Friday

గ్రూప్-1 విజేతల ఇంటర్వ్యూలు.. ఇలా...

అనేక వివాదాల అనంతరం గ్రూప్-1 మెయిన్‌‌స పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. దాదాపు 11 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీపీఎస్‌సీ జనవరి 4, 2012 నుంచి ఫిబ్రవరి 21, 2012 వరకు గ్రూప్ -1 ఇంటర్వ్యూలు ఉంటాయని అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మౌఖిక పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి? ఎలాంటి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి? కోరుకున్న పోస్టును దక్కించుకోవాలంటే ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? ఇలా అనేక సందేహాలు! దీని కోసం గత గ్రూప్-1 విజేతలు అనుసరించిన వ్యూహం ఏమిటి? వాళ్లు విజేతలుగా మారడంలో దోహదపడిన అంశాలు? ఇంటర్వ్యూను ఎదుర్కొన్న విధానం మీ కోసం...

భాష.. భావం.. ఆత్మవిశ్వాసం!!

బాష కంటే.. భావం ముఖ్యం. చెప్పాలనుకునే విషయాన్ని ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా చెబితే సగం విజయం సాధించినట్లే. అయిదు, లేదా పది నిమిషాల్లో జరిగే ఇంటర్వ్యూ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయం. కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా.. ప్రణాళికబద్ధంగా ప్రిపేరైతే ఇంటర్వ్యూలో విజయం సాధించడం పెద్ద కష్టం కాదంటున్నారు 2007 గ్రూప్- 1 విజేత రేవతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఈమెను సాక్షి ‘‘భవిత’’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలివే...

* గూప్-1 అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎలా ప్రిపేర్ కావాలి?
గ్రూప్-1 ఇంటర్వ్యూకు హాజరుకాబోయే అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రిపరేషన్ చేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ముఖ్యంగా అభ్యర్థికి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. బోర్డు సభ్యుల ముందు ఆత్మవిశ్వాసంతో మెలగడం, వారు అడిగే ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఒకవేళ వారు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే తెలియదని నిజాయితీగా ఒప్పుకోవాలి. కాని ఏదో ఒక సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే.. లోపాన్ని పసిగట్టేస్తారు. ఇది మైనస్ మార్కులకు దారితీస్తుంది.

వ్యక్తిగత వివరాలు, ఆశయాలు, లక్ష్యాలు, విద్యా నేపథ్యం వంటి వాటిపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ముందుగానే వాటికి స్పష్టంగా సమాధానాలు చెప్పేలా ఇంట్లోనే ప్రాక్టీస్ చేయాలి. కొత్తగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు తాము సరైన సమాధానం సక్రమంగా చెప్పగలమా? లేదా? అనే ఆందోళనలో ఉంటారు. అందుకే ముందురోజు ఇంట్లో అద్దం ముందు కూర్చుని ప్రాక్టీస్ చేయడం.. ముఖకవళికలు గమనిస్తూ.. ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్‌లో అవసరమైన మార్పులు చేసుకోవాలి.

* ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది?

ఇంటర్య్వూలో బోర్డు సభ్యులు ముందుగా అభ్యర్థి బయోడేటా, వ్యక్తిగత వివరాలు, అభిరుచులపై ప్రశ్నలు అడుగుతారు. తద్వారా అభ్యర్థి ఆలోచన విధానం, అతడి నేపథ్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా పరిణామాలు.. సమకాలీన సంఘటనలు, మార్పులపైనా ప్రశ్నలు అడగొచ్చు. అభ్యర్థి ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం ప్రాముఖ్యత, ప్రత్యేకత గురించి అడిగే అవకాశముంది.

కొన్నిసార్లు బోర్డు సభ్యులు స్పాంటేనియస్ ప్రశ్నలు అడుగుతారు. అందుకే నిత్యం పత్రికలు చదివితే ఇలాంటి వాటికి సులువుగా సమాధానాలు చెప్పొచ్చు. బోర్డు సభ్యుల నేపథ్యం ఇంటర్వ్యూకు ముందే తెలుసుకోవడం ద్వారా వారు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముందో కొంతవరకు అంచనా వే యొచ్చు.

* మీ విద్యా నేపథ్యం?
ఉస్మానియాలో బీఏ చేశాను. ఆ తర్వాత 1996-98 మధ్య కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనాన్స్ చేశాను.

* ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలు చెప్పడంలో మెళకువలు?
గ్రూప్-1కు అభ్యర్థులు చాలా కాలంగా కష్టపడి ప్రిపేరవుతుంటారు. మెయిన్స్‌లో విజేతగా నిలిచి ఇంటర్వ్యూలో విజయం సాధించాల్సినప్పుడు అయిదు లేదా పది నిమిషాలు జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థి అన్నేళ్ల శ్రమ, కష్టాన్ని తేల్చేస్తారు. ఒకరకంగా ఉద్యోగం వచ్చేది రానిది ఇంటర్వ్యూను అభ్యర్థి ఎదుర్కొన్న తీరుపై ఆధారపడి ఉంటుంది.

ప్రతిక్షణం చాలా విలువైంది. సరైన ప్రిపరేషన్ లేకుండా వెళ్లకూడదు. ముఖ్యంగా ఇంటర్య్వూ సమయంలో మనకు తెలిసిన విషయాన్ని సైతం కంగారులో చెప్పడం మర్చిపోతాం. లేదంటే తెలిసినా ఒత్తిడికి లోనై స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేం. ఈ లోపాలు అధిగమించడానికి ఇంట్లో, లేదా కోచింగ్ సెంటర్లో సాటి అభ్యర్థులతో బృంద చర్చల్లో పాల్గొనాలి. ఇందుకు మాక్ ఇంటర్వ్యూలు బాగా ఉపయోగపడతాయి.

* భాషను, భావ వ్యక్తీకరణను ఎలా మెరుగుపర్చుకోవాలి?
అభ్యర్థి ఎంత ప్రతిభావంతుడైనా... తనకు తెలిసిన విషయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతే శ్రమంతా వృథా అవుతుంది. అందుకే ఇంటర్వ్యూలో బోర్డు ప్రతినిధుల ముందు స్పష్టంగా, సూటిగా, వినయంగా మాట్లాడగలగాలి. ప్రశ్నలు ఇంగ్లిష్‌లో అడిగినా ఇంగ్లిష్‌లోనే సమాధానాలు చెప్పాలని లేదు. ఒకవేళ ఆంగ్లం అభ్యర్థికి సౌకర్యంగా లేకపోతే.. తెలుగులో సమాధానం చెప్పొచ్చు. అంతేకాని వచ్చీరాని భాషలో మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. భాష కంటే భావం ముఖ్యం. కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభ్యర్థులు మెరుగుపరుచుకోవాలి. ఇందుకోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అద్దం ముందు నిల్చొని మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయడం.. పత్రికలు, మ్యాగజైన్లు చదవడం.. కోచింగ్ సెంటర్లో తోటి అభ్యర్థులతో చర్చల ద్వారా భాష, భావ వ్యక్తీకరణ మెరుగుపర్చుకోవచ్చు.

* ఇంటర్వ్యూకు ఎలాంటి మానసిక సన్నద్ధత అవసరం?
మానసికంగా ఎలాంటి ఒత్తిడీ లేకుండా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. మానసిక ఒత్తిడి ఉంటే.. సభ్యులు అడిగే ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పి విఫలమవుతాం. అందుకే ఇంటర్వ్యూకు ముందురోజు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి. తద్వారా ఇంటర్వ్యూ రోజు ప్రశాంతంగా సమాధానాలు చెప్పి, విజయం సొంతం చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగారు?
* ఎంబీఏ ఫైనాన్స్ చేశారు కదా..ఆ రంగంలో ఎందుకు స్థిరపడలేదు?
* గ్రూప్- 1 లో ఫెయిల్ అయితే మీ కెరీర్ ప్లానింగ్‌ను ఎలా చేసుకునేవారు?
* జేఎన్‌టీయూలో లెక్చరర్‌గా పనిచేశారు కదా! ఆ వృత్తి బాగుంటుంది కదా? ఎందుకు ఇటువైపు రావాలనుకున్నారు?
* మీ జిల్లా ఆర్థిక వనరుల గురించి చెప్పండి?

...........................

సహజంగా.. సూటిగా.. స్పష్టంగా!!

సూటిగా, స్పష్టంగా మాట్లాడడం.. తెలియని విషయాన్ని తెలియదని నిజాయతీగా ఒప్పుకోవడం.. ఆత్మవిశ్వాసం.. లక్ష్యంపట్ల అవగాహన ఉన్న అభ్యర్థులు గ్రూప్-1 ఇంటర్వ్యూలో విజయం సాధించడం సులువే. ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఆయా బోర్డు సభ్యుల నేపథ్యం తెలుసుకుంటే.. ఊహించని ప్రశ్నలు ఎదురైనా సులువుగా సమాధానాలు చెప్పొచ్చు. ఎందుకంటే... బోర్డు సభ్యులు తమ రంగానికి సంబంధించి అభ్యర్థులను ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు 2009 గ్రూప్-1 విజేత ఆర్.కూర్మనాథ్. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఆర్డీవోగా పనిచేస్తున్న ఆయన్ను సాక్షి ‘‘భవిత’’ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలివే...

* గూప్-1 అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎలా ప్రిపేర్ కావాలో చెప్పండి?
ఇంటర్వ్యూ రూంలో అడుగుపెట్టగానే ముందు బోర్డు సభ్యులు.. అభ్యర్థి నడక, నడత, ప్రవర్తన పరిశీలిస్తారు. ఒక అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది గమనిస్తారు. ఇంటర్వ్యూలో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. అందుకోసం ఆయా సంఘటనలు, పరిణామాలపై పత్రికల్లో వచ్చే వ్యాసాలు చదవడం ద్వారా అవగాహన పెంచుకోవాలి.

అభ్యర్థి కుటుంబ, వ్యక్తిగత, విద్యా నేపథ్యం, ప్రాంతం, చదువుకున్న కాలేజీ ప్రాముఖ్యత, దాని ప్రత్యేకతపై ప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూ బోర్డులో కనీసం పదిమంది వరకు ఉండవచ్చు. వారిలో విభిన్న రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. ఉన్నత విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు వంటివారు ఉంటారు. వీరు తమ రంగానికి సంబంధించి అభ్యర్థి ఊహించని ప్రశ్నలు కూడా అడగొచ్చు. మెయిన్స్‌లో ఎంచుకున్న ఆప్షనల్స్‌కు సంబంధించి ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. అందుకే వీటిని ఒకసారి రివిజన్ చేసుకుంటే మంచిది.

ఏ ప్రశ్న అడిగినా.. సమాధానం తెలిస్తేనే చెప్పాలి. తెలియకపోతే తెలియదనాలి. రాకపోయినా వచ్చినట్లు నటిస్తే మాత్రం ప్రతికూల అభిప్రాయానికి గురవుతారు. ఇంటర్వ్యూ సమయంలో కంగారుపడకూడదు. ఎలాంటి ఆందోళన లేకుండా.. శాంతంగా, నెమ్మదిగా ఉండాలి. ఒత్తిడికిలోనైతే తెలిసిన విషయాన్ని కూడా చెప్పలేరు. ఉదయం వేళల్లో యోగా అలవాటు ఉన్నవారు దాన్ని ఆచరించి ఇంటర్వ్యూకు హాజరైతే ఫలితం సానుకూలంగా ఉంటుంది.

*ఇంటర్వ్యూలో ప్రధానంగా ఏఏ అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు?

అభ్యర్థి నేపథ్యం.. కాలేజీస్థాయిలో చదువుకున్న గ్రూపు, సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు. బోర్డు సభ్యులు ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే దానికి సంబంధించి అనుబంధ ప్రశ్న.. అదే నేపథ్యంతో మరిన్ని లోతైన ప్రశ్నలు అడగొచ్చు. అదేవిధంగా అభ్యర్థిఏ ప్రాంతం వారో.. జిల్లాకు ఆ పేరెలా వచ్చింది? దాని నేపథ్యం వంటి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థికి కేవలం సబ్జెక్టు నాలెడ్జ్ కాకుండా.. సామాజిక అంశాలు, సమాజంలో జరుగుతున్న మార్పులు, అంతర్జాతీయ సంఘటనలు, పలు దేశాలు.. వాటికి సంబంధించిన పాలనా పరిణామాలపై ప్రశ్నలు అడగొచ్చు.

వచ్చే ఏడాది జనవరి 4న ఇంటర్వ్యూ.. కాబట్టి ఈలోగా జరిగిన అనేక సంఘటనలకు సంబంధించి ప్రశ్నలు ఎదురవొచ్చు. ఉదాహరణకు... గడాఫీ పాలన? వాల్‌స్ట్రీట్ ఆక్రమణ, పదుల సంఖ్యలో దేశాలను దాటిన ఉద్యమ నేపథ్యం? కారణాలు? ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి నిర్ణయం? ఇలా పలు అంశాలపై ప్రశ్నలు అడగొచ్చు.

* ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలు ఎలా చెబితే మేలు?
అభ్యర్థిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. సమాధానాలు సహజంగా, స్పష్టంగా, సూటిగా చెప్పాలి. అలా చేస్తే అభ్యర్థిలో చురుకుదనం బోర్డు సభ్యులను ఆకట్టుకుంటుంది. చెప్పే సమాధానాలు స్పష్టంగా.. బోర్డు సభ్యులందరికీ వినిపించేలా ఉండాలి. చాలామంది మొదటిసారి ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు అనవసర ఆందోళనకు గురై అవకాశం పోగొట్టుకుంటారు. అందుకే ఆందోళనపడకూడదు. నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే సమాధానాలు సులువుగా, సరళంగా చెప్పొచ్చు. నన్ను బోర్డు సభ్యులు మొత్తం 20 ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియదని చెప్పాను.

* ఏఏ నైపుణ్యాలు తప్పనిసరిగా మెరుగుపర్చుకోవాలి?
భాష స్పష్టంగా లేకపోతే ఇంటర్వ్యూ మార్కుల్లో వెనుకబడిపోతారు. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికైనా మీరు అనుకున్న విభాగానికి సంబంధించిన పోస్టు రాకపోవచ్చు. ఇంటర్వ్యూలో అభ్యర్థి మాట్లాడే మాటలు, వాడే భాష ఎంత అర్థవంతంగా ఉంటే.. అంతగా సానుకూల ఫలితం సాధింవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు తెలుగు పత్రికలు చదివితే సరిపోతుంది.

పత్రికల్లో వాడే భాషను ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలు చెప్పడానికి ఉపయోగిస్తే సత్ఫలితాలు వస్తాయి. ఇంటర్వ్యూకి ఎంపికైన మిగతా అభ్యర్థులతో చర్చించడం, మాక్ ఇంటర్వ్యూలు, బృంద చర్చల్లో పాల్గొనడం వంటివి చేయాలి. ఉదాహరణకు మీ గురించి చెప్పండి? అని సభ్యులు అడిగితే.. గొప్పలు చెప్పుకోకుండా.. మీ ఆసక్తి, లక్ష్యాల గురించి వివరించాలి. అప్పుడే అభ్యర్థిపై బోర్డు సభ్యులకు సదభిప్రాయం కలుగుతుంది.

* ఇంటర్వ్యూకు ఎలాంటి మానసిక సన్నద్ధత అవసరం?
మానసికంగా సంసిద్ధత చాలా అవసరం. ఉద్యోగం మీకే వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో హాజరుకావాలి. మీ బలాలను గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఇది ఇంటర్వ్యూ సమయంలో ధైర్యాన్నిస్తుంది. ఎక్కడా బెరుకు, తొందరపాటు, గందరగోళానికి గురికాకూడదు.

* ఇంటర్వ్యూ ఎంతసేపు జరిగింది?
కాలేజ్ నుంచి గ్రూప్-1 ఆప్షనల్ వరకు.. నాది హిస్టరీ బ్యాక్‌గ్రౌండ్. అందుకే అనుకుంటా బోర్డు సభ్యులు ఎక్కువగా చరిత్రకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. మొత్తం పది మంది ఇంటర్వ్యూ చేశారు. వారంతా వివిధ రంగాలకు చెందిన నిపుణులు. వాస్తవానికి ఇంటర్వ్యూ సమయంలో బోర్డు సభ్యులు అభ్యర్థికి సంబంధించిన అకడమిక్ నేపథ్యంపై తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. బీటెక్ నేపథ్యం ఉన్నవాళ్లకైతే.. ప్రస్తుతం ఇంజనీరింగ్ రంగంలో మార్పులపై ప్రశ్నిస్తారు.

ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏఏ ప్రశ్నలు అడిగారు?
* ఉగ్రవాద వ్యతిరేకం దినం ఎప్పుడు? దీన్ని ఎందుకు జరుపుతారు? నేపథ్యం ఏంటి?
ూ }-Ëంకలో కొన్ని జాతులు తమిళనాడులో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నాయి కదా? అక్కడ ప్రత్యేక రాష్ట్రం అవసరమా?
ూ ఎల్‌టీటీఈ ప్రభాకరన్ చనిపోయాడని నమ్ముతున్నారా?
* మీరు వైజాగ్‌లోని ఏవీఎన్ కాలేజీలో చదువుకున్నారని చెప్పారు కదా? ఆ కాలేజీలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు?
* గూప్-1లో మీ ప్రాధాన్యం డిప్యూటీ కలెక్టర్ అని పేర్కొన్నారు. దీన్నే ఎందుకు ఎంచుకున్నారు? కారణం?
ూ ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడైనా ఆర్డీవోగా పోస్టింగ్ వస్తే ఎలా పనిచేస్తారు? ఆ ప్రాంతం అభివృద్ధికి మీ వ్యూహం?

.......................
ఇంటర్వ్యూ అంటే వ్యక్తిత్వ పరీక్షే !
గ్రూప్-1 ఇంటర్వ్యూ.. అభ్యర్థి వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసాన్ని పరీక్ష. ఇంటర్వ్యూకి అర్హత సాధించారంటే సగం విజయం సాధించినట్టే. ఉద్యోగానికి ఇంకా ఆమడదూరంలో ఉన్నామని భావించి.. సాధించగలను అనే భావనతో ఇంటర్వ్యూకి వెళ్తే.. విజేతగా తిరిగి రావచ్చు. విద్యా, కుటుంబం, జిల్లా నేపథ్యాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన ఉంటే.. గ్రూప్-1 విజేత కావచ్చంటున్నారు కె.సురేష్. 2009 గ్రూప్-1కు ఎంపికై ప్రస్తుతం గూడూరు డీఎస్పీగా పని చేస్తున్న ఆయన్ను సాక్షి ‘‘భవిత’’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలివే...

* మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది?
నా ఇంటర్వ్యూ పూర్తిగా స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. అప్పటికే నేను డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాను. దాంతో ఇంటర్వ్యూ అంటే పెద్దగా ఆందోళన చెందలేదు. అయినా లోపలికి వెళ్లగానే బోర్డు సభ్యులు వాతావరణాన్ని తేలికపరిచేందుకు అభ్యర్థిని ముందుగా మర్యాదపూర్వకంగా పలకరిస్తారు. అభ్యర్థిలో భయం పోగొట్టడానికి తేలికైన ప్రశ్నలు వేస్తారు. ఆ తర్వాతే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. నన్ను 20 నిమిషాల పాటు వ్యక్తిగత, విద్యా, ఉద్యోగ నేపథ్యం... ఆధారంగా ప్రశ్నలు అడిగారు.

* ఇంటర్వ్యూకు ఎలా సిద్ధమవాలి?
ఇంటర్వ్యూ అంటే... చాలామంది తాము ప్రిపేర్‌కాలేదని భయపడుతుంటారు. అసలు ఇంటర్వ్యూ అనేది నాలెడ్జ్‌కి పరీక్షకాదు. ఎందుకంటే.. ఆ పరీక్షలో విజయం సాధిస్తేనే ఇంటర్వ్యూకు పిలుస్తారు. అందుకే ఇంటర్వ్యూ అనేది వ్యక్తిత్వ పరీక్ష అని చెప్పొచ్చు. అభ్యర్థిలో ఆత్మ విశ్వాసం, మొహంలో చిరునవ్వు చాలాముఖ్యం. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులను మన వ్యక్తిత్వం, ఆలోచనలు, ప్రవర్తనతో ఆకట్టుకుంటే సరిపోతుంది. అభ్యర్థి చెప్పే సమాధానాల కంటే... మంచి ప్రవర్తన, నడక, నడత చాలా ముఖ్యం.

* ఏఏ అంశాలపై లోతుగా ప్రశ్నలడుగుతారు?
ఇంటర్వ్యూకి వెళ్లగానే ముందు చదువు, వ్యక్తిగత, జిల్లా నేపథ్యం గురించి కచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత గ్రూప్-1 రాయడానికి కారణం వివరించమంటారు. తద్వారా అభ్యర్థి ఆశయం, లక్ష్యం, ఆలోచన విధానాన్ని తెలుసుకుంటారు. 20 నిమిషాలు పాటు జరిగే ఇంటర్వ్యూలో.. సుమారు 7 నుంచి 8 నిమిషాల వరకు వీటిపైనే ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని ప్రశ్నించేలా కచ్చితంగా ఏదొక ప్రశ్న, దానికి అనుబంధ ప్రశ్నలు ఉంటాయి.

అందుకే ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు గత నెల రోజుల్లో జరిగిన అన్ని పరిణామాలపైనా ప్రిపేర్ అయి వెళ్లాలి. అదేవిధంగా డిగ్రీ, పీజీలో చదివిన సబ్జెక్టుపై మూడు లేదా నాలుగు ప్రశ్నలు అడుగుతారు. ఎప్పటికప్పుడు పత్రికలు చదవడంతోపాటు వివిధ వార పత్రికలు చదివి ఇంటర్వ్యూకి హాజరైతే మంచి ఫలితం సాధించవచ్చు.

* భావ వ్యక్తీకరణను ఎలా మెరుగుపర్చుకోవాలి?
సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సమాధానాలు ఉండాలి. ప్రశ్నలు ఇంగ్లిష్‌లో అడిగారని అభ్యర్థులు కూడా ఆ భాషపై పట్టులేకపోయినా మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. పట్టున్న భాషలోనే మాట్లాడాలి. చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేరైనా తీరా బోర్డు సభ్యుల ముందు స్పష్టంగా మాట్లాడలేక ఆందోళనలో అన్నీ మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకు సాటి అభ్యర్థులతో తరచూ మాట్లాడుతుండడం.. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయడం.. అన్నింటికిమించి ఆత్మవిశ్వాసం.. ఇంటర్వ్యూలో విజయం సాధించగలననే ధీమా ఉండాలి.

* మీ విద్యా నేపథ్యం?
మాది నల్గొండ జిల్లా కోదాడలోని తెల్లబల్లి ప్రాంతం. బీఈడీ పూర్తిచేశాక ఎంఏ ఇంగ్లిష్, తెలుగు లిటరేచర్‌లో పీజీ చదివాను.

* ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలు చెప్పడంలో మెళకువలు?
సూటిగా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాలి. బాగా ఆలోచించి మాట్లాడాలి.

* ఇంటర్వ్యూలో తెలియని ప్రశ్నలు అడిగితే?
ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకూడదు. బోర్డు సభ్యులు తనకు తెలియని ప్రశ్నలు అడుగుతారేమో, సమాధానాలు చెప్పలేనేమో అనే భయం అస్సలు ఉండకూడదు. మనంపై మనకు నమ్మకముంటే...విజయం సాధ్యమే. నిజాయితీగా ఉండాలి. తెలియని ప్రశ్నలడిగితే వినయంగా తెలియదని చెప్పాలి.

2009 గ్రూప్-1 విజేత కె.సురేష్

గ్రూప్-1 ఇంటర్వ్యూలో
మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు?
* ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధికి మధ్య వ్యత్యాసం వివరించండి?
* మానవ వనరులను అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి?
* ఐర్లాండ్ రివల్యూషన్ గురించి తెలుసా?
* గ్రేట్ బ్రిటన్ అని వేటిని అంటారు?
* మహిళలు పురుషులకన్నా ఎందుకు బాగా రాణిస్తున్నారు? కారణం?
* ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మీరు గ్రూప్-1 ఎందుకు రాశారు?
* రెవెన్యూ శాఖపై ప్రజల్లో ఎందుకంత చెడ్డ పేరు ఉంది?
* శ్రీనాథుడికి, పోతనకి మధ్య మూడు తేడాలు చెప్పండి?
* కంద, శేష పద్యాల మధ్య తేడా ?
* తత్సమం, తద్భావం అంటే ఏంటి? వీటి మధ్య తేడా చెప్పండి?
* దేశంలో టెలికం కంపెనీ ఆపరేటర్ల పేర్లు చెప్పగలరా?

0 comments:

Post a Comment