Saturday

భగవద్గీతపై రష్యాలో నిషేధం! అది ఉగ్రవాద సాహిత్యం రష్యన్ భూభాగంపై అమ్మకాలు వద్దు సైబీరియా కోర్టులో కేసు.. రేపు తుది తీర్పు


కలగజేసుకోవాలని ప్రధానికి ఇస్కాన్ విజ్ఞప్తి
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి
కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది. దాని ఫలితాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడమూ మానద్దు.

 భగవద్గీతలోని రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలోని శ్లోకమిది. దీంతోపాటు అనేకానేక శ్లోకాలతో మానవజీవితానికి మార్గదర్శకత్వం వహిస్తుందీ మహాగ్రంథం. కానీ, రష్యాలో మాత్రం న్యాయమూర్తులకు అదో 'ఉగ్రవాద' సాహిత్యంలా కనపడింది. ఒకప్పుడు కమ్యూనిస్టు సాహిత్యాన్ని దగ్గర పెట్టుకుంటే తీవ్రవాదులని భావించి అరెస్టుచేసేవారు. కానీ, కమ్యూనిస్టు దేశమైన రష్యాలో పవిత్ర భగవద్గీతే వారికి ఉగ్రవాద భూతంలా కనిపించింది. అందుకే.. సైబీరియాలోని టామ్స్క్ నగరంలోని కోర్టు ఈ గ్రంథాన్ని నిషేధించాలని తలపోస్తోంది.

ఆ రాష్ట్ర న్యాయవాదులు ఈ విషయమై దాఖలు చేసిన కేసులో తన తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. దీనిపై దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని రష్యాలోని భారతీయులు, ఇస్కాన్ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ గ్రంథం సాంఘిక విభేదాలను ప్రచారం చేస్తున్నందున రష్యాలో దీని అమ్మకాన్ని అక్రమంగా ప్రకటించాలని న్యాయవాదులు కోరారు. దాంతో మాస్కోలో స్థిరపడిన 15వేల మంది భారతీయులతో పాటు ఇస్కాన్ ప్రతినిధులు కూడా మన్మోహన్ సర్కారు ఈ విషయమై దౌత్యపరంగా కలగజేసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు వారు ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ కూడా రాశారు. రష్యాలోని హిందువుల హక్కులను సంరక్షించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించాలని తాము కోరుతున్నట్లు ఇస్కాన్‌కు చెందిన సాధుప్రియ దాస్ తెలిపారు.

కోర్టు అక్టోబర్ 25నే ఈ గ్రంథాన్ని టామ్స్క్ విశ్వవిద్యాలయానికి పంపి, దానిపై నిపుణుల అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. కానీ, అసలక్కడ భారత సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం గురించి తెలిసినవారే లేరని ఇస్కాన్ సభ్యులు అంటున్నారు. ఇస్కాన్ భారతీయ విభాగం కూడా ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి ముఖ్యకార్యదర్శి పులోక్ చటర్జీకి ఇస్కాన్ న్యూఢిల్లీ శాఖకు చెందిన గోపాలకృష్ణ గోస్వామి ఓ లేఖ రాశారు. కేసు తమ దృష్టికి వచ్చిందని, మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులను ఈ విషయమై రష్యన్ అధికారులతో చర్చించాల్సిందిగా ఆదేశించామని పీఎంవో అధికారులు తెలిపారు.

0 comments:

Post a Comment