Saturday

అంతరిక్ష అవినీతి


అంతరిక్ష రంగానికి కూడా అవినీతి చెద పట్టింది. యూపీఏ హయాంలో వరుసగా వెలుగులోకి వచ్చిన ఆదర్శ్, కామన్‌వెల్త్ గేమ్స్, 2జీ స్పెక ్ట్రమ్ లాంటి భారీ అవినీతి కుంభకోణాలను తలదన్నే స్థాయిలోని ఎస్-బ్యాండు స్కాంను కాగ్ ముందస్తుగానే పసిగట్టింది. ఆ స్కాంకు ప్రధాన బాధ్యులుగా గుర్తించిన భారత అంతరిక్ష సంస్థ మాజీ ఛైర్మన్ జి మాధవన్ నాయర్, మరో ముగ్గురు శాస్త్రవేత్తలు ఇక ముందు ఎలాంటి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టకుండా ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

అంతరిక్ష రంగంలో విశేష సేవలకు గాను దేశంలోనే రెండవ అతిపెద్ద సత్కారం అయిన పద్మవిభూషణ్ సాధించిన మాధవన్ నాయర్ ఈ స్కాంకు సూత్రధారునిగా ఆరోపణలు రావడం విచారకరం. ఆధునిక అంతరిక్ష ప్రయోగాలకు, చంద్రయాన్‌తో సహా విజయవంతమైన 27 అంతరిక్ష ప్రయోగాలకు ఆయన ఆద్యుడు. ఎస్-బ్యాండు ఉపగ్రహ ట్రాన్స్‌పాండర్ల కేటాయింపు ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కారణంగా దేశ ఖజానాకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది.

ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే అంతరిక్ష విభాగంలో జరిగిన ఈ అవినీతిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. ఆ ఒప్పందం నేటికీ అమలులోకి రాకపోవడంవలన ఎలాంటి నష్టం వాటిల్లలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరించి గత ఏడాది ఫిబ్రవరిలో దాన్ని రద్దు చేసింది. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు కమిటీలతో విచారణ జరిపించింది. ఆ కమిటీల నివేదికల ఆధారంగా నాయర్‌తో సహా మాజీ ఇస్రో సైంటిఫిక్ కార్యదర్శి కె భాస్కరనారాయణ, మాజీ ఆంత్రిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ రెఆర్ శ్రీధర్ మూర్తి, ఇస్రో మాజీ డైరెక్టర్ కెఎన్ శంకరలపై కేంద్రం నిషేధం విధించింది.

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగ ం అయిన ఆంత్రిక్స్ కార్పొరేషన్‌కు బెంగళూరుకు చెందిన ప్రైవేట్ సంస్థ దేవాస్‌కు మధ్య 2005లో ట్రాన్స్‌పాండర్స్ కేటాయింపు ఒప్పందం కుదిరింది. దృశ్య శ్రవణ సాంకేతిక సమాచారాన్ని అందుకొని, దానికి అనుగుణంగా స్పందించడం, ప్రసారం చేయడం లాంటి కార్యకలాపాలను నిర్వహించే కమ్యూనికేషన్స్ ఉపగ్రహ సాధనాలను ట్రాన్స్‌పాండర్లని పిలుస్తారు. ఇవి భవిష్యత్ అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థకు ఉపకరించే అంతరిక్ష సాధనాలు మాత్రమే. నాల్గవ, ఐదవ తరం సమాచార సాంకేతిక సేవలు అందించే ఎస్ బ్యాండు కమ్యూనికేషన్ తరంగాల ప్రసారానికి, వినియోగానికి ఇవి అత్యవసరం.

భవిష్యత్ సాంకేతిక విప్లవ అవసరాల నేపథ్యంలో 'శాట్‌కాం' విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. దాని మార్గదర్శకాల ప్రకారం వాణిజ్య ప్రాతిపదికన ప్రైవేటు సంస్థలకు ట్రాన్స్‌పాండర్స్‌ను కేటాయించే అధికారం అంతరిక్ష విభాగానికి ఉంటుంది. ఈ ట్రాన్స్‌పాండర్లకోసం అమెరికాకు చెందిన ఫోర్డ్ ఎడ్వైజర్స్ అనే సంస్థ ఆంత్రిక్స్‌తో సంప్రదింపులు ప్రారంభించింది. అందుకోసం 2004లో మాజీ ఇస్రో అధికారి ఎంజీ చంద్రశేఖర్ చైర్మన్‌గా, ఆ సంస్థకు చెందిన మరికొంత మంది అధికారులతో మల్టీ మీడియా సేవలందించే దేవాస్ కంపెనీని ఏర్పాటు చేసింది.

ంత్రిక్స్-దేవాస్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆంత్రిక్స్ తన ఆధీనంలోని ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌లోని 70 మెగాహెర్జ్ట్‌ను, ఇస్రో అభివృద్ధి చేసిన సి శాట్-6, జి శాట్-6ఏ ఉపగ్ర హాలలోని 90 శాతం ట్రాన్స్‌పాండర్లను 12 ఏళ్ళ కాలపరిమితికి దేవాస్‌కు లీజుకి ఇచ్చింది. 20 మెగాహెర్జ్ట్ స్పెక్ట్రమ్‌ను దాదాపు 13 వేల కోట్ల రూపాయలను బిఎస్ఎన్ఎల్ కంపెనీ చెల్లించగా అంతకు రెండింతల కు పైగా ఉన్న స్పెక్ట్రమ్‌కు దేవాస్ వెయ్యి కోట్ల రూపాయలనే చెల్లించింది. ట్రా న్స్‌పాండర్లను అతి తక్కువ ధరకు దేవాస్ లీజుకు ఇచ్చిన ఒప్పందం గురించి కేంద్ర కేబినె ట్‌కు ఆంత్రిక్స్ అందించలేదు. అయితే 2జీ కుంభకోణంపై వివాదం నేపథ్య ంలో ఎస్ బ్యాండ్ కేటాయింపుల్లో జరిగిన అవతవకలు కూడా బయటపడ్డాయి.

ట్రాన్స్‌పాండర్స్ వ్యాపార లావాదేవీల విషయంలో ఆంత్రిక్స్ సంస్థ సరైన విధివిధానాలను పాటించకపోవడమే కాకుండా, ప్రైవేటు సంస్థ కోసం ఉప్రగహాలను ప్రయోగించే కీలక అంశాన్ని కేంద్ర కేబినెట్‌కు తెలియకుండా దాచిపెట్టింది. ఆంత్రిక్స్‌కు స్పెక్ట్రమ్ కేటాయించే అధికారం ఉన్నప్పటికీ అతి తక్కువ ధరకు దేవాస్‌కు కట్టబెట్టడం వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందన్న విమర ్శలు వస్తున్నాయి. దేశ సహజ సంపదగా స్పెక్ట్రమ్‌లను గుర్తించాలని, అమూల్యమైన ఆ సంపదలను దుర్వినియోగం కాకుండా యావత్ జాతి ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.

మాధవన్ నాయర్ తదితర ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అంతరిక్ష అద్భుతాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ట్రాన్స్‌పాండర్స్ అమ్మకాన్ని స్పెక్ట్రమ్ అమ్మకంతో ముడిపెట్టడం సాంకేతికంగా సరైన అవగాహన కాదని, తాము ఏ తప్పూ చేయలేదని మాధవన్ ప్రకటించారు. తమ వాదనలను వినకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న నాయర్ అభ్యంతరాలనూ తేలిగ్గా తీసివేయలేము. ఇలాంటి స్కాం పునరావృతం కాకుండా దీని వెనక దాగిన దేశ విదేశీ కార్పొరేట్ శక్తుల పాత్రను బహిర్గతం చేసే కోణంలో దర్యాప్తు జరగాలి. దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న ఇస్రో సంస్థ ప్రతిష్ఠను కాపాడే విధంగా ప్రభుత్వం తగిన విధివిధానాలను రూపొందించాలి.

0 comments:

Post a Comment