Tuesday

"ప్రేమ ( సం ) దేశం ”


భగవంతుడు వున్నాడా? లేడా? ప్రస్తుత విషయానికి వున్నాడనే అనుకుందాం. భగవంతుడు పరిపూర్ణ ప్రేమమయుడు; దయామయుడు; కరుణామయుడు; నిస్వార్ధపరుడు. ప్రేమ వున్నచోట దయ, కరుణ, నిస్వార్ధం సహజంగానే వుంటాయి. భగవంతుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి? నన్ను, నేను సృష్టించుకోలేదు; నా తల్లి,తండ్రులు నన్ను సృష్టించారు. వారిని, వారే సృష్టించుకోలేదు. అదేవిధంగా, ప్రకృతిలోని చెట్లు, చేమలు; పక్షులు, జంతువులు; నీరు, గాలి, నిప్పు, భూమి అన్నిటినీ ఎవరో సృష్టించి ఇచ్చారు. ఇచ్చినవారు మనకంటే (జీవులకంటే) గొప్పవారై ఉండాలి. కనుకనే, వీటన్నిటిని సృష్టించినవాడిని భగవంతుడు అని అనుకోవటంలో తప్పులేదుకదా? విషయాన్ని తెలుసుకున్న మానవుడు, అందుకనే, భగవంతుడిని తన భావనలతో, మాటలతో, పాటలతో స్తుతిస్తూవుంటాడు.


అయితే, స్తుతి స్తోత్రం కోసమేనా భగవంతుడు జీవులని సృష్టించిది? ఇది స్వార్ధంతో కూడిన బుద్ధికాదా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఊహూ! కాదనే చెప్పొచ్చు. ఉదాహరణకు, అందమైనవాళ్ళు, తెలివిగలవాళ్ళు, తమకు కలిగిన అందం; తెలివితేటలు భగవంతుడి కృపే అని, సంతోషంతో, భగవంతుడిని పొగడవచ్చు. కానీ, లోకంలో అందవిహీనులున్నారు; తెలివిగల అందవిహీలున్నారు. మరి వీరందరూ, భగవంతుడిని రోజూ తిట్లతో స్తొత్రం చెయ్యాలికదా? నిజంగా భగవంతుడికి స్వార్ధం వుండినట్లైతే, జీవులందరినీ అందమైనవాళ్ళుగా; తెలివిగలవాళ్ళగానే పుట్టించివుండేవాడు కదా! కాబట్టి, భగవంతుడికి ప్రేమ, కరుణ, దయ తప్ప, స్వార్ధంలేదని ఋజువవుతున్నది.


ఇప్పుడు, మనం అసలు విషయానికి వద్దాం. విశ్వం మొత్తాన్ని ఒక దేశంగా అనుకుంటే, దేశానికి పేరు, ” ప్రేమదేశం అందాం. ప్రేమదేశంలో, భగవంతుడు ఇచ్చిన ఒకేఒక సందేశం ప్రేమ సందేశం. ప్రేమదేశంలోని సమస్త జీవరాశుల్లో మొట్టమొదటిగా వున్నది ప్రేమ మాత్రమే. ఏమిటీ ప్రేమ? చూద్దాం రండి:

మొదటిగా మనిషిని తీసుకుందాం. ఒక తల్లి,తండ్రులను తీసుకుందాం. భగవంతుడు, తన సంతానమైన మనుషులను సృష్టించిన తరువాత, వారిని చూసుకొని, ఎంతో ప్రేమతో మురిసిపోయాడుట. ఇంతటి చక్కటి జీవులను సృష్టించానే నేను అని అనుకొని. నాలాగే, మానవులుకూడా ప్రేమతో తమ సంతానాన్ని చూసుకోవాలి అంటే ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచించి, మాతృమూర్తికాగలిగే స్త్రీలలో, ప్రేమతోపాటుగా, పుట్టుకతోనే, సంతానోత్త్పత్తి చేయగల అండాశయాన్ని అమర్చాడు. (నేటి ఆధునిక జీవశాస్త్రం ప్రకారం, పుట్టిన ప్రతి ఆడ శిశువులో పది లక్షల అండాలు వుంటాయి. 18 సంవత్సరాలు, అంటే, పెళ్ళీడు వచ్చేసరికి ఇవి నాలుగు లక్షలు వుంటాయి. ఒక్కొక్క అండం, ఒక్కొక్క జీవికి మూలం అవుతుంది). ఇది భగవంతుడికి, మనుషులమీద వున్న ప్రేమే కదా! అదే ప్రేమతోనే, స్త్రీ, మాతృత్త్వాన్ని పొంది, తన సంతానాన్ని పెంచుతుంది. ఇక్కడ ఎటువంటి స్వార్ధంలేదు. మనిషి శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. తొమ్మిది నెలలపాటు అమ్మ పొట్టలో వున్నప్పుడు, “మాయ తో కప్పివుంచి, బిడ్డకు కావలసిన అన్ని సదుపాయాలను భగవంతుడు ఎంతో ప్రేమతో అమరుస్తాడు. పుట్టిన క్షణంనుంచి, జీవితపు ఆఖరు క్షణం వరకు, మనిషి, తన మనుగడకోసం, బాహ్యంలో, ఎన్నో పనులు చేస్తూవుంటాడు. అంతర్గతంగా, మనిషికి తెలియకుండానే, మనస్సు, మనోవేగంతో, ఎన్నో పనులను చేస్తుంది. ఇదిఅంతా కూడా భగవంతుని ప్రేమేకదా!


ఇక పక్షులు, జంతువుల విషయానికివస్తే, మానవుడికిలాగా వాటికి ఆలోచన, ముందు చూపులేదు. వాటికి స్వార్ధం తెలియదు. కానీ, ఆకలి, కామం వుంటాయి. అవికూడా పిల్లల్ని కంటాయి; ప్రేమతో వాటిని పెంచుతాయి. ఆలోచన, విచక్షణా జ్ఞానం లేని వాటికి, పిల్లల్ని ప్రేమతో పెంచాలని ఎలా తెలుసు? భగవంతుడు, తన సంతానమయిన వీటికికూడా ప్రేమను పంచాడు. ఇంత తిండి పెట్టి, దగ్గరకు తీస్తే, పక్షులు, క్రూర మృగాలనబడే పులులు, సింహాలుకూడా, ప్రేమతో మనిషికి దగ్గరవుతాయి. వాటిలో ప్రేమే తప్ప, తమను మనుషులు చంపుతారేమోఅన్న ఆలోచన; భయం లేనేలేవుకదా! ఇదే ప్రేమ తత్త్వం మనం మొక్కల్లోకూడా చూస్తాం.


ఇప్పుడు, మనముండే భూమిని చూద్దాం. చూడటానికి అతి ఖటినంగా వుంటుందికానీ, భూమి సంపూర్ణ ప్రేమస్వరూపం. తనను చీల్చి, గింజలు నాటితే, ప్రేమతో వాటిని పోషించి, మొక్కలుచేసి ఇస్తుంది. మీరు గమనించారో లేదో!! ” ఒక చిన్న ఆవగింజను భూమిలో నాటితే, అది మొలకెత్తి, చిగురుటాకులతో భూమిపైకి వస్తుంది. భూమి, తన ఖాటిన్యాన్ని వదిలి, మొలకకు ఒత్తిడి తగలకుండా, అతి సున్నితంగా పైకి తీసుకువస్తుంది. ఇది భూమియొక్క ప్రేమేకదా! అగ్ని పర్వతాలను తనలో దాచుకొని, పైపైకి, ఏమీ ఎరగనట్లే వుంటుంది. తనలో లయమైన వాటి రూపుమార్చి, బంగారంగా, వజ్ర, వైఢూర్యాలగా మలచి, మానవుడికి అందిస్తుంది. ఇదంతా ప్రేమ కాదంటారా? ” మోసేవాడికే తెలుస్తుంది భారం ప్రక్కవాళ్ళకేం తెలుసు? ” అని మనం చాలాసార్లు అనుకుంటూవుంటాం. మరి, భూమి ఏం చేస్తుంటుంది? తన బరువును తాను మోస్తూ, తనపైవున్న జీవులందరి బరువును మోస్తూ, ” నా కష్టాలేవో నేను పడతానుకానీ, మీకు (అంటే జీవులకు) శ్రమను కల్గించను అన్నట్లుగా, భూమి, తన చుట్టూ తాను తిరుగుతూ, తనపై ఆధారపడివున్న వారికోసం, ఇతరుల చుట్టూ (సూర్యుడు చుట్టూ) తిరుగుతూ, పగలు, రాత్రిని మనకోసం తీసుకువస్తుంది. పగలూ, రాత్రి లేకపోతే భూమిపై జీవుల మనుగడే వుండదు కదా! భూమికి స్వార్ధం ఎక్కడైనా వుందంటారా? అంతా ప్రేమ మయమే! మరి, సూర్యుడు మాత్రం తక్కువవాడా? తను నిప్పులు కక్కుతున్నా, భూమిమీద జీవులకు కావాల్సిన వేడిని మాత్రమే ఇస్తూ, పాపం!, నా బిడ్డలు, నా వేడికి కమిలిపోయి, అలిసిపోయారని, తన కాంతిని కొంత చంద్రుడికిచ్చి, చల్లగా, రాత్రిపూట మనల్ని సేద తీర్చమంటాడు. మండే సూర్యుడిలో కూడా చూసారా ఎంత ప్రేమ వుందో.


ఉపసంహారం:- త్యాగరాజస్వామి, తన ఒక కీర్తనలో, రాముడిని కీర్తిస్తూ, ” ఎంత సౌఖ్యమో…. .. ఎంత..నీ… చెప్పుదును ….” అని అంటాడు. ఆయన చెప్పిన సౌఖ్యము ప్రేమను గురించే. విశ్వం ప్రకృతి ప్రేమతో నిండివుంది. పుట్టుకతో, జీవీ, ముఖ్యంగా మానవుడు స్వార్ధ జీవికాడు; ప్రేమజీవే. తదనంతరం, మానవుడు, తప్పని తెలిసికూడా, స్వార్ధ బుద్ధిని అవలంబించుకుంటూ, తన స్థితి,గతుల్ని అధోగతి చేసుకుంటున్నాడు. తనని తానే మోసపుచ్చుకుంటున్నాడు. సహజసిద్ధంగా తనకు కలిగిన ప్రేమ తత్త్వాన్ని వృద్ధి చేసుకుంటే మానవుడు, మాధవుడే అవుతాడు. ప్రేమ ఉన్నచోట దయ, కరుణ తప్పకవుంటాయి. మూడూ వున్నచోట స్వార్ధం వుండలేదు. కాబట్టి, ప్రేమను పంచుదాం. దేశమే ప్రేమ దేశం. ప్రేమ సందేశాన్ని అందరికీ పంచుదాం.

From
మీతో చెప్పాలనుకున్నా!!! 

0 comments:

Post a Comment