Wednesday

సెల్ వచ్చింది... మతిమరుపు పెంచింది...!


మన జ్ఞాపకశక్తిని మనమే తగ్గించుకుంటున్నామా? అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో కంప్యూటర్లు, ఇంటర్‌నెట్. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనం మన మెదడుకు పనిపెట్టడం దాదాపు మానేశాము. మనకు తెలిసి మన మెదడులో నిక్షిస్తమైన సమాచారమైనా సరే మనం నెట్‌బ్రౌజ్ చేసి నిర్ధారించుకుంటున్నాము. సెల్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో మనకు అత్యంత సన్నిహితుల ఫోన్ నంబర్లను కూడా సెల్‌లో రికార్డు చేసుకుంటున్నామే తప్ప మన మెదడు పొరల్లో దాచుకోవడం మానేశాము. మనకు కావలసిన వారి బర్త్‌డేలు, మ్యారేజ్ యానివర్సరీలు వంటివి సెల్‌ఫోన్ గుర్తు చేయవలసిందే తప్ప మనకు మనంగా గుర్తుపెట్టుకోవడం లేదు.

అంతెందుకు ఏ రోజు కారోజు మనం చేయవలసిన విధులను కూడా సెల్‌ఫోన్ గుర్తుచేయవలసిందే! ఏ వానకు తడిసో, నీళ్లలో పడో సెల్‌ఫోన్ పాడైపోయిందంటే ఇక పాత ఫోన్ నెంబర్లన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లే. సెల్‌పైనే ఆధారపడుతూ పోతే కొన్ని రోజులకు మెదడు మొద్దుబారిపోయి మనకు మనంగా గుర్తు పెట్టుకునేది ఏదీ ఉండదేమో! ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా మన మెదడుకు పని కల్పించాల్సి ఉంటుంది. మనకు అత్యంత ఆప్తుల ఫోన్ నెంబర్లను ఒక డైరీలో రాసుకుని మననం చేసుకోవడం వల్ల ఆ నెంబర్లు మన మెదడులో రికార్డయి పోతాయి. ఎన్ని సంవత్సరాలైనా అవి చెరిగిపోవు.

అలాగే ముఖ్యమైన వారి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల వివరాలను ఒక డైరీలో నోట్ చేసుకుని రోజూ ఒకసారి చెక్ చేసుకుంటుంటే అవి ఎప్పుడు వచ్చేది మనకు గుర్తుండిపోతుంది. అలాగే రేపేం చేయాలో ఆలోచించి జ్ఞాపకం పెట్టుకోవడం ఒక సమస్య కానే కాదు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటివి లేని రోజుల్లో చురుగ్గా పనిచేసిన మన జ్ఞాపకశక్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత చురుగ్గా మారాలే తప్ప మొద్దుబారిపోకూడదు. అందుకే మన మెదడుకు రోజూ పనికల్పిద్దాం అంటున్నారు వైద్యులు.

0 comments:

Post a Comment