Wednesday

2020 నాటికి ఐదో స్థానంలో ఇండియా


బ్రిటన్,జర్మనీ,ఫ్రాన్స్ వెనక్కి
చైనా,జపాన్,రష్యా ముందుకి
సిఇబిఆర్ అంచనా

 భారత ఆర్థిక వ్యవస్థ 2020 నాటికి బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలను కూడా దాటి ప్రపంచంలోని ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంతర్జాతీయ ఆర్థిక మేధావుల వేదిక సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సిఇబిఆర్) అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల ప్రకారం 2010 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 173 లక్షల కోట్ల డాలర్ల విలువతో (ప్రస్తుత రూపాయి విలువలో జిడిపి పరిమాణం ఆధారంగా) తొమ్మిదో స్థానంలో ఉంది. అదే సంవత్సరంలో 146 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవగా చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ, ఇండియా. కెనడా టాప్ టెన్‌లో స్థానం పొందాయి. 

రష్యాతో సహా ఇతర దేశాల గణాంకాలు అందుబాటులో లేవు. సిబిఇఆర్ అంచనా ప్రకారం 2020 నాటికి యథాతథంగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతూ చైనా, జపాన్, రష్యా, ఇండియా తొలి ఐదు స్థానాల్లో నిలుస్తాయి. 2011లో తొలి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో వరుసగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నాయి. బ్రిటన్‌ను ఏడో స్థానానికి నెట్టి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ ఆరో స్థానంలోకి వెళ్ళిందని గణాంకాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో బ్రిటన్ ర్యాంకింగ్‌లలో మరింతగా దిగజారుతుందని, అయినా 2020 నాటికి ఫ్రాన్స్ కన్నా మెరుగైన స్థానంలోనే ఉంటుందని సిఇబిఆర్ తన నివేదికలో తెలిపింది. ప్రపంచగమనం పాశ్చాత్య దేశాల నుంచి తూర్పు దేశాల వైపు మరలుతున్నదనడానికి బ్రెజిల్ ఈ ఏడాది బ్రిటన్‌ను పక్కకు నెట్టి ఆరో స్థానానికి ఎదగడమే తార్కాణమని సిఇబిఆర్ చీఫ్ డగ్లస్ విలియమ్స్ అన్నారు.

త్వరలో పుంజుకుంటాం: ప్రణబ్
మన ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అధిక వృద్ధి రేటు సాధించే దిశగా అడుగులేస్తుందని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తన మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేస్తున్న సలహా సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధిరేటులో ప్రస్తుతం చోటు చేసుకున్న మందగమనం తాత్కాలికమేనని భరోసా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులేస్తున్నదన్న భయాలతో పాటు ప్రభుత్వం జిడిపి వృద్ధిరేటు అంచనాను గత నెలలో 7.5 శాతానికి కుదించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కడగండ్లలో ఉన్నదని, యూరోజోన్ సంక్షోభం, విదేశాల నుంచి వస్తువులకు డిమాండు తగ్గడం వల్ల ఎగుమతులు తగ్గాయని ఆయన అన్నారు.

వీటికి తోడు కరెన్సీ ఆటుపోట్లు, కరెంట్ అకౌంట్ లోటు కారణంగా ఆర్థిక వ్యవస్థలో వేగం కొంత తగ్గిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వ్యయపరిమితులకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశామని ఆర్థికమంత్రి చెప్పారు. ఆహార ద్రవ్యోల్బణం ఎట్టకేలకు దారిలోకి వచ్చిందని, అది 1.8 శాతానికి దిగజారడంతో సాధారణ ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. పొదుపు రేటు కూడా పెరిగిందని ఆయన చెప్పారు. వ్యవసాయ కార్మికులు పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస పోవడాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ఎంపిలు ఆర్థిక మంత్రికి సూచించారు.

వ్యవసాయం రంగం వర్షాధారనీయత తగ్గించాలని, నూనెగింజలు, పప్పులు అధికంగా పండించేందుకు వీలుగా వ్యవసాయదారులకు తగు ప్రోత్సాహకాలివ్వాలని కూడా వారు సూచించారు. వ్యవసాయ రంగానికి రుణపరపతి పెరిగేలా చూడడంతో పాటుగా లబ్ధిదారులకు నేరుగా నగదు సబ్సిడీలివ్వాలని కొందరు సూచించారు. రైతాంగానికి న్యాయం చేసేందుకు వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాల్లోకి ఎఫ్‌డిఐలు తీసుకురావాలని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. విద్యుత్, పౌర విమానయానం, ఆరోగ్యం, మౌలిక వసతులు, టెలికాం రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు.

0 comments:

Post a Comment