్రకారం.. దేశంలో హెచ్చు సంఖ్యలో వార్తా పత్రికలను ప్రచురించే రికార్డును కూడా హిందీ భాష సొంతం చేసుకొంది. హిందీ(7,910), ఇంగ్లీషు(1,406), ఉర్దూ(938), గుజరాతీ(761), తెలుగు(603) వార్తా పత్రికల ప్రచురణతో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

0 comments:

Post a Comment