Tuesday

లష్కరే తాయిబా.. నెంబర్ వన్ అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ మాజీ సీఐఏ అధికారి వెల్లడి పాక్‌లో స్వేచ్ఛగా కార్యకలాపాలు...


అల్ కాయిదా వెనుకంజతో.. లష్కరే తాయిబా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా రూపుదిద్దుకుందని మాజీ సీఐఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 9/11 దాడుల తర్వాత ముంబై దాడులే అత్యంత కీలకమైనవనీ.. ఆ దాడులు ఎవరూ ఊహించని రీతిలో జరిగాయని వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ సీనియర్ విశ్లేషకులు బ్రూస్ రీడెల్ తెలిపారు. ఒకప్పుడు కేవలం భారత్ లక్ష్యంగా పనిచేసే లష్కరే తాయిబా.. ముంబయి దాడులతో అల్ కాయిదా శత్రువులను, భారతదేశాన్ని, ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసిన ఇస్లామిక్ జిహాదీ సంస్థగా రూపుదిద్దుకుందని ఆయన 'ద డైలీ బీస్ట్' అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో తెలిపారు.

ఇటీవలి కాలంలో ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి అబు జుందాల్ అరెస్ట్ అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటన అని రీడెల్ తెలిపారు. అబూ జుందాల్‌ను సౌదీ అరేబియా అరె స్ట్ చేయడం కూడా ఒక కీలక పరిణామమని రీడెల్ అభిప్రాయపడ్డారు. సౌదీ, పాకిస్థాన్ రెండింటికీ మంచి సంబంధాలున్నాయని.. లష్కరేకు అందే నిధులు చాలా వరకూ సౌదీ నుంచే వస్తున్నాయని తెలిపారు. ఒకవేళ సౌదీ అరేబియా, లష్కరే తాయిబాల మధ్య సంబంధాలు చెడి ఉంటే.. లష్కరేకు నిధుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన వివరించారు. బయట దేశాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా.. లష్కరే ఇప్పటికీ పాకిస్థాన్‌లో మాత్రం చాలా స్వేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోందనీ.. ఈ సంస్థకు ఐఎస్ఐ, పాకిస్థాన్ సైన్యంతో మంచి సంబంధాలున్నాయని వెల్లడించారు.

ముంబై దాడుల వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ హస్తం ఉన్న విషయాన్ని జుందాల్ ఒప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన తలపై 10 మిలియన్ డాలర్ల బహుమతి కలిగిన హఫీజ్ సయీద్ చాలా తరచుగా పాకిస్థాన్ టీవీలలో, అమెరికాకు వ్యతిరేకంగా జరిగే ర్యాలీలలో కనిపిస్తుంటారని ఆయన వెల్లడించారు. లష్కరే తాయిబాకు దక్షిణ ఆసియా, యూరోప్, పర్షియన్ గల్ఫ్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలో కేంద్రాలున్నాయని ప్రకటించారు. అల్ కాయిదా వెనుకంజతో ఇప్పుడు పాకిస్థాన్ అండ ఉన్న లష్కరే తాయిబా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా రూపుదిద్దుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.   

0 comments:

Post a Comment