Tuesday

” ఆధ్యాత్మికత- శ్రీ జిడ్డు క్రిష్ణమూర్తి & శ్రీ యు.జి.క్రిష్ణమూర్తిగార్లు ”


శ్రీ జి.కే.గారి మాటల్లో, ” సత్యం అనేది మార్గంలేని ఒక ప్రదేశం. సత్యాన్ని గురించి, ఎవరూ, ఎవరికీ బోధించలేరు. సత్యాన్ని గ్రహించటానికి ఆలోచన అవసరంలేదు. ఉదా:- ఒక ఇంటిని కళ్ళతో చూడటానికి, ఇది ఒక ఇళ్ళు అనే ఆలోచన అవసరం లేదు. సత్యం తెలుసుకోవటం వలన, మానవుడు తన కష్టాలకు చరమగీతం పాడవచ్చు. సత్యం స్వేఛ్చను ప్రసాదిస్తుంది. మనిషి తన ప్రయత్నం ద్వారా సత్యాన్ని కనుగొనలేడు. సత్యాన్ని తెలుసుకోవటానికి మనిషిలోని సెల్ఫ్ మారాలి, లేదా పరిణామం చెందాలి. “సెల్ఫ్ అనేది ఆలోచనలతో తయారయింది. ఆలోచనలను దాటినపుడే సత్యం తెలుస్తుంది. ”


నా అభిప్రాయాలు:–
సత్యం అనేది మార్గంలేని ఒక ప్రదేశం అని శ్రీ జి.కె. అన్నారు. చాలా గొప్పగా చెప్పారు. తార్కికంగా ఆలోచిద్దాం: “సత్యం ప్రదేశం మార్గం లేనిది అనే మూడు పదాలు వాక్యంలో వున్నాయి. సత్యం అనేది భౌతికమైనది కాదు అని మనందరికీ తెలిసినదే. అంటే, ఇది ఆధ్యాత్మికమైనది. అయితే, సత్యం అనే ఒక ప్రదేశం వున్నది అని ఆయన మాటల్లో తెలుస్తున్నది. అయితే, ప్రదేశం తన దృష్టికంటే ఎత్తులోనా, క్రిందనా, లోతులోనా అనే ప్రశ్నలు వస్తాయ్. సత్యం అనేది భౌతికమైనది కాదు కాబట్టి, “ప్రదేశాన్ని, ” స్థితి అని చెప్పుకోవచ్చు. అంటే, “సత్యమనే స్థితి అని చెప్పుకోవచ్చు. సత్యమన్నది ఆధ్యాత్మికమైనది అన్నప్పుడు, ఇది మానసికమైనది అని చెప్పుకోవచ్చును. సత్యమనే స్థితి, తను రోజూ వుంటున్న లౌకిక స్థితి కంటే భిన్నమైనది అయివుండాలి. లేకుంటే, స్థితిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరంలేదుకదా? సరే, స్థితి ఎత్తులో వుందా, క్రింద వున్నదా, లోతుల్లో వున్నదా? అనేవి ప్రశ్నలు. మనిషిలో షట్-చక్రాలు లేదా శక్తి కేంద్రాలు వున్నాయని మన వైదికశాస్త్రాలు చెబుతున్నాయి. అందులో, అన్నిటికన్నా పైన వున్నది సహస్రార చక్రం; అన్నిటికంటే క్రింద వున్నది మూలాధార చక్రం; మధ్యలో, అంటే గుండె వుండే హృదయ స్థానంలో వుండేది అనాహిత చక్రం. షట్-చక్రాలు శక్తి కేంద్రాలుగా మనం అర్ధం చేసుకోవాలి. మరి, “సత్య స్థితి అనేది మూడు చక్రాలలో ఎక్కడన్నా వున్నదా? లేదా షట్-చక్రాలలో వున్నదా? లేదా వీటిలో ఒక చక్రంలోనే వున్నదా? అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. ఎందుకంటే, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, సత్య స్థితి వీటిలో ఒక్క చోటకానీ, అన్ని చోట్లగానీ వుండివుండాలి.


శ్రీ జి.కె.గారు సత్యమనే ప్రదేశం మార్గంలేని ప్రదేశం అని అన్నారు. ఒక ప్రదేశానికి, లేదా ఒక స్థితికి వెళ్ళటానికి లేదా ప్రవేశించటానికి మార్గం లేదు అంటే, ప్రదేశం, లేదా స్థితి గుండ్రంగా వుండివుండాలి. అర్ధం, స్థితిని ఎటువైపునుంచి అయినా ప్రవేశించవచ్చని. కాబట్టి, ప్రదేశం లేదా, స్థితి అనేది ఒకటి వున్నది అనేది మనకు తెలుసు; అయితే, స్థితి మనలో ఎక్కడ వున్నది? ఎట్లా ప్రవేశించాలి? అనేవే ఇంకా తెలియని విషయాలు. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాలి. శ్రీ జి.కె.గారు సత్యాన్ని గురించి తమ ఉపన్యాసాల్లో చెప్పినప్పుడు, సత్యాన్ని గురించి వారు, “సహజ స్థితి, లేదా సమాధి స్థితి లోకి పోకముందు చెప్పారా? లేక, సహజ స్థితిలోనికి వెళ్ళివచ్చిన తరువాత చెప్పారా? అనేది ముఖ్యమైన విషయం. సహజ స్థితిలోకి పొకముందే చెప్పారనుకుంటే, “సత్యమనేది ఒకటి వున్నదని, దానిని తెలుసుకోవాలి అన్న ఆలోచన ఆయనకు వున్నట్లే. ప్రతిపాదన, వాదన శ్రీ యు.జి.క్రిష్ణమూర్తిగారి బోధనలలోకూడా ప్రతిబింబిస్తూ వుంటాయి. అయితే, శ్రీ యు.జి.కె.గారు మనిషి పరిణామం చెందటానికి అతనిలో ప్రత్యేకంగా ఏమీలేదు అని చెప్పటం జరిగింది. మరొకవైపు ఆలోచనలద్వారానే మనం, మనయొక్క సహజస్థితిని గురించి తెలుసుకోగలము అని చెప్పటం జరిగింది. రెండు విషయాలను కలిపి పరిశీలించి, విశ్లేషిస్తే, సత్యాన్ని తెలుసుకోవటానికి, లేదా సహజ స్థితిని తెలుసుకోవటానికి మనిషియొక్క ఆలోచనలలో కనిపించే పరిణితినే, అతనిలో కలిగిన పరిణామంగా చెప్పవచ్చు. అయితే, “సత్యాన్ని గ్రహించటానికి ఆలోచన అవసరంలేదు అని అన్నారు. ఇది కొంతవరకు నిజం. వాక్యం, ఆయన సత్యాన్ని తెలుసుకున్న తరువాతనే అనగలరు. ఎందుకంటే, మనిషిలోని స్పృహ/తెలివి ఆలోచనలతో కూడిన జ్ఞానం. శ్రీ రమణ మహర్షికూడా, “నేను ఎవరు?” అనే ప్రశ్నను నిరంతరంగా వేసుకుంటూ, చివరికి సత్యాన్ని తెలుసుకోగలిగారుట. సత్యాన్ని తెలుసుకోవటానికి, మన ఋషులు ఎనిమిది నియమాలు తెలిపారు. అవి:- యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధిస్థితి. మొదటి ఐదు స్థితులందు ఆలోచనలు ఉంటూనే, మనస్సు ముందుకు పోతూవుంటుంది. ధారణ, ధ్యాన స్థితులందు ఒకే విషయమందు మనస్సు లగ్నమై వుంటుంది. ఇక్కడ ఆలోచనలకు తావులేదు. విషయ స్పృహ ఒకింత వుంటుంది. ఆఖరి స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే సత్యాన్ని లేదా సత్య-స్థితిని పొందవచ్చు, లేదా సత్య స్థితిలోకి ప్రవేశించవచ్చు. అందుకే, శ్రీ జ్.కె.గారు ఆలోచనల స్థితిని దాటినప్పుడే సత్యం తెలుస్తుంది అని అన్నారు. అయితే, ఎన్నో పర్యాయాలు, సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే సత్యాన్ని తెలుసుకోవటం జరుగవచ్చు; లేదా ఒక పర్యాయంలోనే కూడా తెలుసుకోవటం జరుగవచ్చు.
శ్రీ జి.కె. “సత్యాన్ని గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు అని అన్నారు. ఇది చాలావరకు నిజమే. ఉదా:- నేను ఒక మామిడి పండుని తిని, తియ్యగా వున్నది అని అందరితో చెప్పాననుకోండి. తియ్యగా అనేదాన్ని నేను వర్ణించలేను. కాబట్టి, అందరూ మామిడి పండుని తిని, వారికిగూడా తియ్యదనం యొక్క అనుభవం కలిగినప్పుడు, అవును, మామిడి పండు తియ్యగా వున్నది అని చెప్పగలరు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. సమాధి స్థితిలో సత్యాన్ని గురించి తెలుసుకోగలరు అని చెప్పినప్పుడు, ” తెలుసుకోగలుగుతున్నారు అని అంటే, స్థితిలో ఆలోచనలు ఉన్నట్లేగదా? అనే ప్రశ్న వస్తుంది. విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. జాగ్రుతావస్థలో వున్నప్పుడు, ఒక వ్యక్తికి సత్యాన్ని గురించి అనేక ఆలోచనలు వున్నాయనుకోండి. అతను నిద్రావస్థలో వున్నప్పుడు, అవే ఆలోచనలు తక్కువ తీవ్రతతో వుంటాయి. కానీ, మెదడులోని నాడీ వ్యవస్థలో పదిలమై ఉంటాయి. సుషుప్తావస్థలో ఆలోచనలు నాడీవ్యవస్థలో లోతుగా భద్రపరచిబడివున్నా, వ్యక్తిని కదిలించవు. పై మూడు అవస్థలు, మనిషికి సహజమైనవి, అప్రయత్నంగా జరిగేవి. అయితే, ధారణ, ధ్యాన, సమాధిస్థితులు ఒక వ్యక్తి ప్రయత్నపూర్వకంగా చేసేవి. ఒకే ఒక విషయమందు మనస్సును ఏకాగ్రతతో నిలిపినప్పుడు, ఇంద్రియాలు, బాహ్యప్రపంచం నుండి మరలి, తటస్థస్థితికి వస్తాయి; అందువల్ల, ఆలోచనలు అరికట్టబడతాయి; బుద్ధి, చిత్తము, అహంకారమనే వాటిని మనస్సు కట్టడి చేస్తుంది. ఇక్కడ మనస్సు, ధారణ, ధ్యాన స్థితులను దాటి, సమాధిస్థితి యందు ప్రవేశించి, చైతన్యశక్తి స్థితిలో వుంటుంది. అందువలనే, బాహ్య స్పృహ వుండదు; సమయం తెలియదు. దీన్నే సమాధి స్థితి లేదా సహజ స్థితి అని చెబుతారు. భౌతిక శరీరంలో వున్న జీవాత్మకు మనసు ఎప్పుడూ సాక్షిగానే వుంటుంది కాబట్టి, బాహ్య ప్రపంచంలోనికి వచ్చిన వ్యక్తికి, మనస్సు ద్వారానే సహజ స్థితిలో అనుభవమైన, లేదా అవగతమైన సత్యం జ్ఞాన రూపంలో తెలియబడుతుంది. అయితే, జ్ఞానాన్ని మాటల రూపంలో సంపూర్ణంగా ఇంకొకరికి తెలియచేయటం చాలా కష్టమైనది, కానీ, కొంతవరకు తెలియచేయవచ్చును. ఋషులు, తాము సమాధి స్థితిలో వున్నప్పుడు తెలుసుకున్న సత్యాల్నే వేదాలుగా మనకు తెలియచేసారు. వేదశాస్త్ర జ్ఞానంద్వారానే మనిషి, యుగాలుగా, ఎంతో ఉన్నత స్థాయిని చేరుకోగలిగి, చక్కటి సమాజాన్ని అభివృద్ధి చేయగలిగాడు.


నేను (Self) అనే స్థితిని గురించి, సహజ స్థితి, లేదా సమాధి స్థితి (Natural state) గురించి, శ్రీ బొందలపాటివారు తమ స్వంత అభిప్రాయాల్ని కొన్నింటిని తెలియచేసారు:– LSD అనే ఒక ప్రత్యేక మందును ఉపయోగించి, తాత్కాలికంగా, మనిషిలోని నేను అనే స్థితిని తొలగించి, సమాధి స్థితిలోకి మనిషిని తీసుకువెళ్ళవచ్చును; ముందు,ముందు జన్యుశాస్త్ర పరిశోధనల ద్వారా కూడా, మనిషిని సమాధ స్థితిలోనికి తీసుకువెళ్ళవచ్చునేమో అని వ్రాసారు. అభిప్రాయాలతో నేను ఏకీభవించలేను. ఎందుకంటే, LSD మందు ద్వారాగానీ, శస్త్ర చికిత్స చేసేటప్పుడు ఇచ్చే మత్తుమందు ద్వారాగానీ, మనిషి మెదడులోని నాడీవ్యవస్థ, తాత్కాలికంగా, అచేతనమవుతుంది. మనిషి, అచేతనావస్థలో మాత్రమే వుంటాడు. ఆధ్యాత్మికంగా, “నేను అనే స్థితి లేకుండుట అంటే, చేతనావస్థలో, జ్ఞానం ద్వారా, అహంకారాన్ని వదిలి, తాను ఎవరు? నేను చైతన్యశక్తిని లేదా పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవటం. ఇక, జన్యుశాస్త్ర పరిశోధనలద్వారా, మనిషిని సమాధి స్థితిలోకి తీసుకువెళ్ళటం గురించి: మనిషిలో ఇప్పటికే సమాధి స్థితిని పొందగలిగే జన్యువులు వున్నాయి. కేవలం ప్రయత్న లోపంవల్లే ప్రతి మనిషి స్థితిని పొందలేకపోతున్నాడు.


ఆఖరిగా, శ్రీ యు.జి.కె.గారు మనిషి మనుగడకు, మనిషిలోని స్పృహ/తెలివి అవసరంలేదు అని తమ భాషణలలో చెప్పారు. అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. ఎందుకంటే, చైతన్యశక్తి లేదా పరమాత్మ యొక్క సంపూర్ణ స్వరూపం : ” స్వీయ శక్తి; స్పృహ/తెలివి; జ్ఞానం అనబడే త్రిగుణాత్మక రూపంలో మనకు వ్యక్తమవుతుంది కాబట్టి.

From
మీతో చెప్పాలనుకున్నా!!! 

0 comments:

Post a Comment