Wednesday

ఈఫిల్ టవర్ ఇక వేస్ట్...!


వంతెనలెన్నో ఉన్నాయి. కానీ రికార్డ్ ఒక్కదానికే సొంతం. ఎందుకంటే మిగతా వంతెనలకంటే దానిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వంతెనొకటి పోయిన గురువారం మెక్సికోలో ప్రారంభమైంది. కేబుల్ తీగల సహాయంతో వేలాడే ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తయిన కేబుల్‌వంతెనగా రికార్డ్స్ పుస్తకాల్లోకి ఎక్కేసింది. దీని ఎత్తు ఈఫిల్ టవర్, న్యూయార్క్ ఎంపైర్ బిల్డింగ్‌లకంటే ఎక్కువ ఉండడమే ఈ రికార్డ్ ప్రత్యేకత. బాలుర్టే బైసెంటెన్నియల్ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెన మెక్సికోలోని సినలోవా - దురాంగో అనే రెండు ప్రాంతాల మధ్య ఎత్తయిన రెండు కొండలను కలుపుతుంది. దీంతో పసిఫిక్, అట్లాంటిక్ తీర ప్రాంతాలకు, మెక్సికోలోని ఉత్తర ప్రాంత ప్రజలకు మధ్య దూరం చాలా వరకూ తగ్గిపోతుంది. 

నాలుగు వరుసలతో నిర్మించిన ఈ వంతెన వెడల్పు 65.61 అడుగులు. పొడవు 3688 అడుగులు. కొండ కింద ప్రవహించే బాల్‌రేట్ నది గర్భం నుంచి వరకూ చూస్తే ఇది 1322 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి అదే ఈఫిల్ టవర్ ఎత్తు 1063 అడుగులే. అంటే ఈ బ్రిడ్జి కింద ఈఫిల్ టవర్ ఈజీగా దూరిపోవచ్చు. అంత ఎత్తులో ఉంటుంది కాబట్టే దీనికి ఈ రికార్డ్ వచ్చేసింది. దీని పునాదుల కోసమే 4,47,000 వేల క్యూబిక్ మీటర్ల కొండను తవ్వి పోయాల్సి వచ్చింది. 

2008లో నిర్మాణం ప్రారంభమైతే ఇప్పుడు ముగింపుకి వచ్చింది. ఈ సంవత్సరాంతం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యే ఈ వంతెనకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. స్పెయిన్ నుంచి మెక్సికోకి స్వాతంత్య్రం లభించి 200 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ 2012లోనే ఈ వంతెన రెడీ కావడం. ఇది ప్రారంభమైతే దురాంగో మజత్లాన్ అనే ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 6 గంటలు తగ్గిపోతుందట. రెండు పెద్ద టవర్లను ఆధారం చేసుకుని 152 స్టీల్ తీగలు ఈ వంతెనను గట్టిగా పట్టుకుని ఉంటాయి. నిర్మాణానికి ఏడువేల కోట్ల రూపాయలకు పైనే ఖర్చయ్యాయి. ప్రపంచంలోనే ఎత్తయిన కేబుల్ వంతెన రికార్డ్ ఫ్రాన్స్‌కి చెందిన మిల్లావైడక్ట్ వంతెన పేరిట ఇప్పటి వరకూ ఉంది.

0 comments:

Post a Comment