Monday

వందే గురు పరంపరా...

తల్లి జన్మనిస్తుంది. ఆమె రుణాన్ని మాతృసేవ ద్వారా తీర్చుకోవచ్చు. గురువు జన్మ రాహిత్యాన్నిస్తాడు. అలాంటి గురువు రుణాన్ని తీర్చుకోవడం కష్టం. ఐతే, గురువు నుంచి పొందిన జ్ఞానాన్ని ఇంకొకరికి సజావుగా అందించడం ద్వారా గురువు రుణాన్ని తీర్చుకోగలమని శాస్త్రవాక్యం. గురు పరంపరకు ఇదే ఆలంబన. రేపు గురుపూర్ణిమ సందర్భంగా ప్రత్యేక వ్యాసం.



మనిషిని విశిష్ఠునిగా, సార్థక జన్మునిగా, కృతార్థునిగా చేసేది జ్ఞానమే. విద్యయా విందతే జ్ఞానమ్. అలాంటి జ్ఞానం లభించేది విద్యద్వారానే. అట్టి విద్యకు మూలం వేదం. రాశిగా పోసి ఉన్న ఆవేదాన్ని బ్రహ్మ సూత్రాలనే గోరుముద్దలుగా ఈ జగతికి వేదవ్యాసుడు అందించిన ఒక ప్రత్యేకమైన రోజు ఆషాఢ పూర్ణిమ. దానినే వ్యాస పూర్ణిమ అంటాం. గురు పూర్ణిమ అని కూడా అంటాము. భారతీయ సంస్కతిలో గురువు స్థానం అమూల్యం. ఆచార్యుడు, గురువు అనే పదాలు దాదాపుగా సమానార్థకాలు. ఆచార్యః వేద సంపన్నః, విష్ణుభక్తో విమత్సరః, మంత్రార్థః, మంత్ర తత్వజ్ఞః, సదా తత్వార్థ చింతకః, ఏవం లక్షణ సంపన్నః ఆచార్యేతి కీర్తితః.

స్వయంగా ఆచరించడం ద్వారా ఇతరులకు ఆచరణీయమైన జీవితాన్ని గడిపే వాడు, వేదాన్ని ఎరిగిన వాడు, విష్ణు భక్తుడు, మాత్సర్యం అనే అవగుణం లేనివాడు, మంత్రార్థాన్ని, మంత్ర తత్వాన్ని క్షుణ్ణంగా తెలిసిన వాడు, ఎల్లప్పుడు తాత్విక చింతనలో గడిపే వాడు-ఇన్ని విశిష్ట లక్షణాలను కలిగిన వాడే ఆచార్యుడుగా కీర్తి పొందుతాడు. ఇక గురువు కావాలంటే వీటికి మరో లక్షణం కూడా తోడు కావాలి. అది తను పొందిన జ్ఞానాన్ని ఇతరులకు అందించే సామర్థ్యం. దీనినే ఇలా కూడా చెబుతారు. 'గు' అంటే అంధకారం, 'రు' దానిని నిరోధించే జ్ఞానానికి సంకేతం. అలాంటి జ్ఞాన ప్రదాతే గురువు. కనుక ఆయనకు ఏ ఉపమానమూ కుదరదు. అందుకే ఆయనది అమూల్యమైన స్థానం. వ్యాస మహర్షి ప్రయత్నంతో ఈ విషయం మరింతగా విశదమైంది. కృతయుగంలో దక్షిణామూర్తి రూపంలో, త్రేతాయుగంలో దత్తాత్రేయుడి రూపంలో, ద్వాపరంలో వ్యాసుడి రూపంలో, అనంతరం వర్తమాన యుగంలో శంకర భగవత్పాదుల రూపంలో ఈ భారతీయ గురు వైభవం మరింతగా విరాజిల్లింది.

కృతయుగంలో గురు దక్షిణామూర్తి
సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు ఋషులకు సత్యాన్ని, తత్వాన్ని దక్షిణామూర్తి మౌనంతోనే ఉపదేశించారు. మౌనం అంటే స్వస్వరూప అనుసంధాన స్థితి. "యతో వాచో నివర్తంలే అప్రాప్య మనసా సః''. సాధకుడు ప్రాపంచిక విషయాలను అధిగమించి, మనసుని కూడా దాటి, నిజమైన స్వస్వరూప స్థితిలో ఆరూఢుడై ఉన్నప్పుడు ఆలోచనలు, మాటలు, నామ రూపాలు అంతర్లీనమైపోతాయి.

దానినే బ్రాహ్మీ స్థితి అంటారు. తపో నిష్ఠులైన నలుగురు ఋషులు కృతయుగంలో పరిపూర్ణ వైరాగ్యంతో, సద్గుణ సంపన్నులై, సత్వ ప్రధానులై దక్షిణామూర్తి సన్నిధిని చేరగానే అయస్కాంతం పరిధిలో ఇనుప ముక్కలు ఆయస్కాంతాలుగా మారినట్లు, వారు కూడా బ్రహ్మవేత్తలయ్యారు. అర్హత కలిగిన ఆ ముముక్షువులను దక్షిణామూర్తి తన సన్నిధితోనే స్వస్వరూప అనుసంధాన స్థితికి చేర్చారు. ఇది కృత యుగం నాటి గురుశిష్యుల విధానాన్ని తెలుపుతుంది.

వ్యాసుడి బ్రహ్మ సూత్రాలు
త్రేతాయుగంలో మనవ బుద్ధి బాహ్య ప్రకృతికి చేరువైంది. ప్రకృతిలోని విలక్షణమైన అంశాలు మానవునిలో పరిణతి కలిగించే సంగతిని దత్తాత్రేయ స్వామి 24 అంశాల ద్వారా ప్రబోధించారు. ద్వాపర యుగం ప్రవేశించిన మీదట మానవుడికి సందేశాత్మక విధానమే తగినదని భావించిన వేదవ్యాస మహర్షి అప్పటి వరకు రాశిగా ఉన్న వేద వాజ్ఞ్మయాన్ని విభజించి మంత్రాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలైన రూపాలతో చక్కటి వ్యవస్థను ఏర్పరచారు. వీటిలో భారతీయతకు, వైదిక వాజ్ఞ్మయానికి పట్టుకొమ్మ అయిన ఆత్మ తత్వాన్ని వ్యాసుల వారు బ్రహ్మ సూత్రాలుగా వెలికితీశారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఈ సూత్రాల రచన పూర్తికాగా, వాటిని ఆషాఢ పూర్ణిమ రోజున లోకానికి అంకితమిచ్చారు. వేద వాజ్ఞ్మయాలలోకల్లా గహనము, గంభీరము అయిన బ్రహ్మ సూత్రాలు ఈ జాతికి అందిన సందర్భాన్ని పురస్కరించుకొని, భారతీయ సనాతన సంప్రదాయస్తులు ఈ ఆషాఢ పూర్ణిమను 'వ్యాస పూర్ణిమ'గా, 'గురు పూర్ణిమ'గా జరుపుకొంటున్నారు. ఆది నుండి ఆరంభించి, ఈ నాటి వరకు గురు పరంపరలోని గురువులను ఆ రోజున స్మరించుకొని కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తారు. వారి నుంచి స్ఫూర్తిని పొందుతారు. దివ్యమైన గురు పారంపర్య వ్యవస్థ వ్యాస మహర్షి ద్వారానే స్థిర పడిందన్నది నిర్వివాదం.

ఆది శంకరుని ప్రబోధాలు
కాగా, శబ్దాత్మకమైన వాజ్ఞ్మయం కలియుగంలో అనర్హులకు అందుబాటులోకి రావడం వల్ల, వారు వాటిని వక్ర మార్గం పట్టించి, పాషండ, నాస్తిక, వేద బాహ్య భావాల ప్రచారాన్ని సమాజంలో బాహాటంగా సాగించారు. ఈ సంక్షోభ సమయంలో జగద్గురువు ఆది శంకరాచార్యులవారు అవతరించారు. "నారాయణం, పద్మభువం, వశిష్టం, శక్తించ తత్ పుత్ర పరాశరంచ, వ్యాసం, శుకం, గౌడపదం మహాంతం, గోవింద యోగీంద్ర మధ అస్య శిష్యం, శ్రీ శంకరాచార్య, పద్మ పాదంచ, హస్తా మలకంచ శిష్యం, తం తోటకం వార్తిక కార మన్యాన్, అస్మత్ గురూన్ సంతత మానతోస్మి'' అనే శ్లోకం భారతీయ గురు పరంపరను రేఖా మాత్రంగా గుర్తు చేస్తుంది.

ఆదిలో ఈ జ్ఞానాన్ని నిర్గుణ పరతత్వమైన ఈశ్వరుడి నుంచి గ్రహించిన నారాయణుడితో గురు పరంపర ఆరంభమైంది. నారాయణుడి నుంచి బ్రహ్మకు, బ్రహ్మ నుంచి వశిష్టుడికి, వశిష్టుడి నుంచి శక్తికి, శక్తి నుంచి పరాశరునికి, పరాశరుని నుంచి వ్యాసునికి, ఆయన నుంచి శుకునికి, శుకిడి ద్వారా గౌడపాదునికి, గౌడపాదుని నుంచి గోవింద భగవత్పాదునికి, వారి నుంచి శ్రీ శంకరాచార్యులకు, వారి ద్వారా పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరుడు, తోటకాచార్యులకు లభించింది. ఈ నలుగురితో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన చతురామ్నాయ పీఠాలలో ఋష్య శృంగపుర, తుంగా తీర వాసమైన దక్షిణామ్నాయ జగద్గురు పీఠమే శృంగేరి క్షేత్రం. ఇలా పరంపరాగతమై తమ గురువు వరకు సంక్రమించిన ఈ అవిచ్ఛిన్న పరంపరను స్మరించుకుని తరిస్తారు సాధకులు.

అట్టి దివ్య పరంపరను చరిత్రగా కలిగిన మనమంతా భాగ్యశాలులం. ఆ పరంపరలో భాగమైన ఆమ్నాయ మఠ అనుగ్రహాన్ని పొంది, భారతీయులందరమూ ఈ గురు పూర్ణిమను సద్వినియోగం చేసుకుందాము.

మానవుడికి సందేశాత్మక విధానమే తగినదని భావించిన వేదవ్యాస మహర్షి అప్పటి వరకు రాశిగా ఉన్న వేద వాజ్ఞ్మయాన్ని విభజించి మంత్రాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలైన రూపాలతో చక్కటి వ్యవస్థను ఏర్పరచారు. వీటిలో భారతీయతకు, వైదిక వాజ్ఞ్మయానికి పట్టుకొమ్మ అయిన ఆత్మ తత్వాన్ని వ్యాసుల వారు బ్రహ్మ సూత్రాలుగా వెలికితీశారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఈ సూత్రాల రచన పూర్తికాగా, వాటిని ఆషాఢ పూర్ణిమ రోజున లోకానికి అంకితమిచ్చారు.

- శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ 

0 comments:

Post a Comment