Wednesday

తలనొప్పి వేధించే తీరులో భిన్నత్వాలు


ప్రస్తుత కాలంలో ప్రతి వారినీ తరచుగానో, అరుదుగానో ఏదో ఒక సమయంలో వేధించే సర్వసాధారణ సమస్య తలనొప్పి. నిజానికి తలనొప్పి ఒక వ్యాధి కాదు. వివిధ శారీరక, మానసిక రుగ్మతల్లో వ్యక్త మయ్యే లక్షణమే. తల, మెదడుకు సంబంధించిన బాహ్య, అభ్యం తర, స్థానిక కారణాల వలన కొన్ని విధాలైన తలనొప్పులు సంభవిస్తే, శరీరంలోని ఇతర భాగాల్లో వ్యాధిగ్రస్తమైన అంగాల, అవయవాల ప్రభావం తాలూకు లక్షణాల్లో ఒకటిగా తలనొప్పి వస్తుంది.
లక్షణం ఒకటే అయినా, తల నొప్పి వేధించే తీరు భిన్నంగా ఉంటుంది. సూదులతో గ్రుచ్చినట్లుగానూ, తలపై బరువు పెట్టినట్లు గానూ, తల దిమ్ముగా ఉన్నట్లుగానూ, తలంతా భగభగ మండుతున్న ట్లుగానూ, గునపాలతో గుచ్చినట్లుగానూ, రంపంతో కోసినట్లుగానూ, సుత్తులతో మోదుతున్నట్లుగానూ ఉంటుంది. వ్యాధి ఉధృతమయ్యే సమయం, వేధించే వ్యవధి, ఇతర అనుబంధ లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి.
కొన్ని తలనొప్పులు దైనందిన జీవనశైలి, కార్యక్రమాలకు అంత రాయం కలిగిస్తే, మరికొన్ని ప్రాణాంతకంగా కూడా తయారవు తుంటాయి. ఏది ఏమైనప్పటికీ, తలనొప్పులకు సంబంధించిన ప్రాథ మిక అవగాహనను ఏర్పరచుకుంటే, దానిని ఎదుర్కోవడటం అంత కష్టతరం కాదు.
తలకు ఇరుపక్కలా నొప్పిగానూ, బరువు పెట్టినట్లు,, బిగించినట్లు కొందరిలో తలనొప్పి వస్తుంది. ఆందోళన, ఆతృత, మనోవ్యాకులత, ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి అతిగా చింతిస్తుండటం మొదలైన కారణాల వలన వచ్చే ఇలాంటి తలనొప్పిని ఆధునికులు టెన్షన్‌ హెడేక్‌గా వ్యవహరిస్తారు. జీవన శైలిలో మార్పులు చేసుకుని, మాన సిక ప్రశాంతత అలవరచుకోవడం, యోగ, ధ్యానంలాంటి ప్రక్రియలు వీరికి బాగా ఉపయోగపడుతాయి.
మనం తీసుకునే ఆహార వేళల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం, నియమిత వేళల్లో పరిమిత ఆహారం తీసుకోవడం, సరిపడని ఆహారం తీసుకోవడం, అకాల భోజనం మొదలైన కారణాల వలన కూడా తలనొప్పి వస్తుంటుంది. ఆహారపు అలవాట్లను నియమబద్ధం చేసు కుంటే ఈ సమస్య ఉండదు.
కొందరిలో నుదురు భాగంలో కంటికి పైన ఉండే సైనస్‌ అనే గాలి కుహరాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు సాధారణంగా ఉదయంపూట ఎక్కువగా ఉంటూ, ఎండపడే కొద్దీ క్రమేపీ తగ్గిపోతుండటం, ముందుకు వంగినప్పుడు నొప్పి ఎక్కువ కావటం అనే లక్షణలతోపాటు జ్వరం, వాంతులుకూడా అనుబంధంగా ఉంటాయి. దీనిని సైనసైటిస్‌ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధికి ప్రారంభావస్థలో తరచూ జలుబు చేస్తుండటం ప్రధాన లక్షణంగా ఉంటుంది.
కొంతమందిలో హ్రస్వ, దీర్ఘ దృష్టి, ఇతర కొన్ని నేత్ర సంబంధ రుగ్మతల్లో అడపాదడపా కణతల వద్ద నొప్పిగానూ, నుదుటిమీద బరువు పెట్టినట్లుగానూ ఈ తలనొప్పి వ్యక్తవమవుతుంటుంది. నేత్ర వైద్యులను సంప్రదించి తదనుగుణ చికిత్సతో ఇది తగ్గిపోతుంది.
అలాగే రక్తపోటు వ్యాధిపీడితుల్లో తలనొప్పి కనిపించే అవకాశ ముంది. ముఖ్యంగా డయాస్టోలిక్‌ ప్రెషర్‌ 110 ఎంఎంహెచ్‌జి దాటిన వారిలో తప్పక ఈ తలనొప్పి అనుబంధంగా ఉండే అవకాశం హెచ్చు. చేతులు, కాళ్లు, శరీరంలో వణుకు, కోపం, గుండెదడ మొదలైన లక్షణాలు కూడా వీరిలో కనిపిస్తాయి.
తలకు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయమైనప్పుడు కలిగే తలనొప్పి క్రమంగా కొన్నాళ్లకు తగ్గిపోతుంది. అలా కాకుండా, రోజురోజుకు తీవ్రతరమవుతుంటే మెదడులోని అంతర్గత సమస్యగా భావించి, తాత్సారం చేయకుండా వైద్యనిపుణలను సంప్రదించాలి.
మెదడుకు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్లో అకస్మాత్తుగా తీవ్ర తలనొప్పితోపాటు జ్వరం, మెడ బిగదీసుకుపోవడం, వాంతులు, నడకలో మార్పులు రావడం, మాటల్లో స్పష్టత లేకపోవడటం, వెలు తురు చూడలేకపోవడం, మతి చాంచల్యం, ఒళ్లు నొప్పులు, అనియం త్రత మూత్ర, మల విసర్జన, మూర్ఛల వంటి లక్షణాలుంటే వైద్య నిపుణులను సంప్రదించి, తగు చికిత్సలు చేయించుకోవాలి.
కొన్నిసార్లు వ్యాధి నిర్ధారణలో భాగంగా పరీక్షల నిమిత్తం వెన్ను పామునుంచి ద్రవాన్ని సూది ద్వారా తీసిన తరువాత తలనొప్పి వస్తుంది. ఇటువంటి తలనొప్పి పడుకున్నప్పుడు ఉపశమిస్తుంది. కొంతమందిలో ఎటువంటి స్పష్టమైన, నిర్దిష్టమైన కారణాలు లేకుండా, అజీర్తి, మలబద్ధకంలాంటి సమస్యల వలన కూడా తలనొప్పి వస్తుంది.
కొన్ని కుటుంబాలలో, ముఖ్యంగా మహిళలలో మైగ్రెయిన్‌ అనే తలనొప్పి సాధారణంగా కనిపిస్తుంటుంది. ఈ నొప్పి చాలామందిలో చిన్న వయస్సు లేదా యవ్వనదశలో ప్రారంభమై ఇంచుమించు బహిష్టులాగిపోయిన తరువాత కనిపించకపోవచ్చు. తలకు ఒకవైపే నొప్పి రావటం, మళ్లీ, మళ్లీ సంభవించే ఈ నొప్పి వ్యవధి, తీవ్రత వ్యక్తికి, వ్యక్తికి మధ్య మారుతుంటాయి.
ఈ తలనొప్పి తీవ్రస్థాయిలో విజృంభించిన దశలో నోట్లో నీరూ రటం, వాంతులు, మానసిక అస్తవ్యస్థత, నరాల బలహీనత కలుగు తాయి. అలాగే వెలుతురును చూడలేకపోవడం, వెలుతురు వలన తలనొప్పి మరింత ఎక్కువ కావటం, తలనొప్పి ఉన్న భాగంపై స్పర్శ తగిలితే భరించలేకపోవడంవంటివి అనుబంధ లక్షణాలుగా ఉంటాయి.
మానసిక వత్తిడి, తలకు దెబ్బ తగలడం, బహిష్టు సమయం, మద్యపానం, ఎండలో ఎక్కువసేపు ఉండటం, ఉపవాసం, కొన్ని రకాల ఆహార పదార్థాలు ఈ వ్యాధి ఉధృతకు దోహదపడుతాయి.
అదే విధంగా 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో వేధించే మరొక విధమైన తలనొప్పి క్లస్టర్‌ హెడేక్‌. నిద్రకు ఉపక్రమించిన రెండు మూడు గంటల తరువాత తలనొప్పి ఒక వైపు కంటి ప్రక్కన మొదలై, ఎంత అకస్మాత్తుగా విజృంభిస్తుందో, అంత అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ఈ విధంగా కొన్ని వారాలపాటు రాత్రి వేళల్లో ఇబ్బంది పెడుతూ, ఒక దశలో సంపూర్ణంగా తగ్గిపోయి, మళ్లీ కొన్నేళ్ల వరూ కనిపించకుండా పోవచ్చు.

0 comments:

Post a Comment