Monday

దిగొచ్చిన ద్రవ్యోల్బణం...


సంక్షోభ రూపం దాల్చిన ద్రవ్యోల్బణం ఎట్టకేలకు శాం తించింది. తాజాగా రెండేళ్ల కనిష్ఠానికి పతనమై ప్రభుత్వానికి ఉపశమనం కలిగించింది. డిసెంబర్‌లో మొత్తం ద్రవ్యోల్బణం 7.47 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో ద్రవ్యోల్బణం 9.45 శాతంగా ఉంది. ఆహార ధరల భారీ తగ్గుదలే ధరల దూకుడు తగ్గడానికి ప్రధాన కారణం. ఈ క్రమంలో మార్చి నాటికి మొత్తం ద్ర వ్యోల్బణం6-7శాతానికి తగ్గుతుందనిప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే.. ఉత్పత్తి రంగ ద్రవ్యోల్బణం మాత్రం ఇప్పటికీ ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉందని ప్రకటించింది. ఆర్‌బిఐ కఠిన పరపతి వ్యూహాలకు ద్రవ్యోల్బణమే మూలకారణం. ప్రస్తుతం ఇది తగ్గినా తక్షణమే వడ్డీరేట్లు తగ్గించే సాహసం రిజర్వు బ్యాంక్ చేయకపోవచ్చని ఎనలిస్టులు అంటున్నారు. నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్) అర శాతం వరకూ తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు.

నిజానికి నవంబర్ నెలలోనూ ద్రవ్యోల్బణం 9.11 శాతంగా ఉంది. డిసెంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రుణాత్మకం కావడం కలిసివచ్చింది. సమీక్షా కాలంలో కూరగాయల ధరలు 30-60 శాతం మేర పతనమయ్యాయి. గణాంకాల పరంగా ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనపడుతోంది కానీ.. ఆహారేతర ద్రవ్యోల్బణంలో ఇంకా వేడి తగ్గలేదు. ఉత్పత్తి రంగం ద్రవ్యోల్బణం ఇంకా భయపెట్టే స్థాయిలోనే ఉంది. ఆహార ద్రవ్యోల్బణం విషయంలో కలిసివచ్చినట్లు ఆహారేతర ద్రవ్యోల్బణంలోనూ వ్యూహాలు ఫలిస్తాయని, మార్చి లక్ష్యాలను తప్పకుండా అందుకోగలమని ప్రభుత్వం దీమా వ్యక్తం చేస్తోంది.

ఉత్పత్తి సంక్షోభం షురూ..
ఆహార ద్రవ్యోల్బణమైతే తగ్గింది గానీ ఉత్పత్తి రంగ ద్రవ్యోల్బణం ఇంకా వణికిస్తూనే ఉంది. డిసెంబర్ నెలలో ఉత్పత్తి రంగ ద్రవ్యోల్బణం గత ఏడాదితో పోల్చితే 7.41 శాతం పెరిగింది. నవంబర్ నెలలోనూ ఉత్పత్తి రంగ ద్రవ్యోల్బణం 7.70 శాతంగా ఉంది. ఈ క్రమంలో ఆహారేతర ద్రవ్యోల్బణం ఇప్పట్లో నేలకు దిగివచ్చే అవకాశాలు కనపడటం లేదు. ధరల పతనం ఆహార ద్రవ్యోల్బణానికే పరిమితమైంది. డిసెంబర్ నెలలో ఆహార ధరల్లో పెరుగుదల 0.74 శాతం మాత్రమే.

ఉల్లి, బంగాళదుంపల ధరలు భారీగా క్షీణించడం వల్లే ఇది సాధ్యపడినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. టోకు ధరల సూచీలో ఉత్పత్తి రంగం వెయిటేజీ 65 శాతం. ఈ ధరలు తగ్గకపోవడంపై ప్రభుత్వం సైతం ఆందోళన చెందుతోంది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సైతం ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో ఇంధనం, విద్యుత్ ధరలు 14.91 శాతం మేర పెరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 15.48 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అయినా.. కష్టమే..
డిసెంబర్‌లోనూ బేస్ ధరల కారణంగానే ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది గానీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ట్రెండ్ కనపడదని ఎనలిస్టులు అంటున్నారు. ఈ క్రమంలో మార్చి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యాలను ప్రభుత్వం అందుకోకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ నెల గణాంకాలు విడుదల చేసిన ప్రభుత్వం ఇదే సమయంలో అక్టోబర్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలను 9.87 శాతానికి పెంచింది.

ఇంతకుముందు ద్రవ్యోల్బణం 9.73 శాతంగా ప్రభుత్వం లెక్కగట్టింది. ద్రవ్యోల్బణం వేడి క్రమంగా క్షీణించడంతో జిడిపి జోరుకు ఊతం ఇవ్వడానికి వడ్డీరేట్లు తగ్గించే అవకాశం రిజర్వు బ్యాంక్‌కు కలిగిందని ప్రణాళికా సంఘం అంటోంది. ఈ నెల 24న రిజర్వు బ్యాంక్ మూడో త్రైమాసిక పరపతి సమీక్షను చేపట్టనుంది. ఈ క్రమంలో కఠిన వ్యూహాలకు చెక్ పెట్టి వడ్డీరేట్లు తగ్గించే దిశగా ఆర్‌బిఐ నిర్ణయాలు వెలువడవచ్చని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

0 comments:

Post a Comment