Monday

మూడు పూటలా వేడి భోజనం గర్భిణులకు ప్రత్యేక పథకం.. సీఎం వెల్లడి త్వరలో 38వేల ఎన్‌డీసీ కేంద్రాల ఏర్పాటు ప్రతిపక్షాలూ కలిసి రావాలి 20 సూత్రాల పథక ఆవిర్భావ దినోత్సవంలో సీఎం


'మాతా శిశు మరణాలను తగ్గించడానికి పలు కార్యక్రమాలు చేపట్టాం. ఇకపై గర్భిణులకు మూడు పూటలా వేడి భోజనం అందిస్తాం' అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను రెండేళ్లలో 38 వేల ఎన్‌సీడీ కేంద్రాల్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇప్పటికే 4వేల కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఇరవై సూత్రాల పథకం ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా సోమవారం ఇక్కడ జూబ్లీహాలులో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు.

పౌష్టికాహారం లభించక మాతా, శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పారు. తమది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వమని సీఎం వ్యాఖ్యానించారు. అలాగే.. ఎలాంటి పైరవీలు లేకుండా నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించే విధంగా తమ సర్కారు చర్యలు చేపట్టిందన్నారు. 'ప్రభుత్వ ఉద్యోగం కోసం తనకు డబ్బు లేదనే భావన, సిఫారసు లేదనే అభద్రత ఏ నిరుద్యోగ యువకుడికీ రాకూడదు' అన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుస్తోం దని, ఇందిరమ్మ పాలన తెస్తామని 2004 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు.

ఇందిరమ్మ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని పేద ప్రజల నమ్మకమని, ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలబెడు తోందన్నారు. 1975లో ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని ఆరంభించారని గుర్తు చేశారు. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు పథకాలన్నీ ఇరవైసూత్రాల కార్యక్రమంలో భాగమేనన్నారు. ఈ పథకం అమలుద్వారా రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనను తీసుకురావడంలో విజయం సాధించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వస్తారా లేదా అన్నది వాళ్లిష్టమని వ్యాఖ్యానించారు. ఇరవై సూత్రాల పథకాన్ని అమలు చేయడంలో ఉన్నతస్థానంలో నిలిచిన కడప, కర్నూలు, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సీఎం ఈ సందర్భంగా సత్కరించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపీడీవోలను సత్కరించారు.


0 comments:

Post a Comment