Friday

ఇంటర్వ్యూ టిప్స్... కొలువు సాధనకు స్టెప్స్!!

ఇంజనీరింగ్ నాలుగేళ్లూ కష్టపడి చదువుతారు. పరీక్షలకు పక్కాగా ప్రిపేరవుతారు. పరీక్ష హాల్లో చివరి క్షణం వరకు కూర్చొని ఓపిగ్గా సమాధానాలు రాస్తారు. ఫలితాల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఉత్తమ అకడమిక్ రికార్డు సొంతం చేసుకుంటారు. ఉద్యోగ సాధనలో మాత్రం భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. జాబ్ ఎంట్రీ లెవల్ రాత పరీక్షల్లో అద్భుతంగా రాణించి... మౌఖిక పరీక్షలో విఫలమవుతారు. ఇంటర్వ్యూ హాల్లో ప్రవేశించగానే.. తీవ్ర ఒత్తిడికి లోనై తుది మెట్టువద్ద బోల్తా పడతారు. అటువంటి అపజయాలను అధిగమించి ఉద్యోగ సాధనను సులభతరం చేసుకోవాలనుకుంటున్నవారి కోసమే ఈ... ‘ఇంటర్వ్యూ టిప్స్’!!

ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూది కీలక దశ. దీనిలో గట్టెక్కితే కొలువు సాధన లాంఛనమే. చాలా మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలనగానే ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో విద్యనభ్యసించిన వారు ఈ విషయంలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతారు. తాము ఇంగ్లిష్‌లో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేమనే ఆత్మన్యూనతా భావంలో మునిగిపోతారు.

భాష అనేది కమ్యూనికేషన్ మాధ్యమమే కానీ... అదే సర్వస్వం కాదు. సబ్జెక్టుపై విస్తృత పరిజ్ఞానం ఉంటే... చింతించాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకు ముందుగా రాతపరీక్ష.. గ్రూప్ డిస్కషన్ తదితర స్థాయిల్లో సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొందాలి. అప్పడే ఆత్మవిశ్వాసం, నూతనోత్తేజంతో ఇంటర్వ్యూలకు సిద్ధమవగలుగుతారు.

ఇంటర్వ్యూలు ఎందుకు?
ఉద్యోగాలకు అభ్యర్థులు ఏవిధంగా సరిపోతారో అంచనావేయడంతోపాటు అభ్యర్థుల ప్రవర్తన, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక సమకాలీన సమస్యలపై అభ్యర్థుల వైఖరి, దృక్పథాన్ని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. సాధారణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాల సంఖ్యకు మూడు లేదా నాలుగు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ నిర్వాహకులు వారిని వివిధ కోణాల్లో పరిశీలిస్తారు.

అభ్యర్థుల ప్రతి కదలిక, వారి నడవడిక, వస్త్ర ధారణ తదితర అంశాలన్నింటినీ గమనిస్తారు. అకడెమిక్‌గా మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు కూడా ఒక్కోసారి ఇంటర్వ్యూల్లో విఫలమవుతుంటారు. కాబట్టి ఎంపిక ప్రక్రియల్లో ఇంటర్వ్యూలు అత్యంత ప్రధానమైనవి. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అభ్యర్థుల్లో గమనించే ప్రధాన లక్షణాలు..
* ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యాలు,
* కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషన్,
* స్వీయ విశ్లేషణా నైపుణ్యాలు.

Good Preparation is half done
ఉద్యోగానికి మీరే సరైన వ్యక్తి అని దృఢంగా నిశ్చయించుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఎదుర్కోవడానికి ముందుగా కొంత కసరత్తు చేయాలి. ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలకు సిద్ధమవ్వాలి. మంచి ప్రిపరేషన్ ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోగలుగుతారు. అలా చేస్తే మీరు సగం విజయం సాధించినట్లే.

కంపెనీ గురించి తెలుసుకోండి:
ఇంటర్వ్యూకు వెళ్లేముందు అభ్యర్థులు ముందుగా సదరు కంపెనీ గురించిన సాధ్యమైనంత సమాచారాన్ని సేకరించాలి. సంస్థల వెబ్‌సైట్లలో కావాల్సినంత సమాచారం లభిస్తుంది. పత్రికలు, మ్యాగజీన్ల సాయంతో ఆ కంపెనీకి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

రెజ్యుమెలో పేర్కొన్న అంశాలు:
ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు దరఖాస్తు సమయంలో కంపెనీకి పంపిన రెజ్యుమెలో పేర్కొన్న అంశాలను ఒకసారి చూసుకోండి. ఎందుకంటే వివిధ కంపెనీలకు పంపే వేర్వేరు రెజ్యుమెల్లో పేర్కొన్న అంశాల్ని గుర్తుంచుకోవాలి. ఏయే అంశాల్లో మీకు ైనె పుణ్యం ఉందని రెజ్యుమెలో పొందుపరిచారో వాటిపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు వాటి గురించే అడగడానికి అవకాశం ఉంది. రెజ్యుమెలో పొందుపర్చినట్లుగా మీలో ఆయా నైపుణ్యాలున్నాయా.. అని రిక్రూటర్లు తప్పకుండా పరీక్షిస్తారు. దాంతోపాటు గత పని అనుభవాలను ప్రస్తావించినట్లయితే దానిపైనా ప్రశ్నలకు సిద్ధం కావాలి.

భయాన్ని అధిగమించండి:
చాలామంది ఇంటర్వ్యూకు ముందు కొద్దిపాటి భయం, ఒత్తిడికి గురవడం సహజం. అవి ఒక స్థాయి వరకు ఉన్నట్లయితే ఎటువంటి నష్టం ఉండదని నిపుణులు సైతం సూచిస్తున్నారు. అప్పుడే మీ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందంటున్నారు. ఇంటర్వ్యూలో అభ్యర్థుల స్పెషలైజ్డ్ సబ్జెక్టులోనే వారిని పరీక్షిస్తారని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీకు సంబంధం లేని అంశాలపై ప్రశ్నించరని తెలుసుకోవాలి. అభ్యర్థులు సబ్జెక్టుపై అవగాహన, ప్రతిభ ద్వారా ఇంటర్వ్యూ సభ్యులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి.

సమయానికి ఇంటర్వ్యూకు:
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి వీలైనంత ముందుగానే చేరుకోవాలి. తద్వారా అనవసరపు ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. హడావిడిగా వెళ్లడం వల్ల రిక్రూటర్లతో మాట్లాడేప్పుడు గొంతులో స్పష్టత లోపించే ప్రమాదముంది. ఇంటర్వ్యూకు వెళ్లేప్పుడు వస్త్ర ధారణ కూడా హుందాగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంటర్వ్యూకు ముందురోజు త్వరగా నిద్రపోవడం ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించొచ్చు. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టింది మొదలు... పూర్తయ్యేవరకు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించగానే ఇంటర్వ్యూ మెంబర్‌‌సను చిరునవ్వుతో పలకరించాలి.

ప్రశ్నల సరళిని తెలుసుకోండి:
ఇంటర్వ్యూలో రిక్రూటర్లు ఒక్కోసారి సులువైన ప్రశ్నలు అడుగుతుంటారు. అభ్యర్థులు జాగ్రత ్తగా ఆలోచించి సమాధానాలు చెప్పాలి. అభ్యర్థుల దృక్పథాన్ని అంచనావేసేందుకు రిక్రూటర్లు ఈ ప్రశ్నలను అడుగుతారు. కొన్ని ప్రశ్నలు చాలా సులువుగా అనిపిస్తాయి. కానీ సమాధానం చెప్పడం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి సమాధానాలు చెప్పేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలు.. వాటి సమాధానాలపై ముందస్తు కసరత్తు చేసిన వారు ఈ విషయంలో సులువుగా రాణించొచ్చు.

ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలు:
* మీ గురించి చెప్పండి?
* ఈ ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేశారు?
* దీనిపై మీకెందుకు ఆసక్తి కలిగింది?
* మీ బలాలు, బలహీనత లు ఏమిటి?
* మీరు సాధించిన విజయాలను చెప్పండి?
* మీ అలవాట్ల గురించి చెప్పండి?
* మీ లక్ష్యాలను వివరించండి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు సహజంగా ఉండాలి. రిక్రూటర్లను ఆకట్టుకునేలా మాట్లాడాలి. నిజాయతీగా సమాధానాలు చెబుతున్నారనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి. ఉద్యోగం తమకెలా సరిపోతుందో.. నైపుణ్యాలు, అర్హతలు సంస్థ అభివృద్ధికి ఎలా దోహదపడ తాయో వివరించగలగాలి. గతంలో సాధించిన విజయాలను గురించి ప్రస్తావించేప్పుడు వాటికోసం చేసిన కృషి గురించి వివరించాలి. హాబీస్ గురించి ప్రశ్నించినపుడు వాస్తవాలనే చెప్పాలి. సమకాలీన అంశాలపై కూడా అవగాహన కలిగి ఉండడం ద్వారా అదనపు ప్రయోజనం ఉంటుంది. అలాగే సినిమాలు, సంగీతం, స్పోర్ట్స్ తదితర ఆసక్తులపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

...............

డూస్ అండ్ డోన్ట్స్

* ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించే ముందు తలుపు తట్టి అనుమతి కోరాలి.
* ఇంటర్వ్యూ సభ్యులను చిరునవ్వుతో పలకరించాలి. ఇంటర్వ్యూ బృందం సభ్యుల కంటే ముందుగానే కరచాలనానికి ప్రయత్నించ డం మంచి పద్ధతి కాదు.
* ఇంటర్వ్యూ సభ్యులు కూర్చోమని చెప్పేవరకు వేచిచూడాలి.
* కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. ఒకవైపునకు వంగి కూర్చోవడం, అత్యంత నిటారుగా కూర్చోవడం కూడా మంచిది కాదు.
* సమాధానాలు చెప్పేసమయంలో కిందికి చూడడం, కళ్లు మూయడం వంటివి చేయకూడదు. ఇంటర్వ్యూ సభ్యులనందరినీ చూస్తూ సమాధానాలు చెప్పాలి.
* ఇంటర్వ్యూలో అభ్యర్థులు చేతులను అదేపనిగా నలుపుకోవడం వంటి చర్యలు చేయొద్దు.
* ఇంటర్వ్యూలో అతి వినయం కూడా చేటు చేస్తుందని తెలుసుకోవాలి. తమ అర్హతలకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించేలా హుందాగా వ్యవహరించాలి.
* ఇంటర్వ్యూలో ఏదైనా ప్రశ్నను సరిగ్గా విననప్పుడు మళ్లీ అడగాలి. ఉదాహరణకు ‘ప్లీజ్ రిపీట్ ఇట్ సార్’ అని కాకుండా ‘బెగ్ యువర్ పార్డన్’ తరహాలో అడగాలి.
* సర్టిఫికెట్లు క్రమపద్ధతిలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఇంటర్వ్యూ గదినుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లాలి.
* ఇంటర్వ్యూలో సున్నితమైన పదాలనే ఉపయోగిం చాలి. పెద్ద గొంతుతో లేదా మరీ తక్కువ గొంతుతో మాట్లాడొద్దు.
* ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇవ్వడం మంచిది కాదు.
* ఇంటర్వ్యూలో అభ్యర్థులు తాము చెప్పేది వంద శాతం వాస్తవాలైనప్పటకీ ఇంటర్వ్యూర్‌‌సతో వాదించొద్దు.
* ఇంటర్వ్యూర్స్ ప్రశ్నలు అడగడం పూర్తి కాకముందే సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. ప్రశ్నలను పూర్తిగా విన్న తర్వాతే సమాధానం చె ప్పాలి.

.............

క్యాంపస్ ఇంటర్వ్యూలు

ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కోర్సు పూర్తికాకముందే కొలువు దక్కించుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.
* ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రెజ్యుమెలను వెంటతీసుకెళ్లాలి. అలాగే పాస్‌పోర్ట్ ఫొటోలను కూడా తీసుకెళ్లాలి.
* ఇంటర్వ్యూకు ముందు ఇంజనీరింగ్ కోర్సులో మీరు చేసిన ప్రాజెక్టును ఒకసారి చూసుకోవాలి. దానిలోని అంశాలను రెండు నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో వివరించగలిగేలా సిద్ధమవ్వండి.
* అభ్యర్థులకు ఏయే అంశాలపై పట్టుందని ఇంటర్వ్యూల్లో సహజంగా అడుగుతారు. అటువంటి సందర్భాల్లో మీకు పూర్తి పట్టున్న సబ్జెక్టులనే పేర్కొనడం ప్రయోజనం.
* కొత్త వారికి ఏయే కంపెనీలు అవకాశాలిస్తున్నాయో తెలుసుకోవాలి. అవి ఆఫర్ చేసే సాలరీపైకూడా అవగాహన అవసరం. ఇంటర్వ్యూలో ఎంత వేత నం కోసం ఎదురుచూస్తున్నారని ప్రశ్నించినప్పుడు.. ఆశిస్తున్నదాన్ని చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి.

0 comments:

Post a Comment