Wednesday

సౌదీలో అతివల ఆక్రందన వ్యభిచార రొంపిలో దించిన యజమాని


పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వచ్చి.. వ్యభిచార కూపంలో ఇరుక్కుపోతున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి పంపాలని వారు చేస్తున్న వేదనలు, రోదనలు చెవి టి ముందు శంఖారావంలా మిగిలిపోతున్నాయి. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఓ మహిళ (34) అనాథగా తన బంధువుల ఇంట్లో పెరిగింది. నలుగురు పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌లోని ఒక దళారీ సాయంతో ఓ అరబ్బు మహిళ ఇంట్లో పని చేయడానికి గతనెల 15న సౌదీ అరేబియాలోని రియాద్‌కు వచ్చింది.

కానీ ఇక్కడ మహిళా యజమాని ఎవరూ లేరు. ఒక సౌదీ జాతీయుడి చేతిలో బందీగా మారిన ఆమెతో.. అతను బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం. రోజుకో అరబ్బు ను తీసుకొచ్చి అతనితో గడపాలని ఒత్తిడి చేస్తున్నాడు.. లేదా కారులో విటుల వద్దకు తీసుకెళ్తున్నాడు. నిరాకరించిన ప్రతిసారీ తీవ్రంగా కొట్టడంతో ఆమె భరించలేకపోయింది. పారిపోయే అవకాశం కూడా లేక ఆమె బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఓసారి మాత్రం ఓ విటుడు కనికరించి ఫోన్ ఇవ్వడంతో భారత్‌లోని తన బంధువుల కు తన గోడు చెప్పుకొని రక్షించాలని కోరింది.

మరో కేసు లో.. హైదరాబాద్‌లోని బోయినపల్లికి చెందిన ఆయేషా సిద్ధిఖి అనే మరో యువతి బ్యుటీషియన్‌గా పనిచేసేందుకు సౌదీలోని జుబేల్ అనే పారిశ్రామిక పట్టణానికి మూడు నెలల క్రితం వచ్చింది. ఒకరోజు అనారోగ్యం వల్ల బ్యూటీపార్లర్‌కు రాకపోవడంతో యజమానురాలు తీవ్రంగా కొట్టడంతో పారిపోయి సమీపంలోని దమ్మాం నగరానికి వచ్చింది. దమ్మాంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అరెస్టు చేసి నెలన్నర అవుతోంది.

అయినా ఇప్పటి వరకు జైలును రియాద్‌లోని భారతీయ ఎంబసీ అధికారులు సందర్శించకపోవడంతో ఆమెకు పాస్‌పోర్టు జారీకాలేదు. సౌదీలోనే పనిచేస్తున్న ఆమె భర్త ఎంబసీ అధికారులను కలిస్తే గానీ వారు కనికరించలేదు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ను తీసుకొని దమ్మాంలో జైలు అధికారులకు ఆయన అందజేశారు. దమ్మాంలోని జైలులో ఇలాం టి దయనీయ పరిస్థితులలో మరో ఆరుగురు భారతీయ మహిళలు ఎంబసీ అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. తాను గల్ఫ్‌కు వచ్చి తప్పు చేశానని, ఎలాగైనా స్వదేశానికి తిరిగి వెళ్తే చాలని ఆయేషా  పేర్కొంది.

0 comments:

Post a Comment