Monday

ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ


జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ కంపెనీ ‘టెప్కో’ లే ఫుకుషిమా అణు ప్రమాదానికి కారకులని జపాన్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదానికి గురికావదానికి సునామీ ఒక్కటే కారణం కాదనీ అది వాస్తవానికి మానవ నిర్మిత వినాశనమని కమిటీ స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంటు ‘డైట్’ (Diet) నియమించిన ‘ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్’, తన అంతిమ నివేదికలో ఈ వాస్తవాన్ని వెల్లడించింది. ఏ ఒక్క వ్యక్తీ దీనికి కారణం కాదనీ, ప్రభుత్వమూ, రెగ్యులేటరీ వ్యవస్ధ, టెప్కో కంపెనీలు మొత్తంగా ఈ వినాశనానికి కారకులని కమిటీ స్పష్టం చేసిందని ఆస్ట్రేలియాకి చెందిన ఎస్.బి.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. బి.బి.సి ప్రకారం అధికారాన్ని ప్రశ్నించడంలో ఉదాసీనతనూ, సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా నివేదిక తప్పు పట్టింది.
“ప్రభుత్వం, (ప్రవేటు అణు కంపెనీలను నియంత్రించవలసిన న్యూక్లియర్) రెగ్యులేటర్లు, ప్లాంటు నిర్వాహకురాలైన టెప్కో కంపెనీ కుమ్మక్కు అయిన ఫలితమే టెప్కో ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో జరిగిన ప్రమాదం. ఈ మూడు పార్టీలలో పాలన (governance) లోపించడం వల్ల ప్రమాదం జరిగింది” అని కమిటీ అంతిమ నివేదిక పేర్కొంది. కమిటీ మాటల్లోనే చెప్పాలంటే…
“The TEPCO Fukushima Nuclear Power Plant accident was the result of collusion between the government, the regulators and (plant operator) TEPCO, and the lack of governance by said parties. … … … They effectively betrayed the nation’s right to be safe from nuclear accidents. Therefore, we conclude that the accident was clearly ‘man-made.”
“అణు ప్రమాదాల నుండి భద్రంగా ఉండడానికి దేశానికి గల హక్కుకు వారు సమర్ధవంతంగా ఢోకా యిచ్చారు. కనుక (ఫుకుషిమా) ప్రమాదం మానవ తప్పిదమేనని స్పష్టంగా నిర్ధారిస్తున్నాం” అని కమిటీ నివేదిక పేర్కొంది. 900 గటల పాటు పని చేసిన కమిటీ వయ్యిమందికి పైగా సాక్ష్యాలు సేకరించిందని బి.బి.సి తెలిపింది.
అనేక స్వచ్ఛంద సంస్ధలు, కార్యకర్తలు, స్వతంత్ర పరిశీలకులు, శాస్త్రవేత్తలు ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిన అంశాలను జపాన్ పార్లమెంటు కమిటీ నివేదిక నిర్ద్వంద్వంగా బలపరిచింది. జపాన్ ప్రభుత్వం ప్రమాదానికి కారకురాలయిన కంపెనీని బాధ్యురాలిని చేయడానికి బదులు దానిని కాపాడడానికే పూనుకుందని వివిధ వార్తా సంస్ధలు ప్రచురించిన కధనాలు వాస్తవాలేనని కమిటీ నివేదిక ద్వారా రుజువయింది. లాభాపేక్షతో ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలే అణు కంపెనీలను నియంత్రించడానికి కృషి చేయవలసిన ప్రభుత్వ ‘రెగ్యులేటరీ వ్యవస్ధలు’ ఆచరణలో కంపెనీలతో కుమ్మక్కయ్యాయని నివేదిక ద్వారా స్పష్టమయింది.
20 మీటర్ల ఎత్తు అలలతో విరుచుకు పడిన సునామీ వల్లనే ఫుకుషిమా అణు కర్మాగారం లో ప్రమాదం సంభవించిందే తప్ప ఇందులో తమ తప్పేమీ లేదని ఫుకుషిమా అణు కర్మాగారం నిర్వాహక కంపెనీ టెప్కో పదే పదే చెబుతూ వచ్చింది. సునామీ అలలవల్ల జనరేటర్లు పని చేయకపోవడంతో ‘బేకప్’ విద్యుత్ అందలేదనీ, దానితో కూలింగ్ వ్యవస్ధ పని చేయడం ఆగిపోయాయని కంపెనీ వాదించింది. శీతలీకరణ ప్రాక్టియ ఆగిపోవడంతో రియాక్టర్లలో ఇంధన రాడ్లు వేడెక్కి కరిగిపోయాయనీ ఆ తర్వాతే ‘మెల్ట్ డౌన్’ (ఇంధన రాడ్లు కరిగిపోవడం) మొదలయిందనీ టెప్కో మొదటినుండీ వాదించింది. జపాన్ ప్రభుత్వం కంపెనీ వాదనలో నిజా నిజాలను విచారించడానికి బదులు పూర్తి మద్దతు అందజేసింది.
అయితే ఆ తర్వాత వెల్లడయిన వాస్తవాలు కంపెనీ, ప్రభుత్వాల వాదనకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. అణు కర్మాగారంలో నిర్మాణాలు సరైన నిర్వహణ లేక బలహీనపడడంతో భూకంపం ధాటికి దెబ్బతిన్నాయనీ, మరో అరగంటకు సునామీ అలలు విరుచుకుపడే లోపే రియాక్టర్లకు జరగవలసిన నష్టం జరిగిపోయిందనీ బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ గత సంవత్సరం ఆగస్టు లో పరిశోధనాత్మక కధనం ప్రచురించింది. (దాని ఆధారంగా ఈ బ్లాగ్ లో రాసిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.)
‘ది ఇండిపెండెంట్’ తో పాటు అనేక మంది స్వచ్ఛంద మరియు స్వతంత్ర కార్యకర్తలు, ప్రొఫెసర్లు, రేడియాలజిస్టులు, పర్యావరణవేత్తలు వివిధ పద్ధతుల్లో ఇలాంటి వాస్తవాలను వెల్లడి చేశారు. అయితే జపాన్ ప్రభుత్వం గానీ, టెప్కో కంపెనీ గానీ తమ అబద్ధాలను సవరించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కావచ్చు, పోవచ్చు అంటూ సన్నాయి నొక్కులు నోక్కేరే తప్ప ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ఎన్నడూ సిద్ధపడలేదు. జపాన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో వారి మోసాలు మరోసారి ధ్రువపడ్డాయి.
కేవలం వ్యక్తులను నిందించడానికి పార్లమెంటరీ కమిటీ ఇష్టపడలేదు. ప్రభ్యుత్వ పాలనా వ్యవస్ధలు, కంపెనీల నియంత్రణా వ్యవస్ధలు అనుకున్న విధంగా తగిన పద్ధతుల్లో పని చేయకపోవడాన్ని అది తప్పు పట్టింది. తన నివేదికలో కమిటీ ఇంకా ఇలా పేర్కొంది. “ఎవరైనా ఒక నిర్ధిష్ట వ్యక్తి సమర్ధతకు సంబంధించిన అంశాల కంటే, వివిధ నిర్ణయాలకూ, చర్యలకూ తప్పుడు హేతువులతో మద్దతు ఇచ్చిన సంస్ధాగత మరియు నియంత్రణా వ్యవస్ధలే మూల కారణాలని మేము నమ్ముతున్నాం.” (“We believe that the root causes were the organisational and regulatory systems that supported faulty rationales for decisions and actions, rather than issues relating to the competency of any specific individual.”)
సునామీ వల్ల జరిగిన నష్టం పైనే కేంద్రీకరించడానికి బదులు దానికంటే ముందు వచ్చిన భూకంపం వల్ల జరిగిన నష్టంపై మరింత పరిశోధన జరగాలని కమిటీ నివేదిక కోరింది. తప్పు మొత్తం ‘ఎవరూ ఊహించని సునామీ’ పైకి నెట్టడానికే కంపెనీ ప్రధానంగా ఆసక్తి చూపింది. జపాన్ భూభాగంలో భూకంపాలు సర్వ సాధారణం కనుక భూకంపం పై తప్పు నెట్టే అవకాశం కంపెనీకి లేదు. భూకంప ప్రాంతాల్లో వాటికి తట్టుకునే విధంగా కర్మాగారం డిజైన్ ఉండాలి. తమ డిజైన్ ఎంతటి భూకంపాలకైనా తట్టుకుంటుందని న్యూక్లియర్ కంపెనీ ఊదరగొట్టడం వల్ల భూకంపంపై సాకు చూపే అవకాశం టెప్కో కోల్పోయింది. అందువల్ల ఎవరూ ఊహించని ఎత్తులో సునామీ అలలు విరుచుకుపడ్డాయనీ కనుక ప్రమాదానికి తమ బాధ్యత లేదనీ కంపెనీ వాదించింది. ప్రభుత్వం కూడా ఈ వాదనకు వంతపాడింది. అనేక మంది శాస్త్రవేత్తలు, కార్యకర్తలు ఈ వాదనను సాధికారికంగా ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం, కంపెనీ తలొగ్గలేదు.
పార్లమెంటరీ కమిటీ ఈ వాదనను మరో ఆలోచనకు తావు లేకుండా తిరస్కరించింది. నివేదిక ఇలా పేర్కొంది. “ప్రమాదానికి నేరు కారణం ఏమిటన్న విషయానికి వస్తే, భద్రతకు ముఖ్యమైనవిగా భావించిన పరికరాలు భూకంపం వల్ల పాడైపోలేదని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పలేము. నిర్ధిష్టంగా చెప్పాలంటే, రియాక్టర్ నెం. 1 వద్ద కూలెంట్ (రియాక్టార్లను చల్లబరిచే నీరు) కు నష్టం జరిగిన అవకాశాన్ని కొట్టిపారవేయలేము.” అని పేర్కొంది. దీనర్ధం కంపెనీ వాదనలో నిజం లేదనే. భూకంపం వల్లనే శీతలీకరణ ప్రక్రియ దెబ్బతిన్నదని పార్లమెంటరీ కమిటీ ధృవీకరించిందన్నమాట.
భూకంపాలను తట్టుకోవడానికి తాము అనేక భద్రతా వ్యవస్ధలను అభివృద్ధి చేశామని అణు పరిశ్రమ వర్గాలు అనేక యేళ్ళుగా గొప్పలు చెప్పుకున్నాయి. అవి నిజం కాదని ఫుకుషిమా ప్రమాదం తేల్చి చెప్పింది. తమ గొప్పలు నిజమే అని చెప్పుకోవడానికి పరిశ్రమ నెపాన్ని సునామీ పైకి తోసిందన్నమాట.
కర్మాగారంలో భద్రతను పటిష్టపరిచే చర్యలను తీసుకోకుండా టెప్కో నిర్లక్ష్యం చేసిందని కమిటీ తప్పు పట్టింది. “భూకంప వ్యతిరేక పనులు ఆలస్యం అయ్యాయనీ, సునామీ వ్యతిరేక భద్రతా చర్యలను వాయిదా వేశారనీ టెప్కో యాజమాన్యానికి ముందే తెలుసన్న విషయం మేము పరిగణిస్తున్నాం. ఫుకుషిమా దాయిచి ప్లాంటు (ఫుకుషిమా నెం.1 ప్లాంటు) బలహీనంగా ఉండని కూడా వారికి తెలుసని పరిగణిస్తున్నాం” అని నివేదిక పేర్కొంది. ప్రమాదం ప్రారంభ దశలో నిజాయితీగా స్పందించడంలో టెప్కో విఫలమయిందని కూడా నివేదిక పేర్కొంది. అయితే ఈ వైఫల్యం వ్యక్తులది కాదనీ వ్యవస్ధలదేననీ అభిప్రాయపడింది.
‘న్యూక్లియర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఏజన్సీ’ (ఎన్.ఐ.ఎస్.ఎ) అనే సంస్ధ జపాన్ లో న్యూక్లియర్ కంపెనీలను నియంత్రించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ సంస్ధ. ఈ సంస్ధ తన విధులని నిర్వహించడంలో ఘోరంగా విఫలం అయిందని డైట్ కమిటీ నిర్ధారించింది. ప్రమాదం అనంతరం తగిన చర్యలు తీసుకొనేలా టెప్కో ను పురమాయించలేకపోయిందని పేర్కొంది. వివిధ విషయాలలో తప్పులు జరుగుతున్నాయని తెలిసినా నిష్క్రియాపరంగా ఉండిపోయిందని తెలిపింది. “తీసుకోవలసిన చర్యలను టెప్కో వాయిదా వేస్తున్నదని ఎన్.ఐ.ఎస్.ఎ కి తెలుసు. కానీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. గత ప్రమాదాలను మించిపోయిన ఈ విపత్తును ఎదుర్కోవడానికి అది సిద్ధంగా లేదు” అని నివేదిక పేర్కొంది.
ఫుకుషిమా ప్రమాదం పై అత్యంత ముఖ్యమైన పార్లమెంటరీ కమిటీ నివేదికపై వార్తలు ప్రచురించడానికి పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒకటో రెండో వార్తలు రాసినా అందులో వివరాలేవీ లేవు. న్యూక్లియర్ కంపెనీల ప్రయోజనాలకు నష్టకరంగా ఉండే వార్తలంటే వీటికి గిట్టవని దీని ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment