కుండపోతగా వాన.. కనీ వినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడిన నదులు.. గంటకు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో చండప్రచండంగా వీచిన గాలులు.. వెరసి దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని రెండు నగరాలు అతలాకుతలం కాగా, దాదాపు 436 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సామూహిక అంత్యక్రియలు నిర్వహించిన చోటుకు వచ్చిన మృతదేహాల లెక్కల ప్రకారం ఈ సంఖ్యను తేల్చినట్లు ఫిలిప్పైన్స్ రెడ్‌క్రాస్ కార్యదర్శి జనరల్ గ్వెన్ పాంగ్ తెలిపారు.
కగయాన్ డి ఓరో నగరంలో 215 మంది, ఇలిగాన్ చుట్టుపక్కల నగరాల్లో 144 మంది మరణించారని, మిగిలినవారు దక్షిణ, మద్య రాష్ట్రాల్లో అసువులు బాశారని ఆమె వివరించారు. శుక్రవారం అర్ధరాత్రి 'వషీ' తుపాను ప్రభావంతో పెనుగాలులు వీయడంతో మిండానావో ద్వీపంలో కుంభవృష్టి కురిసింది. ఆ సమయంలో చాలామంది గాఢనిద్రలో ఉండగానే వారి ఇళ్లమీదుగా నదీ జలాలు విరుచుకుపడ్డాయి, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. కుటుంబాలకు కుటుంబాలే ఆచూకీ లేకుండా పోయాయి.
దాంతో మృతదేహాలు తమ వాళ్లవి అని గుర్తించడానికి కూడా ఎవరూ లే ని దుస్థితి అక్కడ నెలకొంది. కనపడకుండా పోయినవారు ఎంతమంది అనే విషయం ఇంతవరకు తెలియలేదు. స్థానిక పోలీసులు, రిజర్విస్టులు, కోస్ట్‌గార్డ్ అధికారులు, స్థానిక వాలంటీర్ల సాయంతో వేలాదిమంది సైనికులు సహాయ పునరావాస కార్యక్రమాల కోసం హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. 2009లో రాజధాని మనీలాను ముంచెత్తిన ఓన్‌డే తుపాను కన్నా వషీ తుపాను తీవ్రత ఎక్కువ. గంట వ్యవధిలో మూడు అడగుల ఎత్తున నీరు చేరడంతో ప్రజలంతా ఇళ్ల పైకప్పులెక్కారని ఇలిగానా నగర మేయర్ లారెన్స్ క్రజ్ చెప్పారు. కాగా ఫిలిప్పైన్స్‌ను ఏటా 20 తుపాన్లు తాకుతాయి.
0 comments:
Post a Comment