Thursday

షరా మామూలే


పార్లమెంటులో నల్లధనంపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేత పత్రం నిష్ఫలమైనదిగా నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నల్ల కుబే రుల జాబితాను బయటపెట్టడంలో విఫలమయ్యారు. దాదాపు 1930ల నుంచి పన్ను ఎగవేతదారుల వద్ద నల్లధనం గుట్టలుగుట్టలుగా పేరుకొన్న వైనాన్ని ఆ వంద పేజీల శ్వేత పత్రం స్థూలంగా వివరించింది. నల్లధనం సమస్యను పేర్కొన్నదే గాని దాని పరిష్కారాన్ని ఆ పత్రం దాటవేసింది. గుప్త సంపద సమస్యపై చర్చను 2009 ఎన్నికల్లో బీజేపీ మొదటగా రంగం మీదకు తెచ్చింది. నల్లధనం వెలికితీత అంశాన్ని ఒక ఉద్వేగభరిత ఎన్నికల నినాదంగా బీజేపీ ప్రచారంలోకి తేవడం ఆహ్వానించదగినదే. 

దాంతో ఈ విషయంపై గత మూడేళ్ళుగా ముమ్మరంగా చర్చలు సాగాయి. సుప్రీంకోర్టు అనేకమార్లు ఈ అంశంపై ఘాటైన విమర్శలు చేసింది. నల్లధనం గురించి వివిధ సంస్థల నివేదికల్లో వెల్లడైన గణాంకాలను మాత్రమే ఈ శ్వేత పత్రం ప్రస్తావించింది. అక్రమార్జనను అరికట్టడానికి ప్రభుత్వం కొన్ని నియంత్రణ చర్యలను సూచించడం మినహా శ్వేత పత్రంలో కొత్తదనమేదీ లేదు. విదేశీ రహస్య ఖాతాల్లోని నల్లధనం భారతీయులదే ఎక్కువగా ఉందని అనేక నివేదికలు చెబుతున్నాయి. 

గుప్తధనం విషయంలో మెక్సికో, రష్యా తదితర దేశాల కంటె భారత్ చాలా వెనకబడి పదిహేనవ స్థానంలో ఉందని శ్వేత పత్రం చెప్పడం విడ్డూరం. అయితే విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనం 25 లక్షల కోట్ల రూపాయల దాకా ఉంటుందని సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ ఇటీవలి ఇంటర్‌పోల్ అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. స్విస్ తదితర విదేశీ బ్యాంకులలో భారతీయుల అక్రమార్జన 10,400 కోట్ల డాలర్లు (డాలరు=56రూపాయలు) మూలుగుతున్నట్లు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (జీఎఫ్ఐ) సంస్థ అంచనా. అక్రమంగా సంపాదిస్తున్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మాఫియా ముఠాలు, పన్నులు ఎగవేసిన అక్రమ వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల రూపాయలను స్విస్ బ్యాంకులలోకి తరలించారు. 

హవాలా లావాదేవీలు, స్టాక్ మార్కెట్ కార్యకలాపాల మాటున కోట్లాది రూపాయలు విదేశీ బ్యాంకులకు రహస్యంగా పోతున్నాయి. 2010లో కేవలం 9295 కోట్ల రూపాయలు మాత్రమే తరలి వెళ్ళినట్లు శ్వేత పత్రం చెబుతోంది. ప్రభుత్వ కొనుగోళ్ళు, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు నల్ల ధన జన్మస్థానాలుగా ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు గడించిన ఆదాయంలో అధిక భాగాన్ని ఆదాయం పన్ను మినహాయింపుగల తమ స్వచ్ఛంద సంస్థల ఖాతాలలోకి తరలించడం కద్దు. అదే సమయంలో ద్రవ్య మార్కెట్ల ద్వారా సాగే ప్రారంభ పెట్టుబడి సమీకరణ (ఐపీఓ), విదేశీ మదుపు సంస్థల ద్వారా సాగే పి-నోట్స్ (పార్టిసిపేటరీ నోట్స్) వంటి స్టాక్ మార్కెట్ లావాదేవీలు, రియల్ ఎస్టేట్, ఆభరణాలు, బంగారం, వెండి వజ్రాలు తదితర విలువైన వస్తువుల మార్కెట్లు కూడా ప్రధానంగా నల్లధన తయారీ కేంద్రాలుగా ఉన్నాయి. 

స్వాతంత్య్రానంతరం దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగిన లైసెన్స్ రాజ్‌లోని పన్నుల వ్యవస్థ కారణంగా దేశంలోని అక్రమార్జన దాదాపుగా స్విస్ బ్యాంకులకు తరలింది. సరళీకరణ విధానాలతో కూడిన తొలి విడత ఆర్థిక సంస్కరణల కారణంగా సగటు దేశీయోత్పత్తి (జీడీపీ) పెరిగింది. కార్పొరేట్ సంస్థల ఆదాయాలు అనూహ్యంగా పెరిగాయి. పాత పన్నుల వ్యవస్థ ఒక మేరకు సరళీకరణకు గురైనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే పన్నులు అధికంగా ఉండటంతో 2008 దాకా దేశంలోని అక్రమార్జన విదేశీ బ్యాంకుల తరలడం వేగవంతమైంది. 

ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా అభివృద్ధి చెందిన అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. దాంతో అమెరికా, నైజీరియా, ఫిలిపైన్స్, మెక్సికో, జర ్మనీ తదితర దేశాలు స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న తమ దేశ కుబేరుల అక్రమ ధనాన్ని తిరిగి రాబట్టుకున్నాయి. ఆ సమయంలో విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న కొందరు భారతీయ కుబేరుల జాబితాను జర్మనీ మన దేశానికి అందజేసినప్పటికీ యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

భారత్‌దేశ ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా సత్వర అభివృద్ధి చెందుతుండడంతో దేశీయ అక్రమార్జన విదేశాలకు తరలిపోవడం మందగించింది. అదే సమయంలో 2009 నుంచి స్విట్జర్లాండ్, లీఖ్టెన్ స్టీన్, లక్సెంబర్గ్, మోనాకో తదితర దేశాలలోని బ్యాంకులు పారదర్శకంగా మారడంతో నల్ల కుబేరులకు సమస్యలు వచ్చాయి. దాంతో భారతీయ గుప్త సంపదలు సొంత గడ్డ మీదనే ఎన్నడూ లేని విధంగా పోగు పడ్డాయి. భారతీయులు తమ అక్రమార్జనను స్వదేశంలోనే పెద్దఎత్తున దాచుకుంటున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో దేశంలో బినామీల రూపంలో, ఇతరత్రా మూలుగుతున్న గుప్తధనాన్ని నియంత్రించడంపై, వెలికి తీయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భారతదేశంలో ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా (19 బిలియన్ డాలర్లు) గుప్త ధనం పుట్టుకొస్తోందని జీఎఫ్ఐ అంచనా. ఈ డబ్బు మన ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీన్ని అడ్డుకునే శక్తి, చేవ తమకు లేదని శ్వేత పత్రం ద్వారా ప్రభుత్వం ఒప్పుకున్నది. అయితే మారిన జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల కనుగుణంగా సరళమైన నియమాలతో, కచ్చితమైన అమలు నిబంధనలతో కూడిన పన్నుల విధానాన్ని రూపొందించాలి.

0 comments:

Post a Comment