Wednesday

టెలికాంలో విలీనాలు షూరూ...?


ట్రాయ్ సిఫారసులకు కమిషన్ పచ్చజెండా
త్వరలోనే ప్రభుత్వ నిర్టయం
వన్‌టైమ్ ఫీజుతోనే అదనపు స్పెక్ట్రమ్
టెలికాం కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్
 టెలికాం విలీనాలకు వేదిక సిద్ధమైంది. పరిశ్రమ రెగ్యులేటరీ ట్రాయ్ చేసిన సిఫారసులకు టెలికాం కమిషన్ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఒక్కో టెలికాం సర్కిల్‌లో 12 నుంచి 13 కంపెనీలు సేవలను అందిస్తున్నాయి. విలీనాలకు తెరతీస్తే.. ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. బడా కంపెనీలతో సేవల్లో నాణ్యత పెరుగుతుందని, పరిశ్రమకు నిధుల కొరత సమస్య తీరుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో టెలికాం విలీనాలకు సంబంధించి ట్రాయ్ కీలకమైన సూచనలు చేసింది. రెగ్యులేటరీ సిఫారసుల ప్రకారం విలీనం జరిగిన తదుపరి సదరు కంపెనీ మార్కెట్ వాటా ఎట్టి పరిస్థితుల్లో 35 శాతానికి మించరాదు.

అలాగే మొత్తం స్పెక్ట్రమ్‌లో 25 శాతం మించకుండా స్పెక్ట్రమ్‌ను కలిగివుండాలి. ఈ సిఫారసులను మాత్రమే కమిషన్ ఆమోదించామని, ఈ పరిమితులు మించిన డీల్స్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు టెలికాం కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. 35 శాతం నుంచి 60 శాతానికి లోబడి మార్కెట్ వాటా కలిగివుండే డీల్స్ విషయాన్ని ట్రాయ్ పరిశీలిస్తుందని, టెలికాం రంగంలో ఏకీకృత ధోరణులు నెలకొనే అవకాశం లేదనుకున్నప్పుడే అనుకూలంగా సిఫారసు చేస్తుందని ఆయన తెలిపారు. స్పెక్ట్రమ్ వినియోగం షరతులకు లోబడే విలీనాలు జరగాలని ట్రాయ్ సూచించింది. ఈ సిఫారసులను టెలికాం కమిషన్ ఆమోదించడంతో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

సింగిల్ పేమెంట్‌కే స్పెక్ట్రమ్ జిఎస్ఎం కంపెనీలకు ప్రతికూల వార్త ఒకటి పొంచివుంది. అదనపు స్పెక్ట్రమ్‌ను వన్‌టైమ్ ఫీజుతోనే కేటాయించాలని టెలికాం శాఖ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోలేదని, 6.2 మెగాహెర్ట్జ్ మించి స్పెక్ట్రమ్ కావాలని కోరే కంపెనీలకు ఈ విధానంలోనే కేటాయింపులు జరపాలనే అంశం పరిశీలనలోనే ఉందని టెలికాం కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడిన పక్షంలో జిఎస్ఎం కంపెనీలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.

ఈ కంపెనీలపై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే 3జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కోసం భారీ డబ్బు వెచ్చించిన కంపెనీలు అదనపు స్పెక్ట్రమ్ చేజిక్కించుకోవడానికి మరింత శ్రమపడాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను భారతి, వొడాఫోన్, ఐడియాలు తీవ్రగా వ్యతిరేకిస్తున్నాయి. ఆల్ ఇండియా స్థాయిలో అదనపు స్పెక్ట్రమ్‌కు రూ. 4,571 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

0 comments:

Post a Comment