Sunday

అమెరికా అనైతిక వైద్య ప్రయోగాలు ఒక చారిత్రక నేరం అటు గ్వాటెమాలాలో.. ఇటు హిమాచల్‌లో! చికిత్స కోసం సిఫిలిస్ రోగుల తయారీ





పెన్సిలిన్ సామర్థ్యంపై పరీక్షలు
గ్వాటెమాలకు ఒబామా క్షమాపణ
మరి.. మనకు చెప్పేదెవరు?
అగ్రరాజ్యాలు ఎప్పుడూ క్షమాపణలు చెప్పవు! ఒక వేళ క్షమాపణ చెప్పినా... అది క్షమించరాని తప్పిదమై ఉంటుంది. 1946-48 మధ్య గ్వాటెమాలాలో జరిపిన అక్రమ, అనైతిక వైద్య పరిశోధనలపై నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ఒబామా క్షమాపణలు చెప్పారు. మరి మన దేశానికి, అందునా సిమ్లా సమీపంలోని గుంఢ్‌లో జరిగిన దారుణ వైద్య ప్రయోగాలకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? అప్పుడు గ్వాటెమాలాలో జరిగినట్లే... గుంఢ్‌లోనూ వైద్య ప్రయోగాలు జరిగాయి. ప్రాణాంతకమైన సిఫిలిస్ అనే సుఖ వ్యాధిపై ప్రజలనే ప్రయోగశాల జీవాలుగా ఉపయోగించారు. ఈ 'చారిత్రక' పాపం కూడా అమెరికాదేనా? 

సిఫిలిస్ ప్రాణాంతకమైన సుఖవ్యాధి. ఇది వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య కూడా! సిఫిలిస్ పూర్తిగా సమసిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ, ఒకప్పుడు ఈ వ్యాధి చాలా దేశాల్లో విస్తృతంగా ఉండేది. 1949 నవంబర్‌లో- అంటే సరిగ్గా 70 ఏళ్ల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైద్యుల బృందం గుంఢ్‌కు వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సిఫిలిస్ ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించడం, వైద్య అందించడమే వీరి ప్రధానోద్దేశం. ఈ బృందం సిమ్లాలో మకాం వేసింది. గుంఢ్ సమీపంలో ఉన్న థియోంగ్ అనే గ్రామంలో ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసింది. గుంఢ్‌లో నివసించే 354 కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. 
274 కుటుంబాల వారికి సిఫిలిస్ ఉందని తేల్చింది. అప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చిన పెన్సిలిన్ ద్వారా వీరికి చికిత్స చేశారు. దాని వల్ల చాలా మంచి ఫలితాలు కనిపించాయి. ఇలా కొద్ది కాలం మందులు వాడిన స్థానిక ప్రజలు... హఠాత్తుగా వైద్య బృందానికి వ్యతిరేకమయ్యారు. 80 శాతం మంది వైద్య పరీక్షలకు రావడం మానేశారు. ఏడాది తిరిగేసరికి గుంఢ్‌లో ఉన్న వారంతా ఈ పరీక్షలకు ఎదురు తిరిగారు. దీనికి కారణమేమిటో మాత్రం నిర్దిష్టంగా తెలియలేదు. 

గ్వాటెమాలాలోని ఒక పిచ్చి ఆసుపత్రిలో ఉన్న మహిళలు కూడా ఒక దశలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారంటూ గుంఢ్‌లోని వైద్య బృందానికి సారథ్యం వహించిన జాన్ కట్లెర్ అనే వైద్యుడు ఒక పత్రంలో పేర్కొన్నాడు. గుంఢ్‌కు రావడానికి ముందు జాన్ కట్లెర్ గ్వాటెమాలాలోనూ వైద్య పరిశోధనలు చేశారు. ఇదంతా చూస్తే.. ప్రయోగాల పేరిట గ్వాటెమాలాలో జరిగిన ఘోరాలే గుంఢ్‌లోనూ జరిగాయనే సందేహాలు కలుగక మానవు! 

గ్వాటెమాలాలో ఏం జరిగింది..
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రోజుకు దాదాపు 18వేల మంది సైనికులు సిఫిలిస్, గనేరియా వ్యాధుల కారణంగా సైన్యం నుంచి నిష్క్రమించే వారు. వీటి నుంచి సైనికులను కాపాడటానికి కండోమ్స్, వెండి - సల్ఫర్ మిశ్రమంతో కూడిన కొన్ని మందులను ఇచ్చేవారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఈ సమయంలో పెన్సిలిన్‌తో మంచి ఫలితాలున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే... అప్పటికి మందుపై ఇంకా పరిశోధనలు పూర్తి కాలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. 

దీంతో అమెరికా శాస్త్రవేత్తలు పెన్సిలిన్ సామర్థ్యంపై పరిశోధనలకు పూనుకున్నారు. దీని కోసమే కట్లెర్ 1946లో గ్వాటెమాలా వెళ్లారు. పెన్సిలిన్ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవాలంటే- సుఖ వ్యాధులున్న రోగులు కావాలి. అలాంటి సుఖవ్యాధులు లేకపోతే వారికి ఆ వైరస్‌లను ఇంజెక్ట్ చేయాలి. దీని కోసం కట్లెర్ ఖైదీలు, సెక్స్ వర్కర్లు, పిచ్చి వాళ్లను ఎంచుకున్నాడు. ఇలా... దాదాపు 219 మంది శరీరంలోకి గనేరియా, సిఫిలిస్ వైరస్‌ను ఎక్కించాడు. సెక్స్ వర్కర్లకైతే నేరుగా జననాంగంలోకి, పురుషులకైతే శరీరంపై గాట్లు పెట్టి, ఆ గాయాల ద్వారా... నేరుగా వ్యాధికారక వైరస్ ఉండే స్రవాన్ని ఎక్కించాడు. ఇలా వైరస్ సోకిన ఒక సెక్స్ వర్కర్ దగ్గరకు 71 నిమిషాలలో ఎనిమిది మంది విటులను పంపాడు. 
ఈ మొత్తం దృశ్యాలను కట్లెర్, ఆయన భార్య కెమెరాతో చిత్రీకరించేవారు. వ్యాధి సోకిన వారికి కట్లెర్ పెన్సిలిన్‌ను మందుగా ఇచ్చేవాడు. ఈ ప్రయోగాల గురించి 1947 అక్టోబర్ 27న న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. తన పరిశోధనల గురించి బయటకు తెలియజేయవద్దంటూ ఒక కట్లెర్ ఆ పత్రికకు లేఖ కూడా రాశాడు. ఆయన పరిశోధనలు 1948 జూలై వరకూ సాగాయి. ఈ సమయంలో కట్లెర్ పిచ్చి ఆసుపత్రిలో ఉన్న 446 మంది రోగులపైనా కూడా పరిశోధనలు జరిపాడు. వీరిలో కేవలం 294 మందికి మాత్రమే చికిత్స అందించాడు. తమపై ఎలాంటి ప్రయోగాలు జరుపుతున్నదీ తెలియకుండానే వీరంతా బలి పశువులు అయ్యారు. కట్లెర్ గ్వాటెమాలాలో చేసిన పరిశోధనల గురించి... ఆయన చనిపోయిన తర్వాత, అంటే 2003లో బయటకు వచ్చింది. 
ఏది ఘోరం... ఎంత ఘోరం?
1946లో నాజీలపై యుద్ధ నేరాల విచారణ జరుగుతున్నప్పుడు... అమెరికా వైద్యులు వివిధ దేశాల్లో చేసిన అనైతిక, అక్రమ వైద్య ప్రయోగాల ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. 'మావి యుద్ధనేరాలైతే... అమెరికన్లవీ యుద్ధ నేరాలే'... అని నాజీలు వాదించారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. నిజానికి... అమెరికా వైద్యులు అనుసరించాల్సిన నైతిక సూత్రాలను డాక్టర్ లియో అలెగ్జాండర్ ఎప్పుడో రూపొందించారు. వీటినే న్యూరిమ్‌బెర్గ్ రూల్స్ అని కూడా అంటారు. ఈ సూత్రాల గురించి అమెరికా పబ్లిక్ హెల్త్ సర్వీస్‌కు 1846లోనే తెలుసు. అయినప్పటికీ... 1946-48 మధ్యలో వైద్య పరిశోధనల పేరిట గ్వాటెమాలాలో దారుణాలకు పాల్పడ్డారు. 

ఇది జరిగిన 75 ఏళ్ల తర్వాత ఆ నాటి సంఘటనలకు ఒబామా క్షమాపణలు చెప్పారు. ఇది గ్వాటెమాలాలో జరిగిన దారుణం! మరి... దాదాపు అదే సమయంలో, అదే కట్లెర్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని గుంఢ్‌లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ తెలియదు. బహుశా... గుంఢ్‌లోనూ గ్వాటెమాలాలోలాగా దారుణాలకు పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. అక్కడి ప్రజలు మౌనంగా అన్నీ భరించినప్పటికీ... ఇక్కడి వారు తిరుగుబాటు చేసి ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్లెర్ పత్రాలు మరిన్ని బయటకు వస్తే ఆ గుట్టు కూడా రట్టవుతుంది! 



New Visitor? Like what you read? Then please subscribe to my Blog Feed or sign up for Free Email Updates. Thanks for Visiting!

0 comments:

Post a Comment