Wednesday

దైవ కణం జాడ...!


ఇన్నేళ్లకి శాస్త్రవేత్తల సుదీర్ఘ స్వప్నం ఫలించింది. దైవ కణం జాడ తెలిసింది. 2012వ సంవత్సరం జూలై 4వ తేదీ పదార్ధ భౌతిక శాస్త్ర చరిత్రలో మరచిపోలేని రోజు. ఈ రోజుకోసమే ప్రపంచమంతటా శాస్త్రవేత్తలు దాదాపు అర్థ శతాబ్దంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. స్విిట్జర్లండ్‌లోని సెర్న్ పరిశోధనా కేంద్రంలో పదార్ధ భౌతిక శాస్త్రంపై పరిశోధన చేస్తున్న రెండు పరిశోధనా బృందాలకు చెందిన శాస్త్రజ్ఞులు దశాబ్దాలుగా చేస్తున్న పరిశోధనల ఫలితంగా ఇన్నాళ్లకి తాము ఒక అద్భుతమైన, శాస్త్ర సంబంధమైన ఒక కీలకమైన అంశాన్ని కనుగొన్నామని చెప్పడానికి ఆధారాలు లభించాయని బుధవారంనాడు ఎంతో ఉద్వేగానికై లోనవుతూ సగర్వంగా ప్రకటించారు.

ఇన్నేళ్లుగా తాము చేస్తున్న ఈ కృషిలో భారత శాస్త్రవేత్తల కృషి అనన్యసామాన్యమని కూడా వారు ప్రకటించడం మనం కూడా సగర్వంగా తల ఎత్తుకోగల హర్షణీయ చారిత్రక సందర్భం. ఇన్నాళ్లుగా శాస్త్రవేత్తలకు మింగుడుపడకుండా తప్పించుకుపోతున్న ఒకానొక సూక్ష్మ శకలం - దాన్నే తేలికగా గుర్తించడానికి వీలుగా దైవ కణం అంటున్నారు - దాని ఉనికిని చాటడానికి ఉపయుక్తమయ్యే సాక్ష్యాధారాలను సేకరించడంలో సఫలమయ్యామని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. అంటే ఈ ప్రయోగం ఇంకా పూర్తి కాలేదు. దైవ కణాన్ని కనిపెట్టేశామని శాస్త్రవేత్తలు చెప్పడంలేదు. తాము కనిపెట్టిన అంశం ఆ దైవ కణం ఉనికిని చాటడానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నామని మాత్రమే వారు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఎందుకీ సంబరం? ఇప్పుడు వారు చేసిన ఆవిష్కరణ దేనికి సూచిక? దీనివల్ల ప్రపంచం నడక ఉన్నపళంగా ఒక్కసారిగా ఏమైనా మారిపోతుందా? అదేమీ కాదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన అంశంవల్ల సాధారణ ప్రజానీకానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. కాకపోతే, సైన్స్ మరో పెద్ద ముందడుగు వేసిందని చెప్పాలి. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన అంశాన్ని ప్రయోగ విస్తృతి రీత్యా మనిషి చంద్రమండలంపై అడుగుపెట్టడంతోనో, ఐన్‌స్టీన్ థీరీ ఆఫ్ రిలటివిటీతోనో, న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతంతోనో సరిపోల్చాలి. అణువు, పరమాణువు అనే సూక్ష్మాతి సూక్ష్మ జగత్తు గురించే ఇప్పటివరకూ విన్నాం.

ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం అభివృద్ధి చెందుతున్నకొద్దీ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల గురించి, ఇంకా ఆ మధ్య క్వార్క్‌లు, లెప్టాన్లు, బోసాన్లు, గ్రేవిటాన్ల గురించీ విన్నాం. ఇప్పుడిక హిగ్స్ బోసాన్ల కాలం వచ్చింది. వీటినే దైవ కణాలని కూడా మామూలు భాషలో పిలుస్తున్నారు. వీటి ఉనికి తెలుసుకోవడానికే శాస్త్రజ్ఞులు ఇప్పుడు ప్రోటాన్లను ఢీకొట్టించి అందులోనుంచి వెలువడే అతి సూక్ష్మాతి సూక్ష్మ కణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ అతి సూక్ష్మ కణాలకు సంబంధించిన చర్చలో పదార్ధానికి ద్రవ్యరాశి ఎక్కడినుంచి వచ్చింది, ఎలా వచ్చిందన్న కీలకమైన ప్రశ్నకు శాస్త్రవేత్తలు శతాబ్దాల తరబడి సమాధానం అన్వేషిస్తూనే ఉన్నారు. ఎవరికీ సమాధానం దొరకలేదు. సూక్ష్మాతి సూక్ష్మ పదార్థ కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చిన మూల పదార్ధ భౌతిక కణం ఒకటుందని 1960వ దశకంలో పీటర్ హిగ్స్ అనే పదార్ధ భౌతిక శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించాడు. దాన్ని కనిపెట్టడమే ఆధునిక పదార్ధ భౌతిక శాస్త్రజ్ఞుల ముందున్న అతిపెద్ద సవాలు అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ హిగ్స్ సమక్షంలోనే సెర్న్ పరిశోధనలు నిర్వహించిన పరిశోధకులు తాము కనిపెట్టిన అంశాన్ని ప్రకటించడం ఒక అపూర్వమైన సందర్భం!

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి 1920వ దశకంలో సన్నిహితంగా పనిచేసిన భారత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని అప్పటికే వ్యక్తం చేసి ఉన్నారు. దాంతో ఆ అదృశ్య కణానికి పదార్థ భౌతిక శాస్త్రజ్ఞులు ఈ ఇద్దరి పేరూ కలిసి వచ్చేటట్టు హిగ్స్ బోసాన్ అనే పేరు పెట్టారు. ఇది పండితులకు అర్థమయ్యే మాట గాని పామరులకు అర్థమయ్యేది కాదంటూ లియోన్ లెడెర్‌మాన్ అనే నోబెల్ బహుమతి గ్రహీత ఆ అదృశ్య కణానికి దైవ కణం (గాడ్ పార్టికిల్) అని పేరు పెట్టారు.

ఇప్పుడు ఇదే అందరి నోళ్లలోనూ నానుతోంది. ఈ కణం ఉనికిని కనిపెట్టడానికి వీలుగా స్విట్జర్లండ్ - ఫ్రాన్స్ సరిహద్దుల్లో దాదాపు 1000 కోట్ల డాలర్లతో నిర్మించిన అతిపెద్ద హేడ్రన్ కొలైడర్‌లో ఈ పరిశోధకులు ఎన్నో ప్రయోగాలు నిర్వహించారు. ఈ అన్వేషణలో వారు వెదుకుతున్న అంశం ఏమంటే పదార్థంలోని కొన్ని ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశి ఎక్కడినుంచి వస్తుందన్నది తెలుసుకోవడం, వీలైతే ఆ దైవ కణాన్ని కనిపెట్టడం, లేదంటే కనీసం దాని ఉనికిని రుజువు చేసే పరిశోధనా ఫలితాలను సందేహాలకు తావు లేకుండా ఆవిష్కరించడం.

మరి ఇప్పుడు పదార్ధానికి ఆ ద్రవ్యరాశి ఎలా వచ్చిందన్నది ఈ పరిశోధనల ఫలితంగా తేలిందా అంటే అది అంత తేలిక కాదన్నది శాస్త్రవేత్తల సమాధానం. ఈ పరిశోధనలలో పాలు పంచుకుంటున్న బాబ్ రోజర్ మాటల్లో చెప్పాలంటే ఒక వస్తువు పాద ముద్రలు, దాని ఛాయను కూడా చూస్తున్నాం, కాని ఆ వస్తువును మాత్రం చూడలేం! ఈ పరిశోధనల గురించి సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీవెన్ హాకింగ్ చాలా చక్కగా చెప్పారు. దైవ కణం గురించి సెర్న్ చేస్తున్న ప్రయోగాలు ఫలించాలని ఆశిస్తున్నా, అయితే దాని అన్వేషణలో శాస్తజ్ఞులు విఫలమవుతారని భావిస్తున్నానన్నారు!

ఏది ఏమైనా పెక్కుమంది పదార్థ భౌతిక శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నట్టు దైవ కణం జాడ నిజంగానే దొరికినట్టు పూర్తి ఆధారాలతో ఈ సంవత్సరాంతానికి రుజువైనా, లేదా రుజువు కాకపోయినా, ఇప్పుడు సెర్న్‌లో జరుగుతున్న ప్రయోగాలు మన విశ్వానికి సంబంధించిన మన అవగాహనను ముఖ్యంగా సబ్ అటమిక్ పార్టికిల్స్ అనే మరో జగత్తుకు సంబంధించిన అవగాహనను ఆమూలాగ్రం మార్చేస్తాయి. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నదే ప్రస్తుత ప్రయోగ ఫలితాల సారాంశం!

0 comments:

Post a Comment