Monday

ధర్మాగ్రహానికి ప్రతీక...

వలచిన వానిని వరించలేక దీనదుఃఖిత అవుతుంది అంబ. జీవితం చేజారిపోయిందని ఆవేదన చెందుతుంది. ఆమె సౌందర్యవతి. లావ్యణవతి. అంతకు మించిన సద్గుణవతి. అయితేనేం, కోరుకున్నది పొందలేని బేల, ఆమె ఖండిత హృదయం నుంచిఆగ్రహజ్వాలలు పెల్లుబుకి అవి భీష్ముడంతటి వాడిని నిరాయుధుణ్ణి చేస్తాయి. ధర్మాగ్రహానికి ప్రతీక అంబ. అమాయకులను ఏడిపిస్తే పుట్టుకొచ్చే శిఖండికి మరోరూపం అంబ.

హోత్రవాహనుడనే రాజు కాశీదేశాన్ని పాలిస్తుంటాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. అంబ, ఆంబిక, అంబాలిక. సుందరమందారాలుగా అంతఃపురంలో పెరుగుతారు. గురువులను పూజించి విద్యాబుద్ధులు సముపార్జిస్తారు. వారికి వివాహాలు జరిపించాలని స్వయంవరం ప్రకటిస్తాడు తండ్రి. అప్పటికే జ్యేష్టపుత్రిక అంబ, సాళ్వుడనే మహారాజుకు మనసిస్తుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు.

ఈ విషయాలేవీ హోత్రవాహనునికి తెలియవు. స్వయంవరం సమాచారం అందుకున్న భీష్ముడు హస్తినాపురం నుంచి బయలుదేరుతాడు. ఆ ప్రయాణం తన కోసం కాదు, తమ్ముడి కోసం. అక్కడికి విచ్చేసిన రాజులందరినీ ఓడించి రాకుమార్తెలు ముగ్గురినీ వెంటతీసుకుని హస్తినాపురం పోతాడు. అక్కడికి చేరాక ముందుగా అంబ నోరుమెదుపుతుంది. తాను సాళ్వభూపతితో ప్రేమలో పడిన విషయాన్ని తెలియజేసి తనను వదిలిపెట్టమని వేడుకుంటుంది. భీష్ముడు ఆమెను సాళ్వుని వద్దకు పంపిస్తాడు.

సాళ్వుని సమక్షానికి చేరిన అంబ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. పరాధీన అయిందని ఆమెను నిరాకరిస్తాడు సాళ్వుడు. చేయని నేరానికి శిక్ష తగదని వాపోతుంది. అమితంగా ప్రేమించిన సాళ్వుడు తనను త్యజించడానికి కారణం భీష్ముడేనన్న నిర్ణయానికి వస్తుంది అంబ. తన బతుకిలా తెల్లారిపోవడానికి హేతువు గంగాసుతుడేనని రగలిపోతుంది.

చేతగాని సోదరుని కోసం భీష్ముడు ఎందుకురావాలి... తాను గెలిచిన కన్యలను ఎవరికో ధారపోసే హక్కు ఎవరిచ్చారు. బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తున్నప్పుడు మరొకరి కోసం ఎందుకు జోక్యం చేసుకోవాలి... ఇలా అంబ పరిపరివిధాలుగా తలపోస్తుంది. అతగాణ్ణి హతమార్చని జన్మ వృథా అనుకుంటుంది. శస్త్రాస్త్ర విద్యలేవీ తెలియని పిల్ల భీష్ముని నిర్జించేదెలా! కసి, పగ పెరుగుతున్న కొద్దీ అంబలో కర్తవ్యదీక్ష పెనువృక్షమై ఎదుగుతుంది. ఈశ్వరానుగ్రహంతోనే అనుకున్నది సాధించగలనని భావిస్తుంది. తపస్సు చేయాలని చిట్టడవుల్లోకి పయనమవుతుంది.

ప్రతీకారేచ్ఛ తీర్చుకునేందుకు తపస్సుకు కూర్చోక తప్పదు. అన్నపానాలు మానుకుంటుంది. ఆమె తపం తీవ్రమవుతుంది. పుట్టలు పట్టేస్తుంది. తపోజ్వాలలు కైలాసాన్ని తాకుతాయి. నీలకంఠుడు ప్రత్యక్షమవుతాడు. వరం కోరుకోమంటాడు. భీష్ముని చంపేశక్తిని ప్రసాదించమని వేడుకుంటుంది. పార్వతీపతి భక్తసులభుడు. కోరుకున్న వరాన్ని అంబకు అందజేస్తాడు. అయితే ఆమె కోరిక ఈ జన్మలో తీరదని, మరు జన్మలో శిఖండిగా జన్మించి భీష్మునిపైకి మృత్యుపాశాలు విసురగలదని వివరిస్తాడు.

జన్మాంతరంలోనయినా శంతనుపుత్రుని పరిమార్చే వీలుదొరికితే అదే చాలనుకుంటుంది అంబ. అంతే కాదు. వీలయినంత త్వరగా తన ఈప్సితం ఈడేరాలని కోరుకుంటుంది. అందుకు ఏం చేయాలి. మరో జన్మ పొందాలంటే ఈ జన్మను ఇక్కడితో సమాప్తి చేసుకోవాలి. వెనువెంటనే అరణ్యంలో అక్కడికక్కడ దొరికే ఎండు కర్రలను చితిలా పేర్చి, అగ్ని రగుల్చుకుని ఆహుతైపోతుంది. అబలలు దుఃఖిస్తే రగిలే అగ్నికీల అది. పుణ్యస్త్రీల అంతఃకరణ నుంచి ఉద్భవించేమహాగ్ని అది. భీష్ముడంతటి వాడే ఆ జ్వాలలను నిలువరించలేకపోతాడు.

శిఖండి ఎదురుపడిన ఉత్తరక్షణాన కురుక్షేత్రంలో జావగారిపోతాడు. ధనుర్బాణాలను కింద పడేసి మృత్యుకౌగిలిలోకి చేరిపోతాడు. అంబ పట్టుదల చిన్నది కాదు. ఆడపిల్ల హృదయం ఎంతటి సుతిమెత్తనిదో అవసరమైతే అంతటి కటువుగానూ మారగలదని నిరూపిస్తుంది. పోరాడి తీరాలనే ధ్యేయనిష్ఠ అంబ జీవితంలోని ప్రతిదశలోనూ కనిపిస్తుంది. ఇందువల్లనే ఆమె ఉనికి తరతరాలుగా నిలిచి ఉంటోంది. దీపశిఖలా వెలుగొందుతోంది.

0 comments:

Post a Comment