Friday

యువ ఆవిష్కరణలు...!

కొండల్ని పిండి చేయగల ఆత్మవిశ్వాసం యువత సొంతం..
సవాళ్లు ఎలాంటివైనా విజయం సాధించగల సత్తా వీరిది.
శాస్త్ర ప్రపంచంలోనూ ఈ విషయం నిరూపితమైంది..
పదిహేడేళ్ల యువకుడు పరం జగ్గి వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓ వినూత్న పరికరాన్ని ఆవిష్కరించి ఫోర్బ్స్ జాబితాకు ఎక్కితే... 
కిటికీలనే ఏసీలుగా మార్చేయగల రసాయనాన్ని తయారుచేసిన సరబ్‌జీత్ బెనర్జీ ప్రఖ్యాత ఎంఐటీటీఆర్-35 అవార్డు దక్కించుకున్నాడు.
భారతీయ సంతతి యువశాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఇవిగో...

కిటికీ అద్దాలే ఏసీలు
ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండాలని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి? కానీ ఇలా ఉండాలంటే ఫ్యాన్లూ, ఏసీలను వాడాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మన ఇళ్లల్లో ఉండే కిటికీ అద్దాలతోనే గది లోపలి ఉష్ణోగ్రతలను నియంత్రించగలిగితే..?? అద్భుతం సాధ్యమవుతుంది. బఫెలో స్టేట్ యూనివర్శిటీ (న్యూయార్క్) యువ శాస్త్రవేత్త సరబ్‌జీత్ బెనర్జీ ఇలాంటి అద్భుత ఆవిష్కరణ చేశాడు. వనాడియం ఆక్సైడ్ అనే పదార్థాన్ని అద్దాలపై పూతగా పూయడం ద్వారా ఇది సాధ్యమేనని బెనర్జీ నిరూపించాడు. ఉష్ణోగ్రతతో పదార్థస్థితి మారిపోతుందన్నది మనకు తెలిసిన విషయమే. నీటిని ఉదాహరణగా తీసుకుంటే ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు అది ఘనీభవిస్తుంది. 


ఇదేతరహాలో వనాడియం ఆక్సైడ్‌లోని స్ఫటికాలు సుమారు 67 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒక ప్రత్యేక లక్షణం కనబరుస్తున్నాయి. అప్పటివరకూ పరారుణ కాంతి (వేడి)ని సులువుగా ప్రసారం చేయగలిగిన ఈ పదార్థం ఆ ఉష్ణోగ్రత తరువాత మాత్రం తిప్పికొడుతున్నట్లు బెనర్జీ గుర్తించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న బెనర్జీ వనాడియం ఆక్సైడ్ నానోట్యూబులు, టంగ్‌స్టన్‌ను కలపడం ద్వారా ఈ కీలక ఉష్ణోగ్రతను మరింత తగ్గించగలిగారు. దీంతో ఆ పదార్థం తక్కువ ఉష్ణోగ్రతల్లోనే వేడిని తిప్పికొట్టేలా చేయగలిగారు. అంతేకాకుండా విద్యుత్ ప్రవాహం ద్వారా వేర్వేరు ఉష్ణోగ్రత స్థాయుల్లో పదార్థస్థితిని మార్చవచ్చునని కూడా తెలిసింది.


అంటే మండువేసవిలో ఉక్కపోతగా అనిపిస్తున్నప్పుడు ఒక్క స్విచ్ వేస్తే చాలు... గదికిటికీల అద్దాలు వేడిని స్వీకరించకుండా వెనక్కు పంపడం మొదలు పెడతాయమన్నమాట. తద్వారా గదిలోపలి ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా... ఏసీ బిల్లుల్నీ ఆదా చేయవచ్చు. వినూత్న లక్షణమున్న వనాడియం ఆక్సైడ్‌ను వాడుకునేందుకు భారత ఉక్కు దిగ్గజం టాటాస్టీల్స్ కూడా ఆసక్తి చూపుతోంది. పైకప్పుల కోసం వాడే ఇనుప రేకులకు ఈ రసాయనాన్ని పూసి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.

గొట్టం బిగిస్తే కార్బన్ డై ఆక్సైడ్ మాయం!

వాహన కాలుష్యం గురించి మనం తరచూ వింటూంటాం. వాహనాలు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్, నైట్రస్, ఆక్సైడ్, సల్ఫర్ వంటి విషవాయువుల వల్ల భూగోళం వేడెక్కుతోందనీ మనకు తెలుసు. ఈ వాయువుల మోతాదును వీలైనంత వరకూ తగ్గించేందుకు ప్రయత్నాలూ ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఆస్టిన్ కాలేజ్ (అమెరికా) చదువుతున్న ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఈ చిక్కుసమస్యకు సింపుల్ పరిష్కారాన్ని ఆవిష్కరించాడు. భారతీయ సంతతి విద్యార్థి ‘పరం జగ్గి’ తయారుచేసిన ఓ పరికరాన్ని వాహనాల టెయిల్‌పైపుల (పొగవెదజల్లే గొట్టాలు)కు బిగించుకుంటే చాలు... బయటకొచ్చే కార్బన్ డై ఆక్సైడ్ ఆక్సిజన్‌గా మారిపోతుంది!

నాచుతో నయా ట్రిక్!

కొన్నిరకాల నాచులతో కార్బన్ డై ఆక్సైడ్‌ను ఇంధనంగా మార్చుకోవచ్చునన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. బ్లూగ్రీన్ రకం నాచుతో బయోడీజిల్‌ను తయారుచేసేందుకూ ప్రయత్నాలు జరు గుతున్నాయి. ‘పరం జగ్గి’ పరికరం కూడా ఇదే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. కాకపోతే కార్లు, బస్సుల వంటి వాహనాలకూ వర్తింపజేయడం విశేషం. ‘పరం జగ్గి’ అభివృద్ధి చేసిన పరికరం ఓ గాజు గొట్టం మాదిరిగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ వాయవు ఈ గొట్టం ద్వారా ప్రవహించినప్పుడు అందులోని నాచు పీల్చేసుకుంటుంది. కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఈ వాయువులను శక్తిగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో ఆక్సిజన్ వాయువులు వెలువడతాయి

0 comments:

Post a Comment