Sunday

పాటల పల్లకి

‘‘మొదటిసారి చంద్రుడి మీద పాదం మోపిన వారికే పేరొస్తుంది, రెండోవారిని పట్టించుకోరు,’’ అని బాధపడ్డారు ఆశాభోంస్లే. బాలీవుడ్ అనే నిండు చందమామ మీద మంగేష్కర్ కుటుంబం నుంచి తొలిగా అడుగిడిన లతా మంగేష్కర్‌కే ఉన్న పేరంతా వచ్చేసిందని ఆశా ఆవేదన. లతా లతాయే కావొచ్చుగాక. కానీ, ఆశా ఆశాయే. జాబిల్లి మీదకు మనం వెళ్లడం ఏమిటి? వెన్నెల్ని మన నట్టింట్లోనే విరగగాయించగల గొంతు. వైజయంతిమాల నుంచి జీనత్ అమన్ మీదుగా ఊర్మిళా మటోండ్కర్‌ను దాటుకొని కరీనా కపూర్ దాకా ఎన్ని తరాలు మారినా కౌమారం దాటని గళం. ఫిలిం, పాప్, గజల్, ఖవ్వాలి, భజన, జానపదం, శాస్త్రీయ గీతాలు; సాంఘిక, పౌరాణిక, యాక్షన్, రొమాంటిక్, కుటుంబగాథ చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజీషోలతో ఆరు దశాబ్దాలుగా ప్రవహిస్తున్న స్వర నది. ఎనభైలోకి అడుగిడుతున్న సందర్భంగా ‘పద్మవిభూషణ్’ ‘‘ఆశాభోంస్లే అంతరంగం.....


ప్రొఫైల్

పేరు : ఆశా భోంస్లే
జన్మదినం : సెప్టెంబర్ 8, 1933
జన్మస్థలం : సంగ్లీ (మహారాష్ట్ర)
తల్లిదండ్రులు : దీన్‌నాథ్ మంగేష్కర్, ‘మాయీ’ (వీరికి లత (మంగేష్కర్), 
మీనా, ఆశా(భోంస్లే), ఉష, హృదయనాథ్; ఐదుగురు సంతానం. 
అమ్మాయిలందరూ గాయనులే. హృదయనాథ్ సంగీత దర్శకుడు)
విశిష్టత : హిందీ, అస్సామీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, 
పంజాబీ, తమిళం, ఇంగ్లిష్, రష్యన్, నేపాలీ, 
మలయాళం వంటి 20 భాషల్లో 12,000 పైచిలుకు పాటలు పాడిన గాయని. 
తెలుగులో ‘జీవితం సప్తసాగర గీతం’ (చిన్నికృష్ణుడు), 
‘ఓ ప్రేమా’ (అశ్వమేధం) వంటివి పాడారు.
తొలిచిత్రం : మఝా బాల్ (1943-మరాఠీ)
తొలి హిందీ చిత్రం : చునరియా 1948; సుమారు 1000 బాలీవుడ్ సినిమాల్లో పాడారు.
తొలి భర్త : గణపత్‌రావ్ భోంస్లే (భోంస్లేతో 1960లో విడిపోయాక, 
సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ (1939-94)ను 1980లో వివాహమాడారు.
పిల్లలు మొదటి భర్తకు కలిగినవారు.)
పిల్లలు : హేమంత్ భోంస్లే (సంగీత దర్శకుడు, పైలట్), 
వర్షా భోంస్లే (జర్నలిస్టు), ఆనంద్ భోంస్లే (తల్లి వ్యవహారాలు మొత్తం చూసుకుంటారు,
‘ఏ హై ఆషా’ టీవీ ప్రోగ్రామ్‌కు దర్శకత్వం వహించారు.)
పురస్కారాలు : దాదాసాహెబ్ ఫాల్కే (2000), పద్మవిభూషణ్ (2008) 

నేను అందంగా ఉండను, కాబట్టి నటిని కాలేను. చదువుకోలేదు, కాబట్టి రచయిత్రిని కాలేను. నాకు తెలిసిందల్లా పాట. అదే నా బతుకుదెరువు. దాంతోనే నా జీవితాన్ని ఆరంభించాను. 

రక్తంలోనే ఉంది సంగీతం
మా నాన్న(దీన్‌నాథ్ మంగేష్కర్) సంగీతం కోసమే పుట్టిన మనిషి. చిన్నవయసులోనే సంగీతాన్ని అభ్యసించడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. సినిమా సంగీత దర్శకుడు కాకముందు, డ్రామా కంపెనీ నెలకొల్పారు. రెండు వందల మంది అందులో పనిచేసేవారు. అలా సంగీతం అనేది మా రక్తంలోనే ఉంది. అక్కలు లత, ఉష, చెల్లి మీనా, తమ్ముడు హృదయనాథ్; అందరం పాడేవాళ్లం. అంతమాత్రాన ఏదో లక్ష్యం లేదు, నేర్చుకోవడం కోసం నేర్చుకోవడమది. అందరు అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంతవరకే నా ఆలోచనలు. కానీ నాన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. నా తొమ్మిదేళ్లప్పుడే అకస్మాత్తుగా చనిపోయారు. దాంతో ఇంటిని నిలబెట్టుకోవడం కోసం అందరమూ పనిచేయాల్సి వచ్చింది. లత(మంగేష్కర్) దీదీ గాయని అయ్యింది. 

లతక్క ఆటబొమ్మను
అక్క నాకంటే నాలుగేళ్లు పెద్దది. నాకు మరో అమ్మవంటిది. ఎక్కడికైనా నన్ను వెంటపెట్టుకునే వెళ్లేది. ఆటబొమ్మలా ఎప్పుడూ తనకు అతుక్కునే ఉండేదాన్ని. ఒకసారి నన్ను ఎత్తుకొని మెట్లెక్కుతూ పడిపోయింది. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. తను స్కూలుకు వెళ్లినా నేను వెంట ఉండాల్సిందే. ఒకసారి టీచర్, ‘ఒక ఫీజు మీద ఇద్దరు రావడం కుదరదు,’ అన్నారు. అంతే, అక్క మళ్లీ జన్మలో స్కూలు ముఖం చూడలేదు.

అయితే, అక్క మెదడుతో ఆలోచిస్తుంది, నేను హృదయంతో. తను ఏ పరిస్థితుల్లోనైనా తొణక్కుండా ఉండగలదు, నేను ఆవేశం వస్తే ఆవేశపడాలనుకుంటాను. దాచుకోవడం కంటే బయటపడటమే నిజాయతీ అనిపిస్తుంది నాకు. నేనూ పది పన్నెండేళ్ల వయసులోనే మరాఠీ సినిమాల్లో పాడటం మొదలుపెట్టాను. ఇంటిని ఎలాగోలా నిలబెట్టగలుగుతున్నాం. అయితే, చాలా చిన్నవయసులోనే నా స్వభావానికి అనుగుణంగా నేను ప్రేమలో పడ్డాను.

బంధం ఛిన్నాభిన్నం
నాకంటే 15 ఏళ్లు పెద్దాయన్ని (గణపత్‌రావు భోంస్లే; లతా మంగేష్కర్ సెక్రటరీ) నేను పెళ్లి చేసుకున్నాను. నాకు 16, ఆయనకు 31. మా ప్రేమ అక్కకు ఇష్టం లేదు. దాంతో ఇంట్లోంచి పారిపోయాను. నా దారి నేను చూసుకున్నానని అక్కకు అప్పట్నుంచీ కోపం. అది అలాగే కొనసాగింది.

మా అత్తగారువాళ్లు ఛాందసులు. నేను సినిమాల్లో పాడటాన్ని ఇష్టపడలేదు. అలాగని ఆయన సంపాదన అంతంతమాత్రమే. వరుసగా పిల్లలు కలిగారు. వాళ్ల కోసమే ఛీత్కారాలు, నిరసనలు భరించాను. పైగా ఆయనకు అనుమానం ఎక్కువ. చిట్టచివరికి (1960 ప్రాంతంలో), మా చిన్నోడు ఆనంద్ కడుపులో ఉన్నప్పుడు ఇంట్లోంచి గెంటేసినంత పనిచేశారు. నేను మళ్లీ అమ్మ దగ్గరికో, అక్కచెల్లెళ్లు, తమ్ముడి దగ్గరకో వెళ్లొచ్చు. కానీ వాళ్లకు భారం కాకూడదు. అందుకే పాటే నాకు ప్రాణం అయ్యింది. ఒక్కసారి మైక్‌ముందు నిలబడితే అన్ని బాధలూ మరిచిపోయేదాన్ని.

తొలిరోజుల ఇబ్బందులు!
బాలీవుడ్‌ను నూర్జహాన్, షంషాద్ బేగమ్, గీతాదత్ లాంటి గాయనీమణులు ఏలుతున్నారు. అక్క కూడా పైస్థాయికి వెళ్లింది. కానీ నాకోసం ‘ఆ అమ్మాయికి ఈ పాట ఇవ్వండి,’ అని నిలబడగలిగినవాళ్లు ఎవరూ లేరు. పైగా, అక్క బాగా పాడుతుందా, చెల్లా? అని త్రాసులో తూచేవాళ్లు. డ్యూయెట్స్ వచ్చేవి కావు. బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు తప్ప నాకు గత్యంతరం లేదు. లేకపోతే పెద్దవాళ్లు పాడకుండా తిరస్కరించినవో, వ్యాంపు పాటలో నా దరిచేరేవి.

అక్క... పాటల్లో శిఖరం. తనలా నేను పాడలేను. అలాగని తను కూడా కొన్ని నాలా పాడలేదు. అక్క లాంటి గొంతు ఒకటి ఉన్నాక, ఎవరూ ప్రత్యామ్నాయం ఆలోచించరు. తనకు నేను చెల్లెలు అయినందువల్ల ఎప్పుడూ రెండోస్థానంలోనే ఉండిపోయాను. ఒకవేళ నేను మంగేష్కర్ కుటుంబం నుంచి కాకుండా ఇంకెక్కడినుంచైనా వచ్చివుంటే సమాన హోదా వచ్చేది. అయినా, అసలు ఆమెలా నేనెందుకుండాలి? నా దారి నాదే. నా స్టైల్ నాదే. అది ఏర్పరుచుకోగలిగాను కాబట్టే, నిలబడగలిగాను. పాడేటప్పుడు హెలెన్ ఎలా డ్యాన్స్ చేస్తుంది, ఎలా శరీరాన్ని కదిలిస్తుంది, ఇవన్నీ విజువలైజ్ చేసుకుంటాను. అప్పుడు తనకోసమే పాడినట్టుగా ఉంటుంది. అలాగే జీనత్ అమన్ కోసం పాడేటప్పుడు ఫ్లాట్‌గా పాడితే లాభం లేదు. తన సెక్స్ అప్పీల్ మన గొంతులో పలకాలి, లేదంటే న్యాయం జరగదు.

దేవుడున్నాడు!
చిన్నాచితకా పాడుతున్న దశలో దర్శక నిర్మాత బీఆర్‌చోప్రా నాకు అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో దిలీప్ కుమార్-వైజయంతిమాల కాంబినేషన్లో వచ్చిన ‘నయా దౌర్’(1957; ఓపీ నయ్యర్ సంగీతం)తో నాకు బ్రేక్ వచ్చింది. ‘తీస్రీ మంజిల్’ (1966; ఆర్.డి.బర్మన్ సంగీతం)తో కెరీర్ మలుపు తిరిగింది. ‘ఉమ్రావ్ జాన్’(1981; ఖయ్యామ్ సంగీతం)తో ఉచ్ఛ స్థితికి వచ్చింది.

లో పిచ్‌లో పాడినప్పుడు నా పాట బాగుంటుందనేవారు నయ్యర్. దాని ప్రకారమే ఆయన కంపోజ్ చేశారు. అయితే, ఆర్.డి.బర్మన్ నేను అన్ని రకాలుగా పాడగలనని నిరూపించాడు. ఇంకా, మదన్‌మోహన్, సలీల్ చౌధురి, ఎస్.డి.బర్మన్... అందరితోనూ మంచి పాటలు వచ్చాయి. గాయకుడు కిశోర్ కుమార్ అప్పటికప్పుడు పాటను ఇంప్రూవ్ చేసేవారు. ఆయన చేసే మార్పులకు అనుగుణంగా నాదైన పద్ధతిలో నేను మెరుగుపరచడానికి సదా సిద్ధంగా ఉంటానని ఆయన భావించేవారు. అలా మా కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది.

ఇంకో అదృష్టం ఏమిటంటే, సినిమాలో నాకు ఒకే పాట అవకాశం వస్తే, ఆ పాటే హిట్ అయ్యేది. ‘ఝుంకా గిరా రె’ (మేరా సాయా-1966) హిట్. ‘పర్దే మే రెహనే దో’ (షికార్-1968) హిట్. ‘దమ్ మారో దమ్’ (హరే రామ హరే కృష్ణ-1971) హిట్. నాకు ఎవరూ సహకరించని సందర్భాల్లో దేవుడు నా వెంబడి ఉన్నాడనుకుంటాను.

ఎక్కడైనా స్టేజ్ మీద పాడినప్పుడైతే, ‘పియ తూ అబ్‌తో ఆజా’ (కార్వాన్- 1971), ‘చురాలియా హై తుమ్నే జో దిల్ కో’ (యాదోంకి బారాత్-1973), ‘మెహబూబా మెహబూబా’ (షోలే- 1975) లాంటివి పాడకపోతే ప్రేక్షకులు ఊరుకోరు. అవి పాడకుండా షో పూర్తేకాదు.

ఆర్‌డీ బర్మన్‌తో పెళ్లి
నేను ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్నప్పుడు ‘పంచమ్’ (బర్మన్ ముద్దుపేరు) టెన్తు తప్పి సంగీత దర్శకుడు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ముందు చదువు పూర్తిచేయమని సలహా ఇస్తే, నా ఇష్టం ఇదైనప్పుడు అక్కడెందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలన్నాడు. ఎస్.డి.బర్మన్ దగ్గర అసిస్టెంటుగా చేశాడు. తర్వాత తనే సంగీత దర్శకుడయ్యాడు.

‘తీస్రీ మంజిల్’లో తను ‘ఆజా ఆజా’ పాడమన్నప్పుడు భయపడ్డాను. పాశ్చాత్య ధోరణి ఎక్కువ. పది రోజులు ప్రాక్టీస్ చేశాను. షమ్మీకపూర్‌కు నేను బాగా పాడగలనని నమ్మకం ఏర్పడివుండొచ్చు. నవ్వుతూ, ‘దయచేసి రఫీ కంటే బాగా పాడొద్దు, తెరమీద ఆశా పరేఖ్ నాకంటే బాగా వినిపించకూడదు,’ అన్నారు. పాట నిజంగానే బాగావచ్చింది, పాడటం పూర్తికాగానే పంచమ్ వంద నోటిచ్చాడు సంతోషంతో. పంచమ్ నా గొంతును పూర్తిస్థాయిలో వెలికితీసిన మనిషి. 

ఇద్దరికీ మంచి ఆహారం ఇష్టం, చిన్నచిన్న విషయాలను ఆనందించేవాళ్లం, ఫుట్‌బాల్ మ్యాచులకు వెళ్లేవాళ్లం, ప్రపంచ పాటలు వినేవాళ్లం. మాకు మేమే గుట్టుగా బతికాం. కాకపోతే తన చివరిరోజుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సక్సెస్ అయిన ఏ కళాకారుడైనా చంచాలు చుట్టూ ఉండటాన్ని ఇష్టపడతాడు. వాళ్లు ఏవేవో చెప్పారు, తన మనసును పాడుచేశారు. మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ నేను తేరుకుని అన్నీ చెప్పాక అర్థం చేసుకోగలిగాడు. ఇప్పటికీ రికార్డింగ్ రూమ్‌కు వెళ్తే తను వెనక ఎక్కడో ఉన్నట్టే ఫీలవుతాను.

ఆశాస్ రెస్టారెంట్లు
నేను బాగా వాగుతాను, నవ్వుతాను, ఒక దగ్గర కూర్చోలేను. రెండు గంటలు ఏ పనీ లేకుండా ఒక గదిలో పడుండమంటే నా వల్ల కాదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. వంటయితే చెప్పనక్కర్లేదు. చిన్నతనం నుంచీ ఇష్టమే. పిల్లలకు వండిపెట్టడం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. ఒకవేళ నేను గాయని కాకపోయుంటే నాలుగిళ్లకు వండిపెట్టయినా బతికేదాన్ని.

మజ్రూ సుల్తాన్‌పురి (గీత రచయిత) వాళ్లింటికి అప్పుడప్పుడూ వెళ్తుండేవాళ్లం. వాళ్లింట్లో కబాబ్స్ బాగుండేవి. మా పిల్లలు బాగా ఇష్టపడేవాళ్లు. అవెలా చేసిందో ఆంటీని అడిగి తెలుసుకున్నా. ఓసారి సుల్తాన్‌పురి సాబ్ మా ఇంట్లో పార్టీకొస్తే కబాబ్స్ వడ్డించాను. అవి తింటూనే ఆయనకు కోపం వచ్చింది. ‘ఇవి ఎక్కడివి?’ అన్నారు. ‘నేనే చేశాను’ అన్నాను. ‘నువ్వా?’... ‘అవును, కాకపోతే మీ ఇంట్లోనే తెలుసుకున్నా’... ‘అదీ విషయం’ అని నవ్వేశారు. 

రణ్‌ధీర్ కపూర్, రిషి కపూర్ నా వంటను ఎంతో ఇష్టపడతారు. టమోటా చట్నీ బెంగాలీల మాదిరిగా, ఆలూ సబ్జీ హరిద్వార్ స్టైల్లో చేయగలను. నా పిల్లలు నన్ను వంటల పుస్తకం రాయమన్నారు. కానీ రాయలేదు. ఒకసారి మా చిన్నబ్బాయి ఆనంద్ రెస్టారెంట్ తెరుద్దామన్న ఆలోచన తెచ్చాడు. చెఫ్ నాతో ఆరు నెలలపాటు ఉండి, నా పద్ధతి వంటలు నేర్చుకుని వెళ్తాడు. ఇదీ ప్లాన్. మెల్లగా చెయిన్ విస్తరించింది. దుబాయ్‌లో రెండు, అబూదబీ (యూఏఈ)లో ఒకటి, దోహా (ఖతార్)లో ఒకటి, కువైట్లో మూడు, బెహ్రాయిన్, బర్మింగ్‌హామ్ (బ్రిటన్), కైరో(ఈజిప్ట్)ల్లో ఒకటేసి రెస్టారెంట్లు తెరిచాం (ఇందులో ఆశా వాళ్లది 20 శాతం వాటా, మిగతాది ‘వాఫి గ్రూప్’ది.).

పాటకు రోజులు కావు!
పాతరోజుల్లో పాడేటప్పుడు మ్యూజిక్ డెరైక్టర్ అన్నీ విడమరిచి చెప్పేవారు. నటీనటులెవరు, సహగాయకులెవరు, సందర్భం ఏమిటి... అందరం పాడుతూ ఇంప్రూవ్ చేసుకునేవాళ్లం. ఒక్కోసారి పాట అయిపోయాక కన్నీళ్లు వచ్చేవి. ఇప్పటి సంగీతంలో ఫీల్ లేదు. పాడే ఆనందం లేదు. ఒక లైన్ పాడు, చాయ్ తాగు, మరో లైన్ పాడు. సింథసైజర్లు, కంప్యూటర్లే మన గొంతుల్ని సరిచేస్తాయి. శ్రోతలు కూడా రిథమ్‌కే డ్యాన్స్ చేస్తారు, పాట విననే వినరు. పాటంటే పాడటం, సంగీతమే కాదు. అద్భుతమైన వాక్యాలుండాలి. వాటివల్లే పాట బతుకుతుంది. సాహిర్ (లుథియాన్వీ) సాబ్ లాంటివాళ్ల పాటలు వింటే ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది! కంబక్త్ ఇష్క్, ఇష్క్ కమీనా లాంటి పాటలు ఎంతకాలమని వింటాం!

అద్భుత ప్రయాణం
నన్ను నేను సాధారణ గృహిణిగా భావించుకుంటాను. మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెస్తాను. నా మనవలు, మనవరాళ్లు నేను వండింది తింటే నాకు సంతోషం. నా మొదటి భర్త మీద ఇప్పుడు ద్వేషం లేదు. ఆయన వల్లేకదా నాకు ముగ్గురు రత్నాల్లాంటి పిల్లలు కలిగారు. అక్క మీద కూడా కోపం లేదు. కలుస్తుంటాం, ఎలా ఉన్నావని క్షేమం తెలుసుకుంటుంటాం, ఎంతైనా మేము అక్కాచెల్లెళ్లమే కదా!

నా జీవితాన్ని ఒక అద్భుత ప్రయాణంగా భావిస్తాను. ఇది నా గుండెతో చెబుతున్నాను. నాకంటూ ఒక ఒరవడిని సృష్టించుకోగలిగాను. గొప్ప పాటల రచయితలు, గొప్ప గాయకులు, గొప్ప సంగీతదర్శకులతో కలిసి పని చేశాను. ఒక పాట చూపించి, ‘ఇలాంటి పాట ఆశా పాడలేదు,’ అనిపించుకోకుండా అన్ని రకాలూ పాడాను. ఇంగ్లిష్, స్పానిష్ లాంటి ఎన్నో భాషల్లో పాడాను. శ్రోతలను నా పాటలతో ఆనందంగా ఉంచుతూనే మరణించాలని కోరుకుంటాను. నా లోపలి గొంతు, ‘ఆశా! ఇక నేను నీకు లేను,’ అని చెప్పేదాకా పాడుతూనే ఉంటాను.

రాగాలు, రాగద్వేషాలు

- ‘మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై’ (ఇజాజత్-1987), జాతీయ ఉత్తమగాయనిగా ఆశాభోంస్లేకు రెండోసారి పురస్కారం తెచ్చిన పాట. మొదటిది, ‘దిల్ చీజ్ క్యా హై’ (ఉమ్రావ్‌జాన్-1981).
- లతకూ, ఆశాకూ పడకపోవడం ఏ స్థాయిలో ఉండేదంటే వాళ్లు కలిసి పాడాల్సివచ్చినప్పుడు, లత తన నోటుబుక్కును కుడిచేత్తో పట్టుకుంటే, ఆశా ఎడమచేత్తో పట్టుకునేదట. అలా ముఖాలు చూసుకోకుండా జాగ్రత్తపడేవారన్నమాట. వీళ్ల వైరం, జీవితాల ఆధారంగా సాయి పరంజపే దర్శకత్వంలో ‘సాజ్’(1998) సినిమా వచ్చింది. అరుణా ఇరానీ అక్కగా, షబానా అజ్మీ చెల్లెలిగా నటించారు.
- ఒకసారి ఓ సంగీత దర్శకుడు లత చదువుకోలేదని చెబుతూ బాగా చదువుకున్న ఓ గాయకుడిని ఉదాహరించారట. అప్పుడు ఆశా, ‘అతడు చదువుకుని ఉండొచ్చు, కానీ ఏం చేసినా లతా మంగేష్కర్ కాలేడు,’ అందట!
- ఆశా ‘మాయీ’ సినిమాలో నటించారు. ఆమెకు కూతురిగా పద్మినీ కొల్హాపురి చేశారు.

0 comments:

Post a Comment