Tuesday

పాక్ సీఈసీగా భారత సంతతి వ్యక్తి సుప్రీం మాజీ జడ్జి ఫక్రుద్దీన్ నియామకం...


భారత సంతతి వ్యక్తి, పాకిస్థాన్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఫక్రుద్దీన్ జీ ఇబ్రహీం చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ)గా నియామకమయ్యారు. కొత్త సీఈసీగా ఫక్రుద్దీన్‌ను నియమించాలని సోమవారం మత వ్యవహారాల మంత్రి ఖుర్షీద్ షా అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంటు కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని వారాల పాటు తర్జనభర్జన పడిన అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ప్రతిపక్ష పార్టీలు సీఈసీగా ఆయనవైపు మొగ్గు చూపాయి. ప్రధాన ప్రతిపక్షం పీఎంఎన్-ఎల్ మాత్రం వ్యతిరేకించగా.. పీపీపీకి చెందిన మెజార్టీ సభ్యులు ఫక్రుద్దీన్ పేరును ప్రతిపాదించారు.

గత మార్చి 24 నుంచి సీఈసీ పదవి ఖాళీగా ఉంది. ఫక్రుద్దీన్ అనుభవం గల అధికారి, నిష్పాక్షికమైన వ్యక్తి అని మంత్రి ఖుర్షీద్ షా కొనియాడారు. 1928, ఫిబ్రవరి 12న గుజరాత్‌లోని ధ్రోల్ గ్రామంలో జన్మించిన ఫక్రుద్దీన్‌కు గాంధీ బోధనలంటే ఎంతో ఇష్టం. 1949లో గుజరాత్ విద్యాపీఠంలో లా డిగ్రీ పూర్తి చేశారు. ఆయన మహాత్మా గాంధీ అహింసా, శాంతి బోధనలను నమ్ముతారని మంగళవారం డాన్ పత్రిక పేర్కొంది. కాగా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో దేశంలో సాధారణ ఎన్నికలను నిర్వహించడం ఫక్రుద్దీన్‌కు కత్తిమీద సామే.

0 comments:

Post a Comment