Sunday

ఆధిపత్యం కోసమే క్షిపణి పరీక్షలు ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటోంది భారత రక్షణ సమర్థ్యం పెంపుపై చైనా అక్కసు అధికారిక పత్రిక పీపుల్స్‌లో భారత మిలటరీ అభివృద్ధితో ప్రమాదాలు పేరిట కథనం...

భారత క్షిపణి ప్రయోగాలు విజయవంతం కావడంపై చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 క్షిపణిని త్వరలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు భారత శాస్త్రవేత్తలు ప్రకటించడంపై విమర్శలు ఎక్కుపెట్టింది.

దక్షిణాసియా ప్రాంతంలో సైనికంగా అగ్రరాజ్యంగా ఎదగడానికి భారత్ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే అగ్ని-5 క్షిపణిని రూపొందిస్తోందని పేర్కొంటూ చైనా అధికారిక పత్రిక పీపుల్స్ డైలీ 'భారత మిలటరీ అభివృద్ధితో ప్రమాదాలు' పేరిట ఓ కథనాన్ని ఆదివారం ప్రచురించింది. మన దేశం ఇటీవల 3 వేల కిలోమీటర్ల సామ ర్థ్యం గల అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.

వచ్చే ఫిబ్రవరిలో 5వేల కిలోమీటర్ల సామర్థ్యం గల అగ్ని-5ని ప్రయోగాత్మకంగా ప్రయోగించనున్నట్లు ఆ సందర్భంగా రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో డైరెక్టర్ వీకే సారస్వత్ ప్రకటించారు కూడా. అయితే.. "అగ్ని-5 క్షిపణి ఓ దేశానికి 'కిల్లర్' వంటిదని భారత నాయకులు, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

ఇది ప్రాంతీయంగా తమ ఆధిపత్యాన్ని పెంచుకునే ఉద్దేశమే. ప్రపంచ వ్యవహారాల్లో ప్రధాన పాత్ర పోషించాలనేది ఆ దేశం లక్ష్యం. ఆ దారిలోనే మిలటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పొతోంది. భారత్ ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా మారుతోందని స్వీడన్ ప్రపంచ శాంతి పరిశోధన సంస్థ కూడా తెలిపింది'' అని పీపుల్స్ ప్రచురించిన కథనం పేర్కొంది.

భారత రక్షణ సామర్థ్యం పెంపుపై చైనా గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. చైనా సరిహద్దుల్లో మిలటరీని మోహరించడంపై స్పందిస్తూ.. "అది ఈ ప్రాంతం లో ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.

ఆ దేశ స్వంత ప్రయోజనాలకు కూడా ప్రమాదమే. ముఖ్యంగా వివాదాస్పద సరిహద్దుల్లో బలగాలను మోహరించడం రెచ్చగొట్టే చర్యే. అయినా, ఒక్క దగ్గర కేంద్రీకరించిన బలగాలను సులువుగా మట్టుపెట్టవచ్చనే విషయం కామన్ సెన్స్ ప్రతీ ఒక్కరికీ తెలుసు'' అని వ్యాఖ్యానించింది.

0 comments:

Post a Comment